కేసీఆర్ అందుకే కయ్యానికి కాలు దువ్వుతున్నారా?
posted on May 27, 2014 @ 5:35PM
కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చాలా హడావుడిగా రాష్ట్ర విభజన చేసి, ఎన్నికలలో గెలవలేక చేతులు దులుపుకొని వెళ్లిపోయింది. రాష్ట్రవిభజనతో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్ర ప్రజలను చల్లబరిచేందుకు, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని ప్రకటించింది. అయితే ఆ ప్రాజెక్టు క్రింద తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని వందల గ్రామాలు ముంపునకు గురవుతాయని గ్రహించి, ఆ ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన బిల్లులో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన చేసినప్పుడే కేసీఆర్ ఉద్యమం చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ, ఆనాడు కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబందాలున్న కారణంగా పోలవరంపై రగడ చేయలేదు. ఆ దైర్యంతోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో ముంపు ప్రాంతాలను ఆంధ్రాకు బదలాయించింది.
ఇప్పుడు మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది గనుక సత్వరమే దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని మీడియాలో వస్తున్న వార్తలను చూసి, తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ మోడీ ప్రభుత్వం తమ సమ్మతి లేకుండా సరిహద్దులు మారుస్తూ ఆర్డినెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తే తాము మళ్ళీ ఉద్యమం మొదలుపెడతామని హెచ్చరించారు. ఆర్టికల్ 3ప్రకారం చేయవలసిన పనిని ఆర్డినెన్స్ ద్వారా చేయాలని చూస్తే తాము ఖచ్చితంగా అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. అవసరమయితే ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతే ఏ నిర్ణయమయినా తీసుకోవాలని కేసీఆర్ మోడీకి సూచించారు.
అయితే ముఖ్యమంత్రిగా బాధ్యత చేప్పట్టబోతున్న కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల విషయంలో, ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల గురించి ఈ విధంగా మాట్లాడటానికి అసలు కారణం మాత్రం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఎన్నికలలో పోటీ చేసి అధికారం దక్కించుకోగలిగారు కానీ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదు. పైగా ఎన్నికలలో గెలిచేందుకు ఆయన ప్రతీ కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంద విద్య వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. అవికాక విద్యుత్, సాగునీరు, ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే అవ్వన్నీ పరిష్కరించడం అంత తేలికయిన విషయం కాదు. బహుశః అందుకే ఆయన తనకు బాగా తెలిసిన విద్యను మళ్ళీ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణా ప్రజలు దోపిడీకి గురవుతున్నారంటూ మళ్ళీ వారిలో సెంటిమెంటు రాజేసి, వారి దృష్టిని మళ్ళించే ప్రయత్నంలోనే ఆయన ఈవిధంగా కయ్యాలకు దిగుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విశేష ప్రజాధారణతో డిల్లీ పీఠం ఎక్కిదిగిపోయిన అరవింద్ కేజ్రీవాల్ అందుకు సజీవ ఉదాహరణ అంటున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం నడపడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే నిత్యం గొడవలు పెట్టుకొంటూ, ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా డిల్లీ రోడ్ల మీద నిరసన దీక్షలు చేసేరు. చివరికి ఒకమంచి రోజు, ఒక కుంటి సాకు చూసుకొని అధికారంలో నుండి దిగిపోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ కూడా అచ్చు అరవింద్ కేజ్రీవాల్ లాగే ఇప్పుడు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన కేజ్రీవాల్ లాగ మధ్యలో అధికారం వదులుకోరని చెపుతున్నారు.
వారి విశ్లేషణే నిజమయితే, ఇకపై రానున్న ఐదేళ్ళు కూడా కేసీఆర్ ఏదో ఒక కుంటి సాకుతో ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూనే ఉంటారనుకోవలసి ఉంటుంది. తెలంగాణా ప్రజలకు అనేక ఆశలు కల్పించి వాటిని నెరవేర్చకుండా ఇలా ఏదో ఒక వంకతో వారి దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నిస్తూ కాలక్షేపం చేసేయవచ్చని కేసీఆర్ భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.