పోలవరంపై నోరు మెదపని జగన్
posted on May 30, 2014 @ 11:21AM
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ సీమాంధ్ర ప్రజలను పదేపదే నిందిస్తూ చాలా అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు స్పందించడంలేదని, వారిరువురికీ మధ్య ఉన్న ఉన్న రహస్య అవగాహన బయటపెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా సార్లు ప్రశ్నించారు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి జవాబీయలేదు. కనీసం ఆ తరువాత అయిన కేసీఆర్ని పల్లెత్తు మాటన్న దాఖలాలు లేవు. కేసీఆర్ పట్ల అతని వైఖరిలో మార్పు కనబడలేదు. పవన్ కళ్యాణ్ సందించిన ప్రశ్నలకు జావాబు చెప్పకపోవడం, కేసీఆర్ పట్ల జగన్ అదే వైఖరి కొనసాగించడం కూడా వైకాపా ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటని చెప్పవచ్చును. పోలవరం విషయంలో ఆయన ఇంతవరకు కూడా స్పందించక పోవడం చూస్తే, ఓటమి తరువాత కూడా కేసీఆర్ విషయంలో జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. అంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజమేనని భావించవలసి ఉంటుంది.
రాష్ట్రంలో అన్ని పార్టీలు, నేతలు కూడా పోలవరం విషయంలో వారివారి రాష్ట్రాలకు, పార్టీల వైఖరికి అనుగుణంగా స్పందిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఈ విషయంలో నోరుమెదపక పోవడం చాలా విచిత్రం. ఎన్నికల ప్రచార సమయంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని పదేపదే చెప్పిన ఆయన, ఇప్పుడు కనీసం దానికి మద్దతుగా ఎందుకు మాట్లడట్లేదు? అనే ప్రశ్నకు వైకాపా నుండి జవాబు రావలసి ఉంది. తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టబోతున్న కేసీఆర్ స్వయంగా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణా బంద్ కు పిలుపిస్తే, వైకాపా దానిపై స్పందన నామమాత్రంగా ఉంది.
జగన్ గెలుపుపై అతని కంటే ఎక్కువ నమ్మకం వ్యక్తం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన జగన్ ముఖ్యమంత్రి అయితే అతనితో కలిసి పనిచేసేందుకు సిద్దమని జగన్ అడగక ముందే ప్రకటించారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయి ఉంటే, అప్పుడు కూడా కేసీఆర్ పోలవరం ముంపు గ్రామాల విషయంలో ఇదేవిధంగా ప్రవర్తించేవారా? ప్రవర్తిస్తే జగన్ ఇప్పటిలాగే మౌనం దాల్చేవారా? వారిరువురే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ, తాము అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించామని గొప్పగా చెప్పుకొన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల గురించి తన రహస్య స్నేహితుడు కేసీఆర్ అంత రాద్ధాంతం చేస్తున్నపుడు, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు, ఆయన వాదనలను ఖండించట్లేదు? ఎందుకు నోరు విప్పి మాట్లాడటం లేదు? కనీసం ఈవిషయంలో తమ పార్టీ వాదనలయినా ఎందుకు వినిపించలేక పోతున్నారు?
జగన్ వైఖరి చూస్తుంటే నేటికీ కేసీఆర్ విషయంలో అతని వైఖరిలో ఎటువంటి మార్పు కలగలేదని స్పష్టమవుతోంది. కేసీఆర్ పట్ల జగన్, జగన్ పట్ల కేసీఆర్ అంత మెతక వైఖరి అవలంబించడానికి ఏదో చాలా బలమయిన కారణమే ఉండి ఉండవచ్చును. అదేమిటో నేడు కాకపోతే రేపయినా బయటపడటం తధ్యం. కానీ, పోలవరం విషయంలో కూడా నేడు జగన్ ఎందుకు స్పందించడం లేదో చెపితే ప్రజలు చాలా సంతోషిస్తారు.