Shivatandavam - Comedy Serial 59

 

59వ భాగం


శివుడు తల కొట్టేసినంత పనైంది.

ఇన్నేళ్ళూ ఆడదానికి ఆమడ దూరంలో నిప్పులాగా బతికిన తనని ముగ్గులోకి దించిన కీర్తి మొదటిసారీ, రెండవసారీ కూడా పంకజానికే దక్కుతుంది. తెలుగుదేశంలో తన పరిస్థితి ఏమిటి? స్థాయి ఏమిటి? ఎక్కడో శిఖరాగ్రమ్మీద కూచున్న తనని అమాంతం పడగొట్టేసింది పంకజం. పడిగొట్టేస్తే పర్లేదు. పడిపోయిన తనని హేళనతోనూ, అవమానంతోనూ చంపుతోంది.

దిగులుగా కారెక్కాడు శివుడు. అంతకు మునుపే కారెక్కి కూచున్నాడు జగన్నాధం.

శివుడు స్టీరింగు ముందు కూచుని డ్రైవ్ చేస్తూ అన్నాడు "నిన్నో విషయం అడగాలని వుంది, అడగనా?"

"అడుగు" అన్నాడు జగన్నాధం.

"పంకజం పెళ్ళి చేసుకోలేదని నాతో నువ్వయినా చెప్పవచ్చు?"

ఆ ప్రశ్నకి జగన్నాధం సూటిగానే సమాధానం చెప్పాడు.

"అందుకు రెండు కారణాలున్నాయి బ్రదర్! మొదటి కారణం కసి, నాకు దక్కని పంకజం నీక్కూడా దక్కకూడదనే కసి ! నేను విమలను పెళ్ళి చేసుకున్నట్టు నీకు తెలిస్తే లైను క్లియరైపోతుంది. పంకజంతో నీ పెళ్ళి జరిగిపోతుంది. అది నాకిష్టం లేదు. అందుకే చెప్పలేదు. కానీ, తర్వాతర్వాత నేను మీ ప్రేమకు ద్రోహం చేసేనని తెలుసుకున్నాను. ప్రశ్చాత్తాపం కలిగింది. అసలు విషయం నీతో చెప్పేద్దామనుకున్నాను. అయినా చెప్పలేదు. అది రెండో కారణం."

"ఏమిటా కారణం?"

"లోక కళ్యాణం కోసం పంకజం విషయం దాచాలనుకున్నాను. దాచాను."

"పంకజానికి పెళ్ళి కాలేదని నాకు తెలిస్తే లోకకళ్యాణం ఆగిపోతుందా?" కసిగా అడిగాడు శివుడు.

"తప్పకుండా ఆగిపోతుంది!" అన్నాడు జగన్నాధం ప్రశాంతంగా.

"వావ్ ఎట్లా?" కోపంగా అడిగాడు శివుడు.

జగన్నాధం వివరించాడు.

"పంకజానికి పెళ్ళి కాలేదని తెలుస్తే ఎందుక్కాలేదని ఆరా తీస్తావ్ ! నిన్ను ఇంకా ప్రేమిస్తుందనే జవాబు వస్తుంది. దాంతో నీ మనసు పంకజానికి అర్పిస్తావ్. మీ పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయ్యేక నువ్వు కూడా సగటు మగాడివైపోతావ్. పంకజం చెప్పు చేతల్లో బతుకుతావ్. స్త్రీ ద్వేషీ సమాజం మూల పడుతుంది. తద్వారా మగజాతి ఉద్దరణ చచ్చిపోతుంది. ఇప్పుడు చెప్పు బ్రదర్ ! నువ్వు పెళ్ళి చేసుకుంటే లోకకళ్యాణం ఆగిపోదా?"

శివుడికి ఈ లాజిక్కు నచ్చలేదు. పైగా వళ్ళు మండిపోయింది. అందుకే రోషంగా అడిగాడు. "నాన్ సెన్స్! మీరంతా పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడుతుంటే నే నొక్కడ్నే పెళ్ళీ పెటాకు ల్లేకుండా సభలూ సమావేశాలకు అంకితం కావాలా? ఇదెక్కడి న్యాయం జగ్గూ?"

జగన్నాధం తగిన సమాధానమే చెప్పాడు.

"మేము పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడుతున్నామా? పిచ్చివాడా ! కాలేజీ రోజుల్లో నేనెంత వెలుగు వెలిగానో మరిచిపోయావా? దాదాగిరి చెలాయించాను. నా జేబులో ఎప్పుడూ ఒక చాకు వుండేది అల్లాంటిది పోలీసాఫీసరు కూతురుతో నా పెళ్ళయిన తర్వాత ఇప్పుడు వానపాములా బతుకుతున్నాను. ఉజ్జ్వలమైన గతానికి పెళ్ళి ఒక గొడ్డలి పెట్టయింది. నన్ను వెధవని చేసింది. మా ఇంట్లో రోజుకో యుద్ధం. ఆఫీసులో బాసు, ఇంట్లో బాసు, అక్కడా ఇక్కడా దాసోహమవడం అలవాటై పరిస్థితుల్లో నువ్వుకూడా పెళ్ళి చేసుకుంటే సంసారంచేసే మా మగాళ్ల గతేమిటి? రాబోయే మగతరం భవిష్యత్తు ఏమిటి?"

"నో! నువ్వేం చెప్పినా వినదలుచు కోలేదు. వినను. మీ అందరి కోసం నేను నా బతుకుని పాడుచేసుకోలేను. లోకంతోగానీ, దాని కళ్యాణంతో గాని నాకు నిమిత్తం లేదు. నేను పెళ్ళాడి తీరుతాను. పంకజాన్నే పెళ్ళి చేసుకుంటాను."