Shivatandavam - Comedy Serial 43

 

43వ భాగం 

కారు తిన్నగా వచ్చి శివుదింటి ముందాగింది. అన్నదమ్ములిద్దరూ కారుదిగి ఇంట్లో అడుగుపెట్టారు. హల్లో సుభద్రతోపాటు సాక్షాత్తు బావగార్ని కూడా చూసి శివుడు షాకైపోయాడు. కిష్టుడు తన మాటల్లో బైటపడిపోయాడు "అన్నయ్యా! బావగారు సన్యాసం స్వీకరించాడని చెప్పావు గదా! కాషాయ వస్త్రాల్లో వుండాల్సినవారు ఇంకా సూతులోనే ఉన్నారేమిటి?" బావగారికి వళ్ళు మండిపోయింది. కళ్ళెర్రజేసి అన్నాడు.

"ఏమిటి? నేను సన్యాసం స్వీకరించానా? (శివుడితో) ఏవయ్యా అట్లాగని మీ తమ్ముడితో చెప్పింది నువ్వేనా !"

"నాకు మా అక్కయ్య చెప్పింది"

"సుభద్రా ! వాటీజ్ దిస్ నాన్ సెన్స్ ? (శివుడితో) మీ అక్కయ్య జోక్ చేసిందే అనుకో! ఆమాట నువ్వెట్లా నమ్మావు? నా రంగూ, రుచి, వాసనలు సన్నాసి నవుతానని చెప్పాయా? నాకేం తక్కువని సన్నాసి నవ్వాలి? డబ్బు తక్కువా? హోదా తక్కువా? పదవి తక్కువా? సుఖం తక్కువా? ఏది తక్కువైందని సన్నాసి నవ్వాలి?"

"నా ఉపన్యాసాలు మీ మీద బాగా పనిచేసి" ఆ మాటతో మరింత పెట్రేగిపోయారు బావగారు

"అయ్ హేట్ యువర్ బ్లడీ ఉపన్యాసాలు! నీ మురికి ఉపన్యాసాలకు పడిపోయి "శంభోశంకరా" అంటూ కమండలం పుచ్చుకునే మూర్ఖుడి ననుకున్నావా? నేనే కాదు ఎప్పుడూ నీ ఉపన్యాసాలకు పడిపోయి సంసారాలు పాడుచేసుకోడు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా నీ చుట్టూచేరి నీకు భజనలు చేసేవాళ్ళంతా నీకంటే తెలివిగలవాళ్ళు. నిన్ను అమాయకుడ్ని చేసి నీ దగ్గర భోంచేస్తున్నారు. వాళ్ళు జైకోడితే ఉబ్బిపోతున్నావ్. దండేస్తే వీరేశలింగం మంతటి సంఘసంస్కర్త ననుకుంటున్నావ్. ఆకిరాయి మనుషుల మాయలో పడిపోతున్నావ్. పచ్చటి బతుకుని పాడుచేసుకుంటున్నావ్. నీలాంటి డేమ్ ఫూల్ ఈ ప్రపంచంలో నువ్వొక్కడివేనని నొక్కినొక్కి చెప్పగలను. ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ పంథా మార్చుకో. చెక్ యువర్ సెల్ఫ్. (భార్యతో) ఏమోయ్ నా పోర్షను వాప్పచేప్పేసేను. కైనై గో నవ్?"

"ఊ వెళ్ళిరండి" అన్నది సుభద్ర. మరోమాట లేకుండా వెళ్ళిపోతున్నాడు బావగారు. కిష్టుడి కిదేం బోధపళ్ళేదు.

"ఇదంతా ఏమిటన్నయ్యా?" అని శివుడ్ని అడిగాడు.

"ఇప్పుడు వాడేం చెప్పలేడు గానీ. నువ్వు కొంచెం బయటకు వెళ్ళు" అని ఆర్డరేసింది సుభద్ర. వసుంధరని కలుసుకోవడానికి అదే చక్కని అవకాశమని కిష్టుడు గబగబా బయటికి వెళ్ళిపోయాడు.

ఆగమని అన్నయ్య ఆర్డరు వేయకపోవడం ఆశ్చర్యంగానే వుందతనికి. శివుడు సుభద్ర వైపు కసిగా చూస్తూ అన్నాడు.

"నా దీక్షనీ, నే తలపెట్టిన యజ్ఞాన్నీ ఎగతాళి చేయడానికి వచ్చావు కదూ?"

"కాదురా! నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను."

"నేనేం కళ్ళు మూసుకుని బతకడం లేదే?"

"అని నువ్వనుకుంటున్నావ్. ఒక ఆవేశపరుడూ, అవివేకీ నాకు తమ్ముడైనందుకు సిగ్గు పడుతున్నానురా శివుడూ! ఒక్కమాట చెప్పు ఏం చూసి నువ్వు ఆడజాతిని ఏవగించుకుంటున్నావ్?"

"అది నీకు చెప్పినా అర్థం కాదు."

"అట్లాగా! పోనీ, నేను చెప్పేది నువ్వార్థం చేసుకోగలవా!"

"ఏం చేబుతావ్?"

"ఒక కథ! అకారణంగా ఒక ఆడపిల్ల మీద నువ్వు పెంచుకున్న కసి కథ! ఆ అర్థం లేని కసితో సమస్తమైన ఆడజాతినే ద్వేషించే నీ తొందరపాటు కథ! పంకజం కథ!"

"అక్కయ్యా!"

"అరవకు నీ కళ్ళతో నువ్వు చూసిందే నిజం కాదురా! నీ కళ్ళుచూడని కథ వేరేవుంది. ఒకే ఆ రోజు నువ్వు నది దాటి వెళ్లి పంకజం చేత పరాభవింపబడటం అంతవరకే నీకు తెలుసు. కేవలం నీ ప్రాణాలు రక్షించేందుకే ఆనాడు నిన్ను పంకజం కొట్టి అవమానించింది. అది తెలుసా నీకు?"

"అక్కయ్యా!"

"వినే ఓపికవుంటే కూచో! జరిగిందేమిటో చెబుతాను." అతను అప్రయత్నంగా కూచున్నాడు.

సుభద్ర చెప్పడం పారంభించింది.

"ఆరోజు నువ్వు రేవుగట్టుకి వస్తావని పంకజం ఇల్లు విడిచి నీకోసం వస్తోంది."