Shivatandavam - Comedy Serial 63
63వ భాగం
కిష్టుడు సీరియస్ గా ఏదో రాస్తున్నాడు రాసేది చదువుకుంటూ..... వసూ ఇక మన కథ విషాదాంతమే! ఈ నేలమీద ప్రాణాలు విడిచి పలోకంలో సుఖ పడదామని విశాఖపట్నం బీచ్ లో అనుకున్నాం. గుర్తుందా? ఇప్పుడదొక్కటే మార్గం.
నువ్వు నీ గదిలో నేనునా గదిలో ఒకే టైంకి ఉరి పోసుకుని చచ్చిపోదాం...ఈ టైంలో తేడాలొస్తే పై లోకంలో కూడా ఇబ్బందులు పడే ప్రమాదముంది జాగ్రత్త. అందుచేత..... డేవిడ్ కొట్టే గంటలే మనకి సరైన ముహూర్తం!
ప్రతిరోజూ మనం కాలేజీకి వెళ్లేందుకు డేవిడ్ గంటలే మనకు సాయపడేవి. ఇప్పుడు పైలోకం వెళ్ళేందుకుక్కూడా అతని గంటలే సాయపడాలి. ఇప్పుడు ఎనిమిదీ పదిహేనయింది. మరో ముప్పావుగంట గడిస్తే డేవిడ్ తొమ్మిది గంటలు కొడతాడు. అతను తొమ్మిదోగంట మోగించగానే సరిగ్గా అప్పుడే మన ఉరి కార్యక్రమం పూర్తికావాలి.
నువ్వు నీ గదిలో ...నేను నా గదిలో.... ఈలోగా ఎవరు ఎన్ని ఆశలు పెట్టినా ఎన్ని వాగ్దానాలు చేసినా మోసపోకూడదు. మన ప్రయత్నం నిర్విఘ్నంగా సాగాలంటే మనం కూడా మన గదులకు గడిలు పెట్టుకుందాం. హరి రుద్రాదులోచ్చినా సరే గడిలు తీయం. గుర్తుంచుకో.... డేవిడ్ కొట్టే తొమ్మిదో గంట మన పరలోక ప్రయాణానికి సుముహూర్తం.
ఆ గంట కోసం ఎదురు చూస్తూ కిష్టుడు ఉత్తరం రాయడం పూర్తిచేసి ఆ కాగితం పేపరు వెయిట్ కి చుట్టి దారంతో కట్టాడు. తన కిటికీ దగ్గరకు వచ్చి పంకజం మేడవైపు చూశాడు. ఆ వేళకి వసుంధర కూడా తన గది కిటికీ దగ్గర నిలబడి ఉంది. కిష్టుడు కొన్ని సైగల ద్వారా తన గొడవను వివరించి పేపరు వెయిట్ ని గురిచూసి ఆమె గదిలోకి విసిరాడు.
అది తిన్నగా వసుంధర గదిలోకి వచ్చి పడింది. పేపర్ వెయిట్ ద్వారా అందిన వర్తమానాన్ని వసుంధర గబగబా చదివేసింది కిటికీ దగ్గిరే నిలబడి తన అంగీకారాన్ని సైగల ద్వారా కిష్టుడికి తెలియజేసింది. ఆ హడావిడిలో కాగితం ఎగిరి...అట్లా ఎగురుతూ నడి రోడ్డు మీద పడిపోయింది. కాగితాన్ని పట్టించుకోవడం మానేసి ఎవరి ఉరి ప్రయత్నాల్లో వారు నిమగ్నుమైపోయారు ప్రేమికులు.
అంత క్రితమే శివుడి మేడముందు సైకిలు దిగిన హెడ్ కానిస్టేబుల్ అప్పల్సామి ఒక బంతి ఆకారం పంకజం మేడలోకి ఎగరటం, తదుపరి దాని తాలూకు కాగితం నడి రోడ్డుమీద పడటం మొదలైన ఖర్మకాండ యావత్తూ కళ్ళారా చూడగలిగాడు. అందుచేత రోడ్డుమీద పడిన కాగితాన్ని తీసుకుని చదివాడు.
చదవడం పూర్తయ్యాక "గోరం జరిగిపోతండండోయ్" అంటూ గుండెలు బాదుకుంటూ కైలాసాన్ని చేరుకున్నాడు. తాను తెచ్చిన ఉరి సందేశం కైలాసం చేతుల్లో పెట్టి, తాను పంకజం మేడపైకి పరుగెత్తాడు. కైలాసం గొప్ప ఖంగారుగా పడిపోయాడు. కిష్టుడు గదికి వేసిన తాళం తీసి తలుపు తోశాడు రాలేదు. ఖంగారుగా తలుపు తడుతూ ఖంగారుగానే అతను కొన్ని వాగ్దానాలు చేసేస్తున్నాడు.
కిష్టుడు కైలాసం హామీలను పట్టించుకోవడం లేదు. ఉరి ప్రయత్నాలు చాలా చురుగ్గా చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే తంతు పంకజం మేడలో కూడా జరుగుతోంది. వసుంధర గదికి తాళం తీసేసి తలుపు తడుతూ ఆపసోపాలు పడిపోతున్నాడు అప్పల్సామి. వసుంధర కించిత్తయినా చలించకుండా ఉరి ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఎయిర్ పోర్టులో విమానం దిగింది. అందులోంచి శివుడూ, పంకజం దిగుతున్నారు. వాళ్ళని రిసీవు చేసుకోవడాని సుభద్ర, ఆమె భర్త విజిటర్స్ గేలరీలో నిలబడి వున్నారు. "మద్దెన ఈ డేవిడ్ గాడేది వుండండీ? ప్రాణాలు తీసేస్తున్నాడు?" అన్నాడు హెడ్డు ఖంగారుగా.
"పావు గంటే వుంది టైం!" ఆందోళన పడుతున్నాడు కైలాసం.
"వా.....ళ్ళు....బ....తకాలి!" అంటోంది జ్యోతి.
'ఆళ్లు బతకాలంటే ఈ డేవిడ్డెవుడో....ఆడి అడ్రస్సెంటో తెలవాలి!" అన్నాడు హెడ్డు.
కైలాసం బుర్రలో అకస్మాత్తుగా ఏదో ఆలోచన వచ్చినట్టుకాగా అతను వీధిలోకి పరుగు తీశాడు.
"ఏవండీ....నేను...వ...స్తున్నా!" అంటూ జ్యోతి కూడా అతన్ని వెంబడిస్తూ పరుగెత్తింది.
విషయం ఏమిటో అర్థంకాని హెడ్డు తల తడుముకుంటో ఆ హాల్లోనే తిరుగుతున్నాడు కంగారుగా.