వడ్డించేవాడు మనవాడయితే....
posted on May 29, 2014 @ 11:17PM
వడ్డించేవాడు మనవాడయితే ఏ మూల కూర్చొన్నా విస్తరి నిండుతుందన్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని పునర్నిర్మాణం జరగవలసిన ఈ తరుణంలో, నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందిన వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఆనందగజపతి రాజు విమానయాన శాఖా మంత్రులుగా బాధ్యతలు చెప్పట్టడం రాష్ట్రానికి చాలా శుభపరిణామం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ క్యాబినెట్ తమ మొట్టమొదటి సమావేశంలోనే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడమే అందుకు ఉదాహరణగా చెపుతున్నారు.
నూతన రాజధాని నిర్మాణంతో బాటు, మిగిలిన అన్ని జిల్లాలలో రోడ్లు, నూతన భవనాలు తదితర మౌలికవసతులు కల్పనకు అవసరమయిన నిధులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడే విడుదల చేయవలసి ఉంటుంది. అదేవిధంగా, నూతన రాజధానితో బాటు అంతర్జాతీయ విమానాశ్రయం, వివిధ జిల్లాలలో నూతన విమానాశ్రయాల నిర్మాణం జరగవలసి ఉంది. వాటికి అవసరమయిన అనుమతులు, నిధులు వగైరాలన్నీ విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజే మంజూరు చేయవలసిఉంటుంది. ఉదాహరణకు శంషాబాద్ విమానాశ్రయం పేరును మళ్ళీ స్వర్గీయ యన్టీఆర్ పేరును పెట్టాలని మహానాడులో చంద్రబాబుచేసిన ప్రతిపాదనపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వెంటనే సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే విమానాశ్రయం పేరును మార్చుతామని హామీ ఇచ్చారు. మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చంద్రబాబు ప్రతిపాదనను సమర్దించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరకాల ప్రభాకర్ అర్ధాంగి శ్రీమతి నిర్మలా సీతారామన్ మానవవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చెప్పట్టడం కూడా శుభాపరిణామమే. ఆమె ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అనేక ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయవలసి ఉంది. వాటికి అవసరమయిన నిధులు, అనుమతులు వంటివి మానవ వనరుల శాఖ మంత్రి మంజూరు చేయవలసి ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మంచి సత్సంబంధాలు ఉండటం, ఇద్దరూ అభివృద్ధి మంత్రమే పటిస్తుండటం వంటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశాలే.