Shivatandavam - Comedy Serial 62
62వ భాగం
ఆ రోడ్డు నేషనల్ హైవే! ఊరి చివర ప్రదేశం. ఆ వేళప్పుడు నిర్మానుష్యంగా ఉంది.
అదొక ఆర్టీసి డీలక్సు బస్సు. అందులో పాసింజర్లంతా పెళ్ళివారే. బస్సుని అద్దెకు పుచ్చుకున్నారల్లె వుంది. ఆడామగా పిల్లా జెల్లాతో నూతన వధూవరులతో కళకళ లాడుతోంది పెళ్ళి బస్సు!
ఆ బస్సు స్పీడుగానే పోతోంది.
డ్రైవరు పూర్వాశ్రమంలో లారీలు నడిపిన వీరుడు గనక ఎట్టి పరిస్థితుల్లోనూ నెమ్మదిగా తోలే అలవాటు లేనట్టుంది. ఆ డ్రైవరుకి ఆ స్పీడులో అల్లంత దూరాన నడిరోడ్డుమీద ఒక ఆడా ఒక మగా పడివుండటం కనిపించింది.
కళ్ళు తిరిగినంత పనైంది డ్రైవరుకి ! వెయ్యి దేవ్వుళ్ళను ఒక్కసారి తలుచుకుని సడన్ బ్రేకు వేసి కళ్ళు మూసుకున్నాడు.
విమానం లాగా వెళ్లే బస్సు నడకగా ఎడ్లబండి లెవల్లోకి దిగిపోవడంతో బస్సులో జనాభా యావత్తు ఆశ్చర్యపోతూ ఒకర్నొకరు ఏమిటేమిటని ప్రశ్నించుకుంటున్నారు.
డ్రైవరు మెల్లిగా కళ్ళు విప్పి ముందుకి చూశాడు. ప్రేమికులకు సరిగ్గా గజం దూరంలో బస్సు ఆగింది.
అప్పుడుగాని డ్రైవరు గుండెల్నిండా గాలి పీల్చుకోలేదు. ఆ తర్వాత అతను బస్సు దిగుతూ ఒక ప్రకటన చేశాడు.
"ఎవరో పాపం నడిరోడ్డుమీద చచ్చిపడున్నారు."
డ్రైవరు ప్రకటనకి బస్సులో జనాభా ఒకేసారి అయ్యేయ్యో అని తమ సంతాపాన్ని ప్రకటిస్తూ డ్రైవర్ తో పాటు తాముకూడా బస్సు దిగారు. డ్రైవరు ధైర్యంగా ప్రేమికులను చేరుకున్నాడు. వాళ్ళనాడి పరీక్షించాడు. క్షణం తర్వాత గట్టిగా అరిచాడు "చావలేదు. ప్రాణముంది!"
జనాభా యావత్తూ ప్రేమికుల చుట్టూ చేరిపోయి వాడి ఒకళ్ళు, గుండె ఒకళ్ళు, కాళ్ళూ చేతులూ ఒకళ్ళు అట్లా ఎవరికి ఏది అందితే దాన్ని పట్టుకుని, పరీక్షించి బతికున్నట్టు నిర్థారణ చేసుకుని తృప్తిపడ్డాడు.
బస్సులో కూచుని గురకపెడుతూ నిద్దరోతున్న నిప్పు అప్పల్సామికి బస్సు ఆగి వుండటం వల్ల మెలకువచ్చింది. కళ్ళు విప్పిచూస్తే బస్సులో ఎవరూ లేరు. తన పక్క సీట్లో దుర్గమ్మ కూడా లేదు. అంతా ఏమైపోయారోనని కిటికీలోంచి తొంగిచూశాడు. వాళ్ళు నడిరోడ్డు మీద మీటింగు పెట్టినట్టు తెలిసిపోయింది.
ఏదో యాక్సిడెంట్ జరిగే వుంటుందనిపించగానే అప్పల్సామి తన పోలీసుద్యోగం జ్ఞాపకం వచ్చేసింది. గబగబా బస్సు దిగాడు. "తప్పుకోండి...తప్పుకోండి" అంటూ జనాన్ని తోసుకుంటూ వచ్చి అక్కడి దృశ్యాన్ని చూడగానే కొయ్యబారిపోయాడు.
గురువుగారి తమ్ముడూ...పంకజం గారమ్మాయి.
ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడ పడిపోయారో ఎందుకు ఇల్లు విడిచి ఇంతదూరం వచ్చారో...అతనెంత ఆలోచించినా సమాధానాలు దొరకలేదు. బతికే వున్నారని విన్నాడు. ఇంక ఆలోచించడం వృధా అనుకున్నాడు. అందుచేత గంభీరంగా ఒక ఆర్డరు జారీ చేశాడు.
"ఆళ్ళని మన బస్సులో ఎక్కించండి. తర్వాత సంగతి నేచూసుకుంటా" అన్నాడు.
మేడ మీద గదిలో...
కిష్టుడు కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. గది బయట తాళం పెట్టి వుంది.
పంకజం మేడలో వసుంధర పరిస్థితీ అట్లాగే వుంది. ఆ పిల్లని కూడా మేడమీద గదిలో బంధించారు. ఆ గదిక్కూడా తాళం పెట్టుబడే వుంది.
సుభద్ర, ఆవిడ భర్త, జ్యోతి, కైలాసం శివుడింట్లో మీటింగ్ లో వున్నారు. అప్పటికే మీటింగు పూర్తయ్యింది కాబోలు...సుభద్ర భర్త లేచి నిలబడి అన్నాడు.
"శివుడూ పంకజం వచ్చే వేళయింది! సుభద్రా నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి వెళతాం!"
కైలాసం జోక్యం కల్పించుకుని చొరవగా అన్నాడు. జ్యోతి, నేను వీళ్ళ సంగతి చూస్తాం...!
"దట్స్ గుడ్!" అన్నాడు సుభద్ర భర్త.
ఆనక సుభద్రను తీసుకుని అతను వెళ్ళిపోయాడు.