శివతాండవం కామెడీ సీరియల్ - 58

 

58వ భాగం

జగన్నాధం తిరిగి ఇంటి కొచ్చాడు! అతన్ని చూస్తూనే ఆత్రంగా అడిగారు పంకజం, విమలా "పిల్లలు దొరికారా?" లేదన్నట్టు నీరసంగా తలూపాడు.

ఆ తరువాత ఇట్లా, అన్నాడు "బస్టాండు వెతికాను. రైల్వేస్టేషన్ వెతికాను. బీచ్ వెతికాను. హోటళ్ళన్నీ గాలించాను. తిరగని చోటులేదు. వెతకని ప్లేసులేదు.

ఎక్కడా కనిపించలేదు. చివరికి అన్ని పోలీస్ స్టేషన్లలోనూ రిపోర్టిచ్చాను. టూ టౌన్ పోలీస్టేషన్ లో మావయ్య శిష్యుడే యస్సైగా ఉన్నాడు. పిల్లల్ని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చి పంపాడు. అతను తలుచుకుంటే తప్పకుండా దొరుకుతారు!" అతను ఆ మాట అంటుండగా వీధిలో కారు ఆగింది. అందులోంచి శివుడు దిగాడు.

శివుడు కనిపించగానే జగన్నాధం పంకజం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు... "శివుడి తమ్ముడే హీరో!" అన్నది పంకజం.

"చెప్పావు కాదే? అన్నకి తగ్గ తమ్ముడే! ఏం బ్రదర్, ఇదేనా రావడం?" అంటూ శివుడ్ని పలకరించాడు.

"మా తమ్ముడెక్కడ!" అంటూ పంకజం వైపు చూశాడు శివుడు ! పంకజం అతన్ని పట్టించుకోకుండా తన దృష్టిని గోడలవైపు తిప్పింది. శివుడు ప్రశ్నకి జగన్నాధమే జవాబు చెప్పాడు.

"రాత్రికి రాత్రే మాయమయ్యారు బ్రదర్ ! ఊళ్ళోనే ఎక్కడో వుంటారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు తప్పకుండా దొరుకుతారు డోంట్ వర్రీ !" తన ప్రశ్నకి పంకజం సమాధానం చెబితే కొంతలో కొంత తృప్తి పడేవాడు శివుడు !

జగన్నాధం కలుగజేసుకోవడం వల్ల విసుక్కలిగింది. పంకజాన్ని ఎట్లాగైనా మాట్లాడించాలనే పంతంతో డైరెక్టుగా పంకజాన్నే అడిగాడు శివుడు.

"వచ్చేటప్పుడు నాతో చెపితే నేనూ వచ్చేవాడినిగా తోడుగా!" ఆ ప్రశ్నక్కూడా పంకజం సమాధానం చెప్పలేదు.

తనకేమీ పట్టనట్టు చేతి వేళ్ళని లెక్కపెట్టుకుంటోంది. "తమ్ముడ్ని అప్పగించిన వాళ్ళకి అయిదువేల బహుమతి ఇస్తానని పేపరులో ప్రకటన ఇచ్చాను" అన్నాడు శివుడు.

"ఆ సంగతి ముందే తెలుస్తే నిద్ర మానుకుని కాపు కాచేవాడ్ని. ఛాన్సు పోయింది బ్రదర్!" అంటూ నీరసపడిపోయాడు జగన్నాధం.

"ఏ వేళప్పుడు బయలుదేరారో ఏమో! ముందు స్నానం కానివ్వండి అందరం కలిసి భోంచేద్దాం" అన్నది విమల. ఆమె మాటకి శివుడు ఎంతో ఆనందించాడు.

కనీసం పంకజంతో కలిసి భోంచేసే అవకాశం కలుగుతున్నందుకు అతను పరవశించి పోయాడు. స్నానాల గది ఎక్కడో అడిగేందుకు తొందర పడ్డాడు. కానీ జగన్నాధం బ్రేకు వేశాడు.

"బ్రదర్ బ్రహ్మచారి ! ఆజన్మ బ్రహ్మచారి అఖిలాంధ్ర స్త్రీ ద్వేషీ సమాజానికి అధ్యక్షుడు. అతను ఆడదాని చేతి కూడు తినడు. ఆడదున్న చోట ఉండడు. రా బ్రదర్, మనం పోదాం. ఊళ్ళో మగాళ్ల హోటలుంది ! అన్ని వసతులూ అక్కడే వున్నాయిరా !" అంటూ శివుడ్ని లాక్కుపోతున్నాడు జగన్నాధం.

"నేను రాను" అని చెబుదామనుకున్నాడు శివుడు. బంగారం లాంటి అవకాశాన్ని చేతులారా పాడుచేసుకోవడం అతనికిష్టం లేదు. అట్లాగని ఎట్లా చెప్పగలడు? కనీసం పంకజమైనా మాట సాయం చేస్తే బావుండి పోను ! "శివుడూ" అని పిలిచింది పంకజం.

శివుడు సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయాడు. భోజనాలూ, పడకలూ అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తుందని పంకజం మీద బోలెడు ఆశలు పెట్టుకుని ఆమెవైపు ఏమిటన్నట్టు చూశాడు. "సుభద్రా జ్యోతివాళ్ళు బాగున్నారా?" అని మాత్రమే అడిగింది పంకజం.

"ఆ క్షేమంగానే వున్నారు" అన్నాడు. ఆ తర్వాత పంకజం ఏమి అడుగుతోందోనని ఎదురు చూస్తూ నించున్న శివుడికి ఆశాభంగమే ఎదురైంది.

"అంతే ! ఆ విషయమే కనుక్కుందామనుకున్నాను. ఇంక మీరు వెళ్ళచ్చు !" అన్నది పంకజం.