కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్
posted on May 28, 2014 @ 10:51AM
ఇంతవరకు ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2 నుండి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయి ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారబోతున్నాయి. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే వాటి మధ్య, వాటి ముఖ్యమంత్రుల మధ్య, ప్రజల మధ్య మంచి సయోధ్య చాలా అవసరమని అందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేప్పట్టబోతున్న చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలయింది. మొదట ప్రభుత్వోద్యోగుల విషయంలో మొదలయిన మాటల యుద్ధం, ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో మొదలయింది. ఇందుకు కేసీఆర్ నే నిందించవలసి ఉంటుంది. ఆయన కోరుకొన్న విధంగా తెలంగాణా ఏర్పాటయి, ఆయనే స్వయంగా దానికి ముఖ్యమంత్రి అవుతున్నప్పటికీ, ఆయన ఆంధ్ర ప్రజలు, పాలకుల పట్ల తన విద్వేష వైఖరిని మాత్రం విడిచిపెట్టేందుకు ఇష్టపడటం లేదు.
కానీ చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఇదే కేసీఆర్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికలలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడని, అతనేమి అంటరాని వ్యక్తి కాడని, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కాబోతున్న తాము కలిసి పనిచేసేందుకు ఎటువంటి అభ్యంతరమూ లేదని,” అన్నారు. జగన్మోహన్ రెడ్డి అడగక ముందే స్నేహహస్తం అందించిన కేసీఆర్, చంద్రబాబుతో మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుండటం చాలా విచిత్రమనిపిస్తున్నా, అందుకు బలమయిన కారణం ఉంది.
జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణాపై ఎటువంటి ఆసక్తి లేదు. అందువల్ల అతనితో కేసీఆర్ కు ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ కేసీఆర్ తెదేపాను తుడిచి పెట్టేద్దామని ఎంతగా ప్రయత్నించినా వీలుపడటం లేదు. పైగా అది నేటికీ ఆయనకు పక్కలో బల్లెంలా మిగిలే ఉంది. అందుకే కేసీఆర్ చంద్రబాబును, తెదేపాను ద్వేషిస్తున్నారు. కేసీఆర్ తన వ్యక్తిగత, రాజకీయ ద్వేషాలతోనే ఏదో ఒక మిషతో చంద్రబాబు ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఒక కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న కేసీఆర్, ఇరుగుపొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సయోద్యకు ప్రయత్నించాలే తప్ప, ఈవిధంగా నిత్యం రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం వల్ల రెండు రాష్ట్రాలకి, ప్రజలకి తీవ్ర నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనమూ ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవిభజన వల్ల ఊహించని అనేక సమస్యలు ఎదురవుతాయని మొదటి నుండి చాలా మంది వారిస్తున్నపటికీ, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొంది. ఊహించినట్లే ఇప్పుడు సమస్యలు ఒకటొకటిగా ఎదురవుతున్నాయి. అటువంటప్పుడు ఆ సమస్యలను సామరస్య ధోరణితో చర్చల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేసే బదులు, చంద్రబాబు సయోద్యకు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం నేటికీ కయ్యానికే మొగ్గు చూపడం సబబు కాదని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు.
అయితే ఆయన ఇదేవిధంగా తన ధోరణి కొనసాగించినట్లయితే, చివరికి ఆంద్ర ప్రజలే కాదు తెలంగాణా ప్రజలు కూడా ఆయన పట్ల విముఖత చూపే ప్రమాదం ఉందని, అందువల్ల కేసీఆర్ ఇప్పటికయినా తన ధోరణి మార్చుకొని సమస్యలను చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.