Shivatandavam - Comedy Serial 41
41వ భాగం
"అదండీ జరిగిన కథ! ఇప్పుడు చెప్పండి సుభద్ర గారూ! ఎవరు ఎవర్ని అన్యాయం చేశారు? ఎవరు ఎవర్ని పాడు చేశారు?"
"మరి ఈ విషయాలన్నీ మావాడికి ఎందుకు చెప్పలేదూ?"
"ఎక్కడ వున్నాడని చెప్పను! నా మీద విరక్తితో దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడని మాత్రమే తెలిసింది. ఎక్కడని వెతకను? ఎట్లా చెప్పను?"
"వాడింటి ముందే వున్నావు. ఇప్పుడైనా చెప్పవచ్చు కదా!"
"అయ్యో! చెప్పడానికి నేనెన్ని ప్రయత్నాలు చేశానో మీకు తెలీదండీ! అతనింటికి వెళితే నా మొహమ్మీదే తలుపు మూసేశాడు. ఫోన్ చేస్తే మధ్యలో పెట్టేశాడు. ఉత్తరం రాస్తే చదవకుండానే కాల్చి బూడిద చేశాడు. నా కథ చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదు?" పంకజం మీద సుభద్రకు జాలి కలిగింది.
ఆమెను దగ్గిరకి తీసుకుంటూ అడిగింది. "అప్పట్నుంచీ మా తమ్ముడి కోసం అవివాహితగానే వుండిపోయేవా పంకజం?" పంకజం కళ్ళల్లో నీళ్ళు తిరగ్గా అవునని తలూపింది.
"ఇంత మంచి పిల్లని సాక్షాత్తు దేవతనే హింస పెడుతున్నాడు. వాడి ఆవేశం వాడిదేగాని ఆలోచన బొత్తిగా లేని మనిషి" పంకజం తన బాధంతా వెళ్లగక్కుకున్నాననే తృప్తితో ఘెల్లున ఏడ్చేసింది. సుభద్ర పంకజం కన్నీటిని తుడిచి అన్నది "బాధపడకు నేనున్నాను గదా ! ధైర్యంగా ఉండు. నిన్ను ఎట్లా కాదంటాడో చూస్తాను!"
"వదినా!" అన్నది పంకజం ఆత్మీయంగా. ఆ మాటకి సుభద్ర పొంగిపోయింది.
"ఎన్నాళ్ళకి విన్నానమ్మా 'వదినా' అని. ఈ పిలుపు కోసమే నమ్మా ఇన్నేళ్ళూ ఎదురు చూస్తూ గడిపాను. పుట్టిల్లని చెప్పుకోడానికి ఇల్లొకటి వుంటే సరిపోతుందా? ఆ ఇంటికి వేలుగ్గా నీలాంటి వదినొకర్తి వుండొద్దూ? చూడు పంకజం, శువుడికీ నీకూ పెళ్ళి చేసిగాని ఈ ఇంట్లోంచి కదలను, ఇది నా శపథం".
"వదినా!" అంటూ సుభద్రని కౌగలించుకుంది పంకజం.
అంతలో గేటుదగ్గర కుక్క మొరిగింది. దాంతోపాటు కారు హారను కూడా మోగింది. ఆడవాళ్ళు ముగ్గురూ హాలుదాటి వరండాలోకి వచ్చారు. గేటుబయట శివుడు కార్లో కూచుని వున్నాడు. జ్యోతి గేటు దగ్గరికి పరుగెత్తింది. ఏం కావాలీ అన్నట్టు శివుడి వైపు చూసింది.
"మీ అమ్మను రమ్మను!" అన్నాడు శివుడు గంభీరంగా.
"రా....దు!" అన్నది జ్యోతీ గంభీరంగానే. జ్యోతీ "నీకే చెబ్తూంట! అమ్మను రమ్మను. పరాయి ఇళ్ళల్లో వుంటే పరువు పోతుంది, రమ్మను, వెంటనే"
"మా....కిది...ప...పరాయి ఇల్లు కా...దు! ఇది మా...ఇల్లే! మా...కు...ఇక్కడే పరువు" అని వచ్చేసింది జ్యోతి. శివుడు మళ్ళా హారను మోగించాడు.
కుక్క మళ్ళా భౌమని మొరిగింది. శివుడు కారు స్టార్టుచేసి వెళ్ళిపోయాడు. సుభద్ర పంకజంతో అంటోంది. "చూశావా వాడి పొగరు. వాడింట్లో మాకు ఔట్ హౌస్ విడిదిస్తాట్టా విడిది. నీ ఇంట్లో చేరగానే రోషం తన్నుకోచ్చేసింది. రోషం అమ్మా జ్యోతీ నాన్నగారికి ఫోన్ చేసి మనమెక్కడ ఉన్నదీ చెప్పు!" జ్యోతీ ఫోన్ చెయ్యడానికి హాల్లోకి పరుగెత్తింది.
"అన్నయ్యగారు కూడా ఈ ఊళ్ళోనే వున్నారా?"
"వున్నారు, వాతావరణం ఎట్లా వుందో చూసిరమ్మని ముందుగా నన్నూ జ్యోతిని పంపారు. ఆయన హోటల్ అశోకాలో వున్నారు. మా పిచ్చిగాని వీడింట్లో వాతావరణం ఎందుకు మారుతుంది? మాములుగా చుట్టం చూపుగా వస్తే రానివ్వడని వాళ్ళ బావగారు సన్యాసంలో చేరిపోయారు మాకు అన్యాయం చేశాడని చెప్పాను!"
"అయ్యేయ్యో! అబద్దమైనా అంత మాటెందుకన్నావు వదినా?"
"చూశావా? ఆ మాటికి నువ్వెంత బాధపడ్డావో! ఆ బాధ వాడికేమైనా వుందా? లేదు, అయ్యో పాపమనీ ఓదార్చాడా? లేదు. పైగా వాళ్ల బావగారు ఘనకార్యం చేశాడని బోలెడు ఆనందించాడు. వారిని పెళ్ళాడి నా చెప్పుచేతుల్లో పెట్టుకున్నందుకు అది ఫలితమట. వారిని నా ఇష్ట ప్రకారం ఆడిస్తూ మేడలూ, పొలాలూ నా పేర రాయించుకున్నానట. చివరికి నా సాధింపు పడలేక వారు సన్నాసుల్లో కలిసిపోయారట. ఒకటా రెండా పంకజం ! అక్కననే ఇది కూడా లేకుండా వాడినోటికొచ్చినట్టు కూశాడు. ఏం వదినా పెళ్ళయ్యాక ఆడది తన సంసారం తాను బాగుచేసుకోవడం కూడా తప్పేనా! అంత మాత్రానికే మగాడికి మతిపోయి సన్నాసుల్లో కలవడం తధ్యమని సూత్రాలు చెబుతున్నాడు....సూత్రాలు" సుభద్ర తన గొంతు వెళ్లబోసుకుంది. అంతలో జ్యోతి వచ్చి చెప్పింది .
"అమ్మా ఫోన్లో ....నాన్నారు...పిలు...స్తున్నారు?" సుభద్ర గబగబా ఫోన్ దగ్గిరకి వెళ్లింది.
"ఆ ...నేనే మాట్లాడుతూండ. వాడింట్లో లేము. మా వదినగారింటిలో వున్నా...అదంతా పెద్ద కథండీ. తర్వాత చెబుతాను...ఈ ఫోన్ నెంబరు నోట్ చేసుకున్నారా?.....ఆ....అంతే! మీ ట్రైనింగు పూర్తయ్యే వరకు ఇక్కడే వుంటాం. శివుడి పెళ్ళీ మనమే చేయాలి...అవునండీ...మన శివుడి పెళ్ళే...వదినగారంటే ఎవరనుకుంటున్నారు? ఆవిడే మరి! మీకంత గందరగోళంగా వుంటే ఫోన్ పెట్టేయండి. తర్వాత అన్ని వివరాలూ చెబుతాను ఆ...అట్లాగే...వుంటాను" అని ఫోన్ పెట్టేసి పంకజంతో అన్నది.
"ఆయనకీ వూళ్ళో నెలరోజుల పాటు ట్రైనింగుంది వదినా! తమ్ముళ్ళని చూసినట్టు వుంటుందని వారితోపాటు మేము కూడా వచ్చా." పంకజం సుభద్ర చేతులు పట్టుకుని అన్నది "నువ్వు రావడం నా అదృష్టమనే చెప్పాలి వదినా!".
"అదృష్టమ్మాట అట్లా వుంచు. ముందు మనం శివుడు భరతం పట్టాలి, అది ముఖ్యం."
"అంటే?"
"ఏమీ లేదు. ఇన్నాళ్లూ సమస్త స్త్రీజాతిని ద్వేషిస్తూ ఉపన్యాసాలిచ్చాడు గదా! ఇప్పుడు వాడు మనకి దాసోహమనేలా చేయాలి ఇందులో నీది పెద్ద పాత్ర వుందమ్మా పంకజం...జారిపోయావో శివుడు మనమాట వినడు."
"నువ్వే ఏం చెబితే అది చేస్తాను!"
"ఆ హామీ చాలు!" అన్నది సుభద్ర ఆనందంగా.