తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
posted on Jun 2, 2014 9:17AM
తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు తన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత వారితో కలిసి అక్కడి నుండి నేరుగా రాజ్ భవన్ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు తెలంగాణా రాష్ట్ర తొలి గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన నరసింహన్, కేసీఆర్ చేత తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
కేసీఆర్ తో బాటు ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్, మహమూద్ అలీ, ఈటెల రాజేందర్, నాయిన నరసింహా రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, పద్మారావు, రాజయ్య,జోగు రామన్న, కొప్పుల ఈశ్వర్, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.
రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్, బీజేపీ, తెరాస నేతలు చాల మంది హాజరయ్యారు. కానీ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి లను ఆహ్వానించక పోవడంతో తెలుగుదేశం, వైకాపాలకు చెందిన నేతలెవరూ ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కానీ బండారు దత్తాత్రేయ వంటి కొందరు తెలంగాణా బీజేపీ నేతలను తెరాస ఆహ్వానించడంతో వారు హాజరయ్యారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు, ఆయన మంత్రివర్గానికి ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడమే కాక, తెలంగాణా కు అన్ని విధాల తమ ప్రభుత్వం సహాయసహకారాలు అందజేస్తుందని హామీ ఇవ్వడం విశేషం.
ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం తరువాత కేసీఆర్, తన మంత్రివర్గ సహచరులతో కలిసి పెరేడ్ గ్రౌండ్స్ చేరుకొని అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఆయన హాజరయ్యే తొలి అధికారిక కార్యక్రమం అదే అవుతుంది.