Shivatandavam - Comedy Serial 45
45వ భాగం
శివుడు కూడా పంకజమింటికి వెళ్లబోయాడు. కానీ పంకజం నిర్ణయం జ్ఞాపకంరాగా అతను గుమ్మం దగ్గిరే ఆగిపోయాడు. అతని మనసు బాగా వికలమైంది. ఓదార్పు కోసం అతను గబగబా పూజా మందిరం వైపు అడుగు పెట్టాడు. ఆ గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు.
"వత్సా" అనే శబ్దం వినిపించింది.
ఆ దిక్కువైపు చూశాడు. ఆంజనేయస్వామి కేలండర్లో అర్థా జనార్ధనరావు తన రెండు చేతులూ చాచి పిలుస్తున్నాడు "వత్సా" అని ప్రేమగా.
శివుడు "స్వామీ" ఆ గోడ దగ్గిరికి వెళ్ళి, ఆ కేలండర్లో స్వామి పాదాలు పట్టుకున్నాడు.
"వత్సా ! స్త్రీ ద్వేషం ఆరోగ్యానికి మంచిది కాదు నాయనా ! స్త్రీ లేనిదే సృష్టే లేదు. నువ్వు లేవు. నేను లేను. శ్రీరాముడు లేడు. శ్రీకృష్ణపరమాత్మ లేడు. అందుచేత అసృష్టికి మూల కారణమైన స్త్రీని ద్వేషిస్తే పాపమవుతుంది నాయనా! వేదాల్లో కూడా ఇదే చెప్పారు!" శివుడు బరువుగా నిట్టూర్చి బాధగా అన్నాడు.
"వేదాల్లో ఏం చెప్పారో ఇంతకు మునుపే నాకు చెప్పివుంటే పంకజం నాకు దక్కివుండేది స్వామీ ! ఇంత లేటుగా చెబితే ప్రయోజన మేమిటి స్వామీ?" జనార్ధనరావు పకపకా నవ్వాడు.
"నవ్వకండి స్వామీ ! నవ్వి నా బ్రతుకు నవ్వులపాలు చేయకండి! నేనే నడిగిందానికి సమాధానం చెప్పండంతే!" అన్నాడు
శివుడు గంభీరంగా.
"వత్సా!"
"స్వామీ"
"నువ్వొక పిచ్చివాడివి!" "ఆ మాట చచ్చినా ఒప్పుకోను స్వామీ ! ఒరిజినల్ గా నేను తెలివిగల వాడినే ! నన్ను పిచ్చివాడ్ని చేసింది మీరే స్వామీ! మీరే ! వేదాల్లో ఏం చెప్పారో ఇన్నేళ్ళూ దాచి నన్ను పిచ్చివాడ్ని చేసింది మీరే!" అన్నాడు శివుడు రోషంగ.
"వత్సా! వేదాల్లో ఏం చెప్పారో విని అర్థం చేసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు గదా అల్లాంటిది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేను చెప్పినా ఎట్లా వంట బట్టించు కుందామనుకున్నావ్? అదృష్టవంతుడివి గనక ఇప్పటికైనా వేదాల్లో ఏం చెప్పారు నా చేత చెప్పించు కోగాలిగావ్!"
"చెప్పారు సరే! అది నాకు వంటపడుతుందంటారా?"
"ఆ సూచనలే కనిపిస్తున్నాయి! లే వత్సా! కళ్ళు తుడుచుకో ! గుండెదిటవు చేసుకో? తరుణోపాయం ఆలోచించు. నీకు శుభం కలుగుతుంది!" అని దీవించాడు అర్థా జనార్థనరావు.
"అన్నయ్యా, అన్నయ్యా" అంటూ తలుపు తడుతున్నాడు కిష్టుడు. కిష్టుడు భుజమ్మీద చేయిపడింది. ఉలిక్కిపడి చూశాడు. అతడు కైలాసం !
"గురువుగార్ని డిస్టర్బ్ చేయకు. పూజలో ఉన్నారు" అన్నాడు కైలాసం.
"ఏదీగాని వేళ! ఇప్పుడు పూజేమిటి?"
"ఆయన్నొదిలి పెట్టు. నీతో అర్జంటుగా మాట్లాడాలి. నీ గదిలోకి వెడదాం పద!" అన్నాడు కైలాసం. ఇద్దరూ కిష్టుడి గదిలోకి అడుగుపెట్టారు. కిష్టుడు మంచమ్మీద కూచున్నాడు. కైలాసం గది తలుపులు మూసి, ఆ తలుపుల మీద వాలిపోయి ఉన్నాడు.
"ప్రేమపాఠాల్లో బాగా అడ్వాన్సై పోతున్నావు!" అన్నాడు కైలాసం.
"ఏం లాభం? నీలాంటి. సి.ఐ.డీ గాడు అన్నయ్య బుర్ర పాడుచేస్తున్నంతకాలం నేను బాగుపడను" అన్నాడు కిష్టుడు నిషూరంగా. "నువ్వూ - ఆ ఎదురుదింటి పిల్లా మళ్ళా కలిసి కనిపిస్తే అక్కడిక్కడే నీడొక్కచించి డోలు కట్టమన్నారు గురువుగారు! ఇవాళ కూడా రెండోసారి ఇద్దర్నీ పార్కులో చూశాను!" కిష్టుడు అదిరిపోయాడు !
భయం భయంగా అడిగాడు "ఏమిటీ - ఇవాళ కూడా మీ ఇద్దర్నీ"
"పార్కులో చూసాను."
"మా మాటలు....?"
"విన్నాను."
"అమ్మో! విన్నదంతా అన్నయ్యతో చెబుతావా?"
"చెప్పను!"
"అట్లా కనిపిస్తే నా డొక్కచించి డోలుకట్టమన్నాడని కదూ చెప్పావు?"
"అవును!" "ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభిస్తావా?"
"ప్రారంభిచను." కిష్టుడికి నమ్మశక్యం కావడంలేదు. అందుకే అన్నాడు.
"కైలాసం, ఏమిటిది? చూసింది చెప్పనంటున్నావ్. నా డొక్కచించి డోలుకట్టనంటున్నావ్! గురువాజ్ఞ పాటించడం నీకు మొదట్నుంచీ అలవాటేగా! అలవాటుకి ఇప్పుడు స్వస్తి చెబుతున్నాను!"
"థాంక్యూ! థాంక్యూ వెరీమచ్!" అన్నాడు కిష్టుడు ఆనందంగా!"
"థాంక్సెందుకు ఇందులో నా స్వార్థం కూడా ఉంది!" కిష్టుడు క్షణమాలోచించి, బిక్కమొహం పెట్టుకుని అడిగాడు. "నీమాటలు నాకేం అర్థం కావడంలేదు!" "నేను మీ అక్కయ్య కూతురు జ్యోతిని అపారంగా ప్రేమిస్తున్నాను!" అంత మాట వినేసరికి కిష్టుడు మంచమ్మీదనుండి లేచి నిల్చోబోయాడు. కైలాసం మంచాన్ని తక్షణం తన ముందుకి లాక్కున్నాడు. అతనట్లా చేయకపోతే, మంచంపైన తిరిగే ఫ్యాను కిష్టుడు తలని పచ్చడి చేసి ఉండేది. కిష్టుడు ఫ్యాను వైపు చూసి, ఆ తర్వాత కైలాసం వైపు చూస్తూ "థాంక్యూ" అన్నాడు.
"ఎందుకు? నేను జ్యోతిని ప్రేమిస్తున్నందుకా? నీకు ఫ్యాను ప్రమాదం తప్పినందుకా?"
"రెండింటికీ! కానీ నాదో సందేహం!" అతని సందేహ మేమిటో అడగనీకుండానే కైలాసం అన్నాడు
"చూడు కిష్టుడూ! నేను గ్రాడ్యుయేట్ ని, బుద్ధిమంతుడిననే నమ్మకంతో పాటు పెద్దలిచ్చిన కొన్ని సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఎక్కడా ఉద్యోగం దొరక్క గురువుగారి దగ్గర సెక్రటరీగా చేరాను. రేపో మాపో మంచి ఉద్యోగమే వస్తుంది. నా భార్యపిల్లల్ని పోషించుకోగల స్థోమత కూడా ఉంటుంది. నాకు మంచి ఉద్యోగం దొరికిన తర్వాతనే జ్యోతిని పెళ్ళి చేసుకుంటాను. ఇంకా నీ సందేహమేమిటో చెప్పు? జ్యోతికి నేను తగిన వరుడ్ని కానా?"
"సందేహం నీ గురించి కాదు అన్నయ్య గురించి. అన్నయ్య ఆశయమేమిటో తెలుసు గదా! అలాంటి మనిషి దగ్గిర కొలువు చేస్తూ, ప్రేమా - దోమా అన్నావంటే నిన్ను బతకనిస్తాడా?"
"ఆయనకి తమ్ముడిగా నువ్వు బతకడం లేదూ? తమ్ముడే నిర్భయంగా ప్రేమిస్తుంటే చాకిరీ చేస్తున్నవాడ్ని నాకెందుకు భయం? ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి ? బతికేందుకు సవాలక్ష మార్గాలు!"
"మరి నిన్ను జ్యోతి ప్రేమించవద్దూ?" "సీన్లోనుంచి నువ్వు తప్పుకుంటే సరి? మిగతా కష్టాలు నేను పడతాను"
"ఎట్లా తప్పుకోవాలో కూడా నువ్వే చెబుతావా?" "తప్పదంటే చెబుతాను!"
"తప్పదు!" కైలాసం జేబులోంచి ఒక కాగితం తీసేయిస్తూ అన్నాడు.
"అంతా ఇందులో రాసాను, ఆ ప్రకారం ఆచరించు." కిష్టుడు కాగితం తీసుకుంటూ అన్నాడు.
"నన్ను అన్నావే గాని, నువ్వు కూడా చాలా అడ్వాన్సయి పోయావు!" "ప్రేమ - దాని పవరే అంత! గుడ్ నైట్" అంటూ అతను తలుపుతీసుకుని వెళ్ళిపోయాడు. కిష్టుడు కైలాసమిచ్చిన కాగితం చదువుతున్నాడు.