Shivatandavam - Comedy Serial 57
57వ భాగం
కిష్టుడూ, వసుంధరా ఇద్దరూ డాక్టరు గారి ఇంట్లోకి వచ్చారు. కొత్త పేషెంట్లని చూడగానే తిరువెంగళాచార్యులు బోలెడు ఆనందించాడు.
కల్వం ముందునించి లేచి నిలబడ్డాడు. దగ్గునీ, ఆయాసాన్నీ అదుపులో పెట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ కూతూహలంగా అడిగాడు.
"ఏమిట్నాయన మీ కంప్లేయింటు?"
"ఈ అమ్మాయికి కాళ్ళు రెండూ బెణికేయండి నాకేమో వళ్ళంతా దెబ్బలండి!"
ఆచారి వాళ్ళిద్దర్నే పరిశీలనగా చూస్తూ అడిగాడు "దెబ్బలాడుకున్నారా? జారిపడ్డారా?"
"రెండూనండి. అర్జంటుగా మా బాధ నయం కావాలండి" అన్నాడు కిష్టుడు అసహనంగా.
"నయమవుతుంది నాయనా (ఆయాసం) తప్పకుండా నయమవుతుంది (దగ్గు) తిరువెంగళాచార్యులింటికి వచ్చిన ఏ పేషెంటు కూడానూ నయం కాలేదని ఎప్పుడూ వెళ్ళలేదు. (అబద్దం చెప్పినందుకు విపరీతమైన ఆయాసం) ఇందాక...మీరొచ్చే ముందే ఒక పేషెంటు వచ్చి వెళ్లింది. మీరామెను చూసేవుంటారు (దగ్గు)"
"చూశాం"
"ఆమెకి నడుం నొప్పి. అయిదేళ్ళనుంచీ మంచాన పడివుంది. ఎందరెందరో ఇంగ్లీషు డాక్టర్లు ఏవేవో ఇంగ్లీషు మందులు వాడారు. ప్రయోజనం బండి సున్నా. (అబద్దం చెప్పడం వలన విపరీతమైన దగ్గు. అది పూర్తిగా తగ్గిన తర్వాత) ఆ కేసుని నేను తీసుకున్నాను. చింతామణి, చిత్తమకర ధ్వజం ఒక డోసు తగిలించాను. నెక్స్ట్ డే మంచం దిగేసింది (ఆయాసం) అప్పట్నుంచీ అంత దూరం నుంచి నడిచివస్తూ ప్రతిరోజూ మందు పుచ్చుకుంటోంది. ఇవాళే మందు మార్చాను. చూద్దామణీ, స్థిర చలనం ఒక్కటే ఒక్క డోసు ఇచ్చాను. పక్షం రోజుల్లో పరుగు తీయాల్సిందే. దానికింక తిరుగు లేదు" అని విపరీతంగా దగ్గేసి ఆయాసపడిపోయాడు ఆచారి.
"ఇప్పుడావిడ సంగతి వదిలేయండి ఆచార్లుగారూ ! మేము చాలా దూరం వెళ్ళాలి, మా గురించి ఆలోచించండి."
"ఆలోచిస్తున్నానయ్యా ఆలోచిస్తున్నాను. ఎంత ఆయాసంగా వున్నా, ఎంత దగ్గుతున్నా ఆలోచించడమే నా ప్రత్యేకత. అలవోక అరవిందం వాడదామా, ఆనంద మకరందం వేద్దామా అని ఆలోచిస్తున్నాను."
"ఏదో ఒకటి త్వరగా వాడండి. మేము త్వరగా వెళ్ళాలి" అన్నాడు కిష్టుడు.
"ఊరికే ఆందోళనపడకు నాయనా ! (దగ్గాడు) ఆందోళన పడితే మందు పనిచేయదు (ఆయాసం) ముందు ఆ బల్లమీద కూచోండి. స్థిమితంగా కూచోండి:" అంటూ ఆ ఇద్దర్నీ కూచోబెట్టాడు.
ఆ తర్వాత కిష్టుడ్ని చాలా పరిశీలనగా, ఎంతో ఆసక్తిగా గుచ్చి గుచ్చి చూస్తూ అన్నాడు.
"అవునూ ! నిన్నెక్కడో చూసినట్టు గుర్తు, ఎక్కడ చూసి వుంటారు ? ఎప్పుడు చూసివుంటాను ?"
"అయ్యా ! నన్నిక్కడే ఇప్పుడే చూశారు అరవిందమో, ఆనందమో అదేదో మా మొహాన కొట్టండి. మేము వెళ్ళాలి."
"అవి మొహాన కొట్టకూడదు నాయనా ! (ఆయాసం) కడుపులో పుచ్చుకోవాలి (మళ్ళీ ఆయాసమే) ఆ గదిలో వున్నాము తీసుకొస్తాను" అంటూ దగ్గుకుంటూ పక్కగదిలోకి వెళ్లాడు ఆచారి.
మందులు కలపడానికి ప్రయత్నం చేస్తూ, ఒక పేపర్ని బల్లమీద పరిచాడు. ఆ పేపర్ లో కిష్టుడు ఫోటో చూసి కెవ్వున అరవబోయాడు. వెంటనే ఆ కేకని దగ్గూ, ఆయసంలో మిక్స్ చేసి జాగ్రత్తపడ్డాడు. ఫోటో వైపు శ్రద్దగా చూస్తూ గొణుక్కున్నాడు.
"ఎక్కడ చూశానో గుర్తురాక ఆయాసపడిపోయాను. ఇక్కడ చూశాన్నాయనా ! ఐదువేలు. నా ఇల్లు బొత్తిగా క్షయ రోగై పోయింది. శిథిలావస్థలో వుంది. ఐదువేలూ చేతికొస్తే ఆరోగ్యం పుంజుకుంటుంది. ఏడుకొండలవాడా దయతలచి ఆ చిరంజీవిని నా ఇంటికి పంపేవా స్వామీ ! రెండు రెళ్ళు, రెండు మూళ్ళు, రెండు నాలుగులూ చక్కటి నెంబరు బాగా జ్ఞాపకం పెట్టుకునే నెంబరు హైదరాబాదుకి ఫోన్ కొడితే చాలు. అయిదు వేలు!" అనుకుంటూ గబగబా మందులు కలిపి వేసి వాటిని పిల్లల దగ్గరికి తీసుకొచ్చాడు.
"చూడు నాయనా, ఇది అలవోక అరవిందం. ఇది నువ్వు మింగు ! అమ్మా ! ఇది ఆనంద మకరందం ఇది నువ్వు మింగు." అంటూ ఇద్దరికీ రెండు పోట్లా లిచ్చాడు.
వాళ్ళు మింగారు. ఆచారి తృప్తిగా నిట్టూర్చి అన్నాడు.
"ఇక మీగ్గానీ, నాగ్గాని దిగుల్లేదు. రెస్టు తీసుకోండి. అంతా సర్దుకుంటుంది."
"రెస్టు తీసుకోవడాని మాకు టైం లేదండీ ! మేము వెళ్ళిపోవాలి." అన్నాడు కిష్టుడు.
"తప్పు నాయనా తప్పు ! మీరు వద్దనుకున్నా మందు ప్రభావం వలన రెస్టే తీసుకుంటారు. తొందరపడి లేస్తే వళ్ళు తిప్పుతుంది. తూలి పడిపోతారు. రెస్టు తీసుకోవడం పూర్తికాగానే గుణం కనిపిస్తుంది. లేడి పిల్లలా లేచి వెళ్ళిపోవచ్చు. (ఆయాసం) మీ వాలకం చూస్తుంటే తిండీ తిప్పలు లేనట్టుంది కదూ? (దగ్గు) మీరేం వర్రీ అవద్దు. అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. నిశ్చితంగా వుండండి!" అంటూ తిరువెంగళాచారి చొక్కా తొడుక్కుని చేతి సంచీ తీసుకున్నాడు.
జేబులు వెతుక్కుంటే పావలాకాసు మాత్రమే చేతికి తగిలింది. పావలాతో పిల్లల ఆకలి తీరదు. ఏం చేయాలో ఆచారికి తోచలేదు. ఎదురుగా ఏడుకొండలస్వామి కనిపించాడు. తన ఆయాసం దగ్గుతోపాటు భార్య జబ్బు కూడా నయమైతే కొండకి వస్తానని మొక్కుకున్న తాలూకు 'ముడుపు' డబ్బా వెంకన్న పాదాల దగ్గర కనిపించింది.
దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని లెంప లేసుకుని వీధిలోకి కదిలాడు. తిరువెంగళాచార్యులు ! ఇల్లు విడిచి వెళ్ళేప్పుడు అతను వీధి తలుపు వేసి దానికి తాళం కూడా వేసినట్టు కిష్టుడు గమనించాడు.