శివతాండవం - కామెడీ సేరియల్ 61
61వ భాగం
తిరువెంగళాచార్యులింటి ముందు కారాగింది. ముగ్గురూ కారు దిగారు.
శివుడ్నీ, జగన్నాధాన్నీ ఎంతో వినయంగా తన గుమ్మందగ్గరికి తీసుకొచ్చాడు ఆచార్యులు. తాళం తీశాడు. తలుపులు తెరిచాడు. అంతే, అక్కడ వాతావరణాన్ని చూసి కొబ్బబారి పోయాడు.
అక్కడ కిష్టుడూ లేడు వసుంధరా లేదు !
కిటికీని తొంగిచూసి ఆ ఇద్దరూ పారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. అసలే పాత ఇల్లు. రాబోయే ఐదువేలతో బాగుచేసుకుందామనుకుంటే....ఆ పైకం దక్కే సూచనలు లేకపోగా కిటికీ ఒకటినష్టం. బిక్కుమొహం పెట్టుకొని గొణుక్కుంటున్నాడు.
"అలవోక అరవిందం, ఆనంద మకరందం అల్లాంటిల్లాంటి మందుకావు. వాటిని పుచ్చుకున్న మనుషులు ఎంత జగజ్జటీలైనా పన్నెండు గంటలపాటు పడక వేయాల్సిందేగాని ఎట్టి పరిస్థితులలోనూ కిటికీలు, ఊచలూ విరగొట్టి పారిపోవడానికి వీల్లేదు. అల్లాంటిది మందుల్లో పవరు తగ్గిందో...పిల్లల్లో చేవ పెరిగిందో నా ఖర్మే కాలిందో కథ అడ్డం తిరిగింది." విపరీతమైన ఆయాసం దగ్గుల్లోకి జారిపోయాడు ఆచార్యులు.
"ఇక్కడ్నించి కూడా తప్పించుకు పారిపోయాడు. ఇక వాడు మనకి దొరకడు." అన్నాడు శివుడు నిట్టూరుస్తూ.
ఆ తర్వాత శివుడూ,జగన్నాథం మెల్లిగా బయటకు నడుస్తుంటే ఆచార్యులు మనవి చేసుకుంటూనే వున్నాడు.
"అయ్యా ! పేదముండావాడిని. బహుమతికి ఆశపడి దేవుడి ముడుపు పగలగొట్టిన దౌర్భాగ్యుడ్ని. ఆశించిన ఐదువేలూ ఎట్లాగూ దక్కలేదు. దేవుడి డబ్బు రెండొందలు ఖర్చు పెట్టేశాను. పైగా కిటికీ కూడా కూలబడిపోయింది." అతను ఇంకా ఏదేదో అంటూనే ఉన్నాడు. శివుడు జగన్నాధం కారెక్కి వెళ్ళిపోయారు.
అసలు జరిగిన కథ ఇది.
ఆచార్యులు అలవోక అరవిందం, ఆనంద మకరందం పిల్లలమీద ప్రయోగించి, తలుపు మూసి తాళం వేసి వెళ్ళిపోవడంతో కిష్టుడికి భారీ ఎత్తు అనుమానం కలిగింది. కళ్ళు మూసుకు పోతున్నట్టు....తల తిరిగిపోతున్నట్టు ఫీలింగు కలగ్గానే ఆచార్యులు లేదో ద్రోహం తలపెట్టినట్టు గ్రహించగలిగాడు.
అప్పటికే వసుంధర తూలుతోంది.
"ఆచార్యులు మనకేదో మత్తుమందు కావాలనే ఇచ్చాడు" అన్నాడు కిష్టుడు.
"నాకు....నిద్రొస్తోంది....బుజ్జులూ!" అన్నది వసుంధర.
"ఇందులో ఏదో మోసం వుంది!" అంటూ కిష్టుడు ఆచార్యులు మందు కలిపిన గదిలోకి తూలుకుంటూ అడుగుపెట్టాడు.
మందుల బల్లమీద మందులన్నీ చిందర బందరగా వున్నాయి. వాటిని పరిశీలనగా చూస్తుండగా అక్కడ పేపరు కూడా కనిపించింది.
ఆ పేపర్ లో తన ఫోటో ....అన్నయ్య వేసిన ప్రకటన అయిదు వేల బహుమతీ.....
"ఆచార్యులూ దెబ్బ తీశావు" అనుకున్నాడు కిష్టుడు.
"వసూ" అంటూ తూలుకుంటూనే వచ్చాడు.
వసుంధర బల్లమీద నిద్రపోతోంది.!
తట్టిలేపే ప్రయత్నం చేశాడు. బద్ధకంగా ఊ అంటుందేగాని కళ్ళు విప్పటం లేదు !
ఇవతల కిష్టుడి పరిస్థితీ ఇంచుమించు అట్లాగే ఉంది.
ఏమైనా సరే...ఇక్కడ్నుంచి పారిపోవాలి! ఎట్లా ?
కిటికీ కనిపించింది! దాదాపు శిథిలావస్థలో వుంది కనుక అంత మత్తులో వుండి కూడా పది నిముషాలు తంటాలుపడి కిటికీ ఎత్తేయగలిగాడు. ఆ తర్వాత వసుంధరని తట్టి లేపాడు. ఆ పిల్ల అప్పటికే పూర్తిగా మత్తులో పడిపోయింది. క్షణం ఆలోచించి ఒక నిర్ణయాని కొచ్చాడు.
అమాంతం వసుంధరని భుజాన వేసుకున్నాడు. అతి ప్రయత్నం మ్మీద మత్తు వలయాలను తప్పించుకుంటూ....కిటికీ ద్వారా... వసుంధరతో బయటపడ్డాడు. అక్కడ్నుంచి పడుతూ లేస్తూ రోడ్డుమీదకి నడిచాడు.
ఒక స్థితిలో ఇంకా నడిచేందుకు సాధ్యం కాక మత్తుకి వశుడైపోయి వసుంధరతో పాటు తాను కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోయాడు.