Shivatandavam Comedy Serial 56
56వ భాగం
తెల్లవారింది. ఇంటికొచ్చిన పంకజంతో గొప్ప బాధపడిపోతూ చెబుతున్నాడు జగన్నాధం. "రాత్రి కూడా మా దగ్గిరే పడుకోబెట్టుకున్నాం. మా కళ్ళు కప్పి ఎట్లా మాయమై పోయారో ఏమో తెలీకుండా వుంది." అంటూ అతను విమల వైపు కోపంగా చూసాడు.
విమల కూడా సంజాయిషీ చెప్పుకుంది.
"అసలు ఇద్దర్నీ చూడగానే నాకు అనుమానం కలగనే కలిగింది. పంకజం. అల్లరి చేస్తే పారిపోతారని మాయమాటలు చెప్పి వాళ్ళని బుజ్జగించాం కూడాను. మా కళ్ళల్లో కారం కొట్టి రాత్రికి రాత్రే పారిపోయారు."
"ఎక్కడికి పారిపోతారు? ఇక్కడే ఈ ఊళ్ళోనే వుండివుంటారు. బస్టాండుకీ, రైల్వేస్టేషన్ కి మనుషుల్ని పంపితే తప్పకుండా దొరుకుతారు." అన్నది పంకజం.
"ఆ ఏర్పాట్లేవో నాకు వదిలెయ్. అవన్నీ నేను చూసుకుంటాను. ఇంక నువ్వు నిశ్చితంగా వుండు." అన్నాడు జగన్నాధం బయటకు నడుస్తూ. కిష్టుడి ఒళ్ళో రెస్టు తీసుకుంటున్న వసుంధర మెల్లిగా కళ్ళు విప్పింది. కిష్టుడు నవ్వుతూ పలకరించాడు.
"హౌ ఆర్యూ?" వసుంధర నీరసంగా నవ్వింది.
ఆమె వంట్లో శక్తి పూర్తిగా క్షీణించింది. లేచి కూచోబోయింది తూలి పడిపోయింది. కిష్టుడు ఆమెను పొదివి పట్టుకున్నాడు. కిష్టుడు స్థితీ అంతంతమాత్రంగానే ఉంది. రాత్రి చూసుకోలేదు గాని అతని వళ్ళంతా దెబ్బలే.
"నడుద్దామా?" అన్నాడు కిష్టుడు.
"కొంచెం ఓపిక తెచ్చుకో వసూ. దగ్గర్లో డాక్టరెవరైనా ఉండొచ్చు. వెంటనే డాక్టర్ని చూడటం ముఖ్యం...ఊ..లేచి నిలబడు." అతి ప్రయత్నం మీద వసుంధర లేవగలిగింది. ఆమెను మెల్లిగా నడిపించుకుపోతున్నాడు కిష్టుడు.
అదొక ఇల్లు? బాగా మాసిపోయిన పెంకుటిల్లు. దానికో బోర్డు. తిరువెంగళాచార్యులు దగ్గుతూ ఆయాసపడుతూ కల్వంతో ఏవో వేరులు నూరుతున్నాడు. శ్రీమతి తిరువెంగళాచార్యులు నడ్డిమీద చేయి వేసుకుని వచ్చి అడిగింది.
"ఏమిటీ నూరుతున్నారు?"
"నీ నడుం నొప్పికి మందు" అన్నాడతను ఆయాసపడిపోతూ.
"ముందు మీ ఆయాసానికీ, ఆ మిడిమేళం దగ్గుకీ నూరుకోండి. మీ మందుల్తో నా నడుం నొప్పి తగ్గదు" అన్నదామె వ్యంగ్యంగా.
"విసుర్లు ప్రయోగించకు, చిరాకు నాకు. (దగ్గేడు) వైద్యంలో నాకు ఆరో ఏట నుంచి ప్రవేశమనే మాట మరిచిపోయేవా? (ఆయాసం) ఈ చేతులతో, ఈ మందుల్తో ఎన్ని వందలూ, వేల ప్రాణదానాలు చేశావో కూడా మరిచిపోయావా? (ఆయాసం, దగ్గు) చివరికేదో కొంచెం అస్వస్థత చేసి ప్రాక్టీసు తగ్గించుకుంటే నా వైద్యానికే వంకలు పెడుతున్నావా మంగతయారూ? (దగ్గూ, ఆయాసం) చెబుతున్నా విను. నీ నడుంనొప్పి తగ్గాలంటే చాముండీచారు ముక్తాంత మొక్కటే సరసయిన మందు. అది చేయడం ఈ భూలోకంలో నా ఒక్కడికే తెలుసు. (ఆయాసం, దగ్గు) క్షణమాగు. ఒక పట్టుపడతాను." అన్నాడు తిరువెంగళాచార్యులు.
"మీ పట్లుకీ, మీ మందులకీ శతకోటి నమస్కారాలు. పక్క వీధిలో ఇంగ్లీషు డాక్టరు డాక్టరు దగ్గరే ఇంజక్షను తీసుకువస్తాను. అంతేగాని చచ్చినా సరే మీ మందు వాడను వాడలేను" అంటూ ఆమె నడుం పట్టుకుని బయటకి నడిచింది.
ఆ ఇంటిముందు కిష్టుడూ, వసుంధరా నిలబడివున్నారు. "డాక్టరు గారు ఉన్నారాండీ?" అడిగాడు కిష్టుడు. "ఉన్నారు" అంటూ నడుం బాధకి మూలుగుతూ ఆమె వెళ్ళిపోయింది.