మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్న తెదేపా తెలంగాణా నేతలు
posted on May 28, 2014 @ 4:38PM
నిన్నటి మహానాడు సమావేశాలకి తెదేపా సీనియర్ నేత రేవంత్ రెడ్డితో సహా మరి కొందరు తెలంగాణా నేతలు హాజరు కాకపోవడంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈరోజు సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవడమే కాక, తను తెలంగాణాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ.2లక్షలు విరాళం ఇస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. అంతేకాక పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మరో రూ.5 లక్షల విరాళాలు కూడా ఇచ్చారు.
మరో సీనియర్ తెలంగాణా నేత మోత్కుపల్లి నరసింహులు మహానాడు సమావేశంలో మాట్లాడుతూ, స్వర్గీయ యన్టీఆర్ ఆనాడు తనకు పార్టీ టికెట్ ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించడం వలననే నేడు ఈ స్థాయికి ఎదగగలిగానని, అందువల్ల ఎల్లపుడు తెదేపాకు తాను ఋణపడి ఉంటానని అన్నారు. తెలంగాణా ఉద్యమాల సమయంలో తనకు ఇతర పార్టీల నుండి చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని, అయినా తాను ఎన్నడూ పార్టీని వీడే యోచన చేయలేదని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.
ఈసారి ఎన్నికలలో అనేకమంది తెదేపా నేతలు తెలంగాణాలో ఓడిపోయారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వంటి కొందరు నేతలు ఎన్నికలలో గెలిచినప్పటికీ, తెలంగాణాలో తమపార్టీ అధికారంలోకి రాకపోవడం వలన, వారికీ తమ గెలుపు వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందువల్ల వారందరూ నిరుత్సాహానికిగురయిన మాట యధార్ధమే. కానీ, కాంగ్రెస్ కంటే తమ పరిస్థితి అన్నివిధాల మెరుగా ఉండటమే వారికి ఒకింత ఊరట కలిగిస్తోంది. త్వరలో తెలంగాణకు ప్రత్యేకంగా తెదేపా శాఖను ఏర్పాటు చేసినట్లయితే అందులో కీలక పదవులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకరిద్దరు మినహాయించి దాదాపు అందరూ మహానాడు సమావేశాలలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పట్టబోతున్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాలోని తన పార్టీని, నేతలని, కార్యకర్తలని ఏవిధంగా ముందుకు నడిపిస్తారో, వారిని ఏవిధంగా ఆదుకొంటారనే దానిపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.