Shivatandavam - Comedy Serial 42

 

42వ భాగం

మగపిల్లల కాలేజి వదిలారు. బిలబిలమంటూ విద్యార్థులు క్లాసులోంచి బయట కొస్తున్నారు కిష్టుడు సైకిలు స్టాండు తీస్తుండగా 'బుజ్జులూ' అని వినిపించింది.

శివుడు! అతని క్కొంచెం దూరంలో కారు. "జ్వరం ఎట్లా వుందిరా!" "చెప్పేను గదా! మాత్ర వేసుకోగానే మటుమాయమై పోయింది. అయామ్ ఆల్ రైట్!"

"రా...వచ్చి కారెక్కు!"

"ఎందుకూ, సైకిలుందిగా!"

"సైకిల్ని డిక్కీలో పెట్టు" తన కోసం సంవత్సరాలైనా క్రాస్ రోడ్సు దగ్గర వెయిట్ చేస్తానన్న వసుంధర మాట గుర్తుకొచ్చింది కిష్టుడికి. ఇలాంటప్పుడు అన్నయ్యతో పాటు కార్లో వెళ్ళిపోతే వసుంధర ఏమవుతుంది? "ఎందుకులే అన్నయ్యా! నేను సైకిలు మీదే వస్తాను."

"నా మాట వినరా! ఒంట్లో బాగులేనప్పుడు సైకిలెందుకు చెప్పు ? అసలు కాలేజీకి రావడమే తప్పు. ఊ సైకిలు డిక్కీలో పెట్టు" అన్నాడు శివుడు.

కిష్టుడికి తప్పలేదింక. సైకిలు డిక్కీలో పెట్టి అన్నయ్యతో పాటు కారెక్కాడు. కారు కదిలింది. శివుడు చెబుతున్నాడు "సుభద్రక్కా - జ్యోతీ వచ్చారు"

"ఎప్పుడూ?" కుతూహలంగా అడిగాడు కిష్టుడు.

"గంట క్రితం! బావగారు సన్యాసం స్వీకరించి ఎటో వెళ్ళిపోయారట!"

"అయ్యెయ్యో!"

"ఎందుకురా విచారిస్తావ్ ! పెళ్ళి చేసుకున్న తర్వాత ఇలాంటి ఈతి బాధలు తప్పవు. సుభద్ర ప్రస్తుతం ఎదురింట్లో వున్నది".

"అక్కడెందుకు?"

"మనింట్లో చోటు లేదన్నాను. అసలు అక్కెందుకు వచ్చిందో తెలుసా?"

"చెప్పావుగా! బావగారు సన్యాసంలో చేరిపోయారని!"

"అందుకు అక్క బాధపడటం లేదు. అక్క రాకలో అంత్యరం వేరు. నిన్ను బెజవాడకు తీసుకెళ్ళి, జ్యోతినిచ్చి పెళ్ళి చేయాలనుకుంటోంది."

"అన్నయ్యా!" కిష్టుడు చేతిని మెల్లిగా నొక్కాడు శివుడు.

"నీ సమాధానం ఏమిటో వినే వెడతానని పంతం పట్టింది"

"నాకిష్టం లేదు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను" అన్నాడు కిష్టుడు సీరియస్ గా.

ఆ మాటకి శివుడు పొంగిపోయాడు.

"దట్స్ గుడ్! ఆ మాటే అక్కతో నిర్భయంతో చెప్పు" అన్నాడు.

క్రాస్ రోడ్డు దగ్గిర పడుతోంది. రోడ్డు పక్కన వసుంధర సైకిల్తో పాటు నిలబడి వుండటం చూశాడు కిష్టుడు. అతని మనసు విలవిల్లాడుతోంది. తాను అక్కడ దిగాలి. అది ఎట్లాగూ కుదిరేది కాదు కనీసం చేత్తోనైనా సైగ చేయాలి.

"చలి గాలి ఎక్కువైంది, గ్లాసులెత్తు!" అంటూనే శివుడు డోరు గ్లాసులెత్తాడు.

ఇప్పుడు చెయ్యెత్తి సైగచేసే అవకాశం కూడా లేక పోయింది. వసుంధర పాపం ఇంకా అక్కడే. అట్లాగే నిలబడి తనకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఆమెను దాటి పోయే సమయంలో....."వాంతి వచ్చేట్టు వుంది, కారు ఆపు" అన్నాడు కిష్టుడు.

శివుడు ఆందోళనగా కారు ఆపాడు. కిష్టుడు గబగబా కారుదిగి వసుంధరకి సైగ చేశాడు. తాను వెళ్ళిపోతున్నట్టు, అన్నయ్య తీసుకెళ్ళుతున్నట్టు.

వసుంధర గారంగా కాల్తో నేలమీద కొట్టింది. ఈ సైగలు ఇట్లా హోరాహోరీగా సాగుతుంటే, శివుడు వచ్చి తమ్ముడ్ని అడిగాడు "ఇప్పుడెట్లా వుందిరా?"

"వచ్చే వాంతి ఆగిపోయిందన్నయ్యా! మాత్ర వేసుకున్నాను గదూ, పైత్యం చేసిందంతే! పద పోదాం!" అంటూ అన్నయ్యతోపాటు నడుస్తూ తల బాదుకుంటూ కారెక్కాడు.