శివతాండవం - 64

 

 

64వ భాగం

 

గంట స్థంభం !
ఎందుకైనా మంచిదని కొంచెం ముందుగానే డేవిడ్ తాను కూచున్న చోటు నుంచి లేచాడు.
చేతికున్న రిస్టువాచీని చూసుకుని, తల పంకించి గంటస్థంభం ఎక్కే ప్రయత్నం చేస్తుండగా అక్కడికి కైలాసం, జ్యోతి పరుగెత్తుకుంటూ వచ్చారు.
కొత్త జంటని చూసి డేవిడ్ కొంత ఆందోళన చెందాడు.
డేవిడ్ సమీపించి కైలాసం సూటిగా ఒకే ప్రశ్న అడిగాడు "నీ పేరు డేవిడ్ కదూ?"
"అవును"
"ఇప్పుడు కూడా ఆ పని మీదే గంటస్థంభం ఎక్కాలనుకుంటున్నావు కదూ!"
డేవిడ్ చాలా విసుగ్గా అన్నాడు "అవునూ....అవునూ...అవును!"
"ఇప్పుడెంతయింది టైం?"
"ఎనిమిదీ ముప్పావు దాటింది. సరిగ్గా తొమ్మిది పూర్తి కాగానే తొమ్మిది గంటలు కొడతాను" అన్నాడు డేవిడ్ వాచీ చూసుకుంటూ.
"వద్దు....కొట్టద్దు!"
"ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడు?"
"డేవిడ్...దయచేసి నామాట విను...."
"వినను. విననంటే వినను! నాతో ఆడుకోవాలనుకొంటున్నారేమో అది కుదరదు. మొన్నామధ్య మీలాగే ఒక జంట అల్లరిచేసి నా ప్రాణమ్మీదకి తెచ్చారు ఇప్పుడు మీరొచ్చారు. ఇంకా ఎంతమంది వస్తారో...ఎంత అల్లరి చేస్తారో నేనూ చూస్తాను! అసలు మీకు నేకొట్టే గంటలకి సంబంధమేమిటి? మర్యాదగా చెబుతున్నా, వెళ్ళిపొండి...ప్రాణాల మీద ఆశవుంటే వెంటనే వెళ్ళిపోండి."
కైలాసానికి చిరుకోపం వచ్చింది. అంచేత కొంచెం స్పీడుగానే అడిగాడు "వెళ్లక పోతే ఏం చేస్తావ్?"
"ఏం చేస్తానో నాకే తెలీదు ! నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వక పోతే ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే" అంటూ అతను మెట్లెక్కబోయాడు. అకస్మాత్తుగా డేవిడ్ దారికి అడ్డంగా నిలబడ్డాడు కైలాసం. అతన్ని ఎగాదిగా చూసి ఉరిమేడు డేవిడ్.
"తప్పుకో?"
"తప్పుకోను!" తాపీగా అన్నాడు కైలాసం.
"చెయ్యెత్తి కొట్టానంటే భళున కక్కుకుంటావు చెంబెడు రక్తం. ఒక్క గుద్దు గుద్దేనంటే వారం రోజులు ఎక్కుతావ్ మంచం!" దబాయించాడు కైలాసం.
"ఏం కూశావ్?" అంటూ ఒకటిచ్చుకున్నాడు డేవిడ్. ఆ దెబ్బతో కైలాసం కళ్ళు బైర్లు కమ్మాయి.
తిరిగి చూసుకోకుండా డేవిడ్ గంట స్థంభం ఎక్కుతున్నాడు. ఈలోగా తెప్పరిల్లిన కైలాసం కొత్త శక్తిని పుంజుకున్నాడు. అమాంతం డేవిడ్ కాళ్ళని పట్టుకుని ఒక్క గుంజు గుంజేడు.
మహావృక్ష కూలిపోయినట్టు డేవిడ్ అమాంతం కూలిపోయాడు. ముక్కు పచ్చడయింది. నెత్తురు కూడా వచ్చింది. ఓర్చుకోలేక పోయాడు డేవిడ్. కోడిపిల్ల మీద గద్ద వచ్చి పడిపోయినట్టు కైలాసం మీద పడ్డాడు. తదుపరి పచ్చడి చేసేస్తున్నాడు.
ఆ పచ్చడి దృశ్యంలో జ్యోతిని బాగా కలత పెట్టింది. తన ప్రియుడు డేవిడ్ చేతుల్లో పచ్చడై పోవడంతో జ్యోతి చెంపని చెళ్ళుమని పించాడు.
"జ్యోతీ!" అన్నాడు కైలాసం ఆవేదనగా 
"కైలాసం!" అన్నది జ్యోతి బాధగా!
డేవిడ్ తాను నమ్మిన సిద్ధాంతం వివరిస్తున్నాడు "కుర్రాళ్ళన్న తర్వాత సమ్మెలు చేస్తారు. రైళ్ళాపుతారు. బస్సులు తగలెడతారు. వీధి దీపాలు పగల గోడతారు. అంతేగాని గంటలు కొట్టనీకుండా అడ్డుపడరు. నన్ను మరెట్లాగూ ఆపలేరు. అంచేత బుద్దిగా ఇళ్ళకెళ్ళిపోండి. లేదా, నా చేతుల్లో ఛస్తారు. ఖబద్దార్!" అంటున్నాడు డేవిడ్.
అతని స్టేట్ మెంటు కైలాసం గానీ, జ్యోతిగానీ వినిపించు కోలేదు మళ్ళీ లేచి నించున్నారు. చిచ్చుబుడీల్లాగా డేవిడ్ మీద కలబడ్డారు.
డేవిడ్ వాళ్లిద్దర్నీ ఎడాపెడా వాయించేస్తున్నాడు.