శివతాండవం - కామెడీ సీరియల్ 46

 

46వ భాగం

ఆ సాయంత్రం.... డ్యూటీ ముగించుకున్నాడు అప్పల్సామి. స్టేషన్ రైటరు జీతలిస్తున్నాడు.

"అప్పల్సామి గారూ! జీతం తీసుకోండి" అని అరిచాడు రైటరు.

అప్పల్సామి విసుగ్గా అన్నాడు "పిలిస్తే పూర్తి పేరెట్టి నిప్పల్సామిగారూ అని మర్యాదగా పిలు. పేరు పొడుగు అయిందనుకుంటే సింపులుగా నిప్పుగారూ జీతమని చెప్పు. అంతే గాని ఉత్తప్పల్సామి అని పిలిస్తే. ఏంటో నీర్సంగా వుంటాదయ్యా పంతులూ!" అంటూ జీతాల బిల్లులో సంతకం పొడిచేసాడు.

డబ్బుకోసం చెయ్యిజాపాడు గానీ, మరో చెయ్యికూడా అక్కడ వెలిసింది. అది గాజుల చెయ్యి. ఈ కొత్త చెయ్యి ఎవరిదంటు చూసాడు. దుర్గమ్మ! నీళ్ళు నములుతూ అన్నాడు అప్పల్సామి "ఇచ్చెయివయ్యా పంతులూ! మా ఇద్దరిలో ఎవరికిచ్చినా ఒకటేలే! అనుకూల దాంపత్యం. ఇచ్చెయ్" రైటరు దుర్గమ్మకి జీతంమ్మొత్తం ఇచ్చేసాడు.

దుర్గమ్మ డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ భర్తతో అన్నది "ఇంటికి తొందరగా వచ్చేయ్" అప్పల్సామి పళ్ళుకొరుక్కుంటున్నాడు. గోడని గట్టిగా కాల్తో కొట్టాడు. నొప్పి పుట్టింది కాలుపట్టుకుని "అబ్బా!" అన్నాడు.

ఎవడో కిసుక్కున నవ్వాడు అటువైపు చూసాడు అప్పల్సామి. లాకప్ లో వున్న పిక్ పాకెట్ గాడు. సీరియస్ గా వాడిని పేరుతో పిలిచాడు అప్పల్సామి, "కోట్నాగులూ"

"అయ్య!"

"ఇప్పుడు కోడిపిల్లలాగా నవ్వింది నువ్వేనా?" గంభీరంగా అడిగాడు.

"కోడిపిల్లేంటో తెలవదు గానండి నవ్వింది నేనేనండి!"

"షటప్పు. లాకప్పుతో వుంటే షటప్పయిపోవాలి. అది రూళు. నువ్వెట్టా వచ్చిందిరా కొడకా!" కసిగా అడిగాడు అప్పల్సామి.

"గోడ మీ కాలిరగ్గొడితే నువ్వు రాలేదేంటి?" అప్పల్సామి రుసరుసలాడిపోతూ అన్నాడు.

"ఏంట్రా? గోడ నా కాలిరగొట్టిందా నా కాలిరిగితే నీకు నవ్వుగా వుంటదా? ఒరే లాకప్పులో వున్నావు కనుక బతికిపోయావు. నువ్వు రిలీజైన తర్వాత చెబుతారా? నమిలి మింగేస్తా చూస్కో"

"తొరగా ఇంటికెళ్ళండి. లేకపోతే దుర్గమ్మగారు మిమ్మల్నంత పనీ చేసేగలరు." దాంతో అప్పల్సామికి కోపం వచ్చేసింది. "ఒరే...ఒరే....స్పీడెక్కిపోతున్నావు! ఇంట్లో ఫ్యామిలీస్ గురించి స్టేషన్లో మీటింగులెట్టావో నేను లాకప్పులో కొచ్చేసి నీ పీక్కొరికేస్తా జాగ్రత్త! "ఏయ్ టూ నాట్ ఫైవ్!" అని కానిస్టేబుల్ని పిలిచాడు.

"పిలిచారా గురువుగారూ." అంటూ వచ్చా డొకడు!

"అవును పిలిచాను నువ్విక్కడే నించో. ఈడు ఈ కోట్నాగులు గాడు నవ్వినా, దగ్గినా నోటు చేసుకో! రేపు డూటీకి రాగానే నీ రిపోర్టు నాకు సబ్మిట్ చేసెయ్. ఆ తర్వాత కత నేను చూసుకుంటా! ఏం అర్థమైందా?"

"అర్థమైందండి!"

"సెల్యూట్ కొట్టు? ఇంటికెళ్ళే ఏలయ్యింది." అతను సెల్యూట్ కొట్టాడు.

అప్పల్సామి దర్జాగా బయటకు కదిలాడు.