శివతాండవం - కామెడీ సీరియల్ 60

 

60వ భాగం

శివుడి ఆవేశానికి జగన్నాధం నివ్వెరబోయాడు. తల పంకించి అన్నాడు.

"సర్లే ! ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ! మగాళ్ళ హోటలొచ్చేసింది కారాపు. ప్రొప్రయిటరు నీ భక్తుడే. కనీసం ఇక్కడైనా కొంచెం బెట్టుగా వుండు."

మగాళ్ళ హోటలు ముందు కారాగింది. కారుదిగి ఇద్దరూ హోటలు మెట్లెక్కుతుండగా వైద్యుడు తిరువెంగళాచార్యులు కౌంటరు ముందు తెగ హడావిడి పడిపోతున్నాడు.

"చూడు నాయనా కౌంటరూ ! (ఆయాసం) నాకు ఫోనంటూ వుంటే నీ దగ్గరికి వచ్చేవాడ్ని కాదు. (దగ్గు) లేదు గనుక వచ్చాను.(దగ్గూ, ఆయాసం) చాలా అర్జంటు. హైదరాబాదుకి యస్.టి.డి. కొట్టు (దగ్గు) నెంబరంటావా సింపులు. (ఆయాసం) రెండు రెళ్ళు, రెండు మూళ్ళు, రెండు నాలుగులు (దగ్గూ, ఆయాసం)"

ఆ ఫోన్ నెంబరు వినగానే శివుడు ఆశ్చర్యపోయాడు.

అది సాక్షాత్తూ తనింటి నెంబరే! తన నెంబర్తో ఈయన కేమిటి పని?

శివుడు తిరువెంగళాచారినే అడిగేశాడు.

"అవునూ! ఇంతకీ ఆ హైదరాబాదు ఫోన్ ఆసామితో మీకేమీటంత అర్జంటు పని?" తిరువెంగళాచారి శివుడు వైపు చాలా విసుగ్గా, చిరాగ్గా చూశాడు. దగ్గూ ఆయాసం అతన్ని కుదిపేస్తుండగా అన్నాడు.

"మీకు అదంతా అనవసరమండీ!"

"అవసరం కనుకనే ఆడిగేనండి!"

"ఏమిటండీ అంత అవసరం?" (దగ్గూ, ఆయాసం)

"హైదరాబాదులో ఆ ఫోన్ నాదే?"

ఆ మాటతో తిరువెంగళాచార్యులకు దగ్గూ, ఆయాసం రెండూ అకస్మాత్తుగా తగ్గిపోయాయి.  మొహంనిండా ఆశ్చర్యం, ఆనందం రెండూ కమ్ముకున్నాయి. వెదక బోయిన తీగ కాలికి తగిలినట్టు తబ్బిబ్బైపోతూ అన్నాడు. "అంటే...తమరు? తమ పేరు శ్రీ కె. శివరామారావేనా?"

"అవును"

తిరువెంగళాచార్యులు సరుకులు బుట్టల కింద పెట్టేసి చేతులు జోడించి వినయంగా అన్నాడు.

"అయ్యా! ఇక తమరు తమ తమ్ముడి గురించి ఏమాత్రం వర్రీ కానక్కర్లేదు. అతను ఒక పిల్లతో సహా నా ఇంట్లో క్షేమంగా వున్నాడు. వాళ్ళిద్దర్నీ ఇంట్లో పెట్టి ఇంటికి తాళంవేసి తాళంచెవి నా జేబులో వేసుకునివచ్చాను. ఈ విషయం తమకి తెలియజేయడానికే ఫోన్ అడిగాను. ఇంతలో తమరే కనిపించారు."

తమ్ముడు క్షేమంగా వున్నాడని తెలియగానే శివుడు ఆనందించాడు.

"పదండి మీ ఇంటికి వెళదాం" అన్నాడు శివుడు.

"వెళ్ళవచ్చనుకోండి. కానీ బహుమతి మొత్తం క్యాష్ ఇచ్చినా సరే చెక్కు రాసిచ్చినా సరే"

"ఇస్తానండి. తప్పకుండా ఇస్తాను. ముందు మా తమ్ముడ్ని చూపించండి."

తిరువెంగళాచార్యులు చాలా గంభీరంగా అన్నాడు.

"ఇంక తమరు అలాంటి దిగుళ్లేమీ పెట్టుకోనక్కర్లేదు. తమ్ముడిగారికి అలవోక అరవిందమిచ్చాను. ఆ పిల్లకి ఆనంద మకరందం మిచ్చాను. వాటి ప్రభావం వల్ల వాళ్ళు సరిగ్గా పన్నెండు గంటలపాటు నిద్రలో ఉంటారు."

ఆ మాటకి శివుడు ఆందోళన పడ్డాడు.

"వాళ్ళకి నిద్రమాత్ర లివ్వమని ఎవరు చెప్పారండి."

"లేకపోతే మనమాట వింటారండీ?" పారిపోతారు."

"పన్నెండు గంటల తర్వాత తెలివి వస్తుందా?"

"అయ్యా వైద్యుడిగా ఊళ్ళో పెద్ద పేరున్న వాడ్ని. నా శీలాన్ని శంకించకండి. మీ పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందీ రాదు. వుండదు ఇటు చూడండి, ఈ బుట్టలనిండ ఏపిల్సు , మిఠాయిలూ మొత్తం రెండు వందలు ఖర్చు చేశాను. వాళ్ళు నిద్ర లేవగానే ఈ తిండి బలంగానూ, శ్రేష్ఠంగానూ వుంటుందండీ అయిన ఖర్చుకి నేనేం వర్రీకాను. గొప్పింటి బిడ్డకి ఈపాటి మర్యాద చేయకపోతే బావుండదని ఇంత ఖర్చు చేశాను."

"ఈ ఖర్చుకూడా నేనే ఇస్తాను."

"చిత్తం"

"ముందు కారెక్కండి. త్వరగా వెళ్ళాలి" అన్నాడు శివుడు.

తిరువెంగళాచార్యులు శివుడిచ్చిన హామీతో తృప్తిపడ్డాడు. తినుబండారాలు తీసుకొని శివుడితోపాటు కారెక్కాడు. ఆ కారులో మూడో మనిషి జగన్నాథం.