అన్ని రాష్ట్రాలలో ఐఐటీ ఏర్పాట్లకు ప్రతిపాదన
posted on May 31, 2014 @ 4:19PM
కనీసం డిగ్రీ కూడా చేయని స్మృతీ ఇరానీకి, ఉన్నత విద్యావ్యవస్థలు పర్యవేక్షించే కీలకమయిన మానవవనరుల శాఖకు మంత్రిగా నియమించడంతో, కాంగ్రెస్ పార్టీ ఆమెకు అంత కీలకమయిన పదవిని కట్టబెట్టడాన్ని తప్పు పడుతూ తీవ్ర విమర్శలు చేసింది. కానీ బీజేపీ నేతలు ఆమె చాలా సమర్ధురాలు అంటూ ఆమెను వెనకేసుకు వచ్చారు. ఆమె కూడా తన విద్యార్హతలను కాక తన పనిని బట్టి తన సామర్ద్యం, తెలివితేటలు అంచనావేయమని జవాబిచ్చారు. అందువల్ల ఆమె అర్జెంటుగా తన సామర్ద్యం నిరూపించుకొనే పనిలోపడ్డారు.
ఆమె నిన్న తన శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యి, దేశంలో ఐఐటీలు లేని రాష్ట్రాలలో కొత్తవాటిని ఏర్పాటు చేయదలచుకొన్నట్లు తెలిపారు. వాటితో బాటు, హిమాలయన్ టెక్నాలజీ మరియు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులు మరియు ఉపాద్యాలు రిఫరెన్స్ కోసం ఈ-గ్రంధాలయం ఏర్పాటు కూడా చేయాలనుకొంటున్నట్లు ఆమె అధికారులకు తెలిపారు. అయితే, అధికారులు మాత్రం కొత్త ఐఐటీ ప్రతిపాదనలకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.
గత యూపీయే ప్రభుత్వ హయాంలో దేశంలో కొత్తగా ఎనిమిది ఐఐటీలు ఏర్పాటు చేయగా వాటిలో మండి-ఐఐటీ తప్ప మిగిలినవన్నీ ఆయా రాష్ట్రాలు వాటికి శాశ్విత ప్రాతిపదికన స్థలాలు కేటాయించకపోవడంతో నేటికీ తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయని అధికారులు ఆమెకు తెలియజేసారు. వాటికి అన్ని హంగులతో శాశ్విత భవనసముదాయాలు ఏర్పాటు చేసి అందులోకి మార్చడానికి ఒక్కో ఐఐటీకి రూ.750 కోట్లు అవసరమవుతుందని 2008లోనే యూపీయే ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ అంత సొమ్ము లేకపోవడంతో, ఆ ఆలోచన విరమించుకొందని అధికారులు ఆమెకు తెలిపారు. అందువల్ల నేటికీ ఏడు ఐఐటీలు తాత్కాలిక భవన సముదాయలలోనే కొనసాగుతున్నాయని, తాజాగా పెరిగిన అంచనాల ప్రకారం వాటికి శాశ్విత భావన సముదాయాలు ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.ఆమెకు తెలియజేసి, ఈ పరిస్థితుల్లో వాటిని శాశ్విత భావన సముదాయాలు ఏర్పాటు చేసి వాటిలోకి మార్చడానికి, మొత్తం రూ. 14,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు కొత్త మంత్రిగారికి తెలియజేసారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా మరికొన్ని ఐఐటీలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వంపై ఆర్ధికంగా చాలా భారం పడుతుందని, అందువల్ల, ఈవిషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమెకు అధికారులు సలహా ఇచ్చారు.
కానీ, ఆమె ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలలో ఒక్కో ఐఐటీ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో కొత్త ఐఐటీల ఏర్పాటుకు అవసరమయిన నిధులు విషయమై చర్చించారు. జైట్లీ ఆమెకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజలలో చాలా భారీ అంచనాలున్నాయి. ఎన్నికల సమయంలో ఆయనతో సహా ఆయన పార్టీ నేతలందరూ ఇటువంటివి అనేక హామీలు ఇచ్చేరు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరముంటాయి. అదిగాక దేశంలో వివిధ రాష్ట్రాలలో పోలవరం వంటి అనేక చిన్న పెద్దా ప్రాజెక్టులు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బు కేటాయించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిన పెట్టక మునుపే, స్మృతీ ఇరానీ ప్రతిపాదిస్తున్న కొత్త ఐఐటీలకు మోడీ అనుమతిస్తారా?లేదా? అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.