Shivatandavam - Comedy Serial 40

 

40వ భాగం

అదిరే గుండెతో పంకజం అక్కడ్నించి తప్పించుకుని రేవు గట్టువైపు పరుగుతీసింది. గట్టుమీద నిలబడి గజగజా వణికిపోతోంది.

"భగవాన్ ! శివుడ్ని రానీకు. శివుడు రాకూడదు. భగవాన్" అని గొణుక్కుంది. కానీ...అంతలోనే ఈదుకుంటూ రావడం చూసింది!

"శివుడూ పారిపో..." అని పొలికేక పెట్టేదే అప్పటికే రౌడీలూ, జగన్నాధం తుప్పల చాటుకి రావడం గమనించింది.

ఏం చేసి ఈ ఆపద గట్టెక్కించాలో అప్పటిక్కప్పుడే ఆలోచన చేసుకుంది. శివుడు వచ్చాడు. ఎంతో ఆత్రంగా శివుడు తనని చేరుకోగానే అతని చెంపలు వాయించేసింది. శివుడు ఆ చర్యకు నిశ్చేష్టుడయ్యేడు.

పంకజం ఆవేశంతో రొప్పుతూ అంటోంది "హు..నన్ను ఉద్దరించే మగాడివా నువ్వు? ఆనాడు నాటకంలో నిన్ను కొట్టేనే గాని దాంతో నా కసి తీరలేదు శివుడూ ! నిన్ను చితగొట్టి పంపించాలనే ఉద్దేశంతో అలాంటి ఉత్తరం రాసేను. వెయ్యి జన్మలెత్తినా నువ్వు మా జగ్గు బావకి దీటురావు. అతనెక్కడ ? నువ్వెక్కడ? పో...ఈ జన్మకి నాక్కనిపించకు. ఆడపిల్లను అవమానిస్తే దానికి శిక్షేమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నావు కదా! వెళ్ళింక! ఫో!" అంటూ అరుస్తోంది.

శివుడు నదిలో పడ్డాడు. తుప్పల్లో దాక్కున్న జగన్నాధం తృప్తిగా నిట్టూర్చాడు. రౌడీలను తీసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు.

"ఇప్పుడు చెప్పండి సుభద్రగారూ! నే చేసింది తప్పా? మీ తమ్ముడి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అతన్ని కొట్టి పంపించేనండీ! అదే నా తప్పయితే నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను!" సుభద్ర ఎంతో కుతూహలంగా అడిగింది.

"మరీ నీ పెళ్ళి జగన్నాధంతో జరగలేదా?"

"లేదు ! అది కూడా తమాషాగా తప్పిపోయింది!" దృశ్యం నడుస్తోంది....

పంకజం ఇల్లు చేరేసరికి మీసాల పోలీసాఫీసరు మందీమార్బలంతో వచ్చి పందిట్లో చిందులు తొక్కుతున్నాడు. మాట మాటకీ తుపాకీ ఎత్తి గురుచూస్తున్నాడు.

"ఏడీ? ఆ జగ్గూ ఉరఫ్ జగన్నాధంగా డెక్కడ? పిలవండి వాడ్ని! కాల్చి పారేస్తాను. మా అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలనుకుంటున్నాడా? ఆయ్ విల్ షూట్ హిమ్" అంటూ అరుస్తున్నాడు.

అతని పక్కన వాళ్ళమ్మాయి కన్నీళ్ళతో నిలబడి ఉంది. పోలీసాఫీసరు అప్పుడే అక్కడికి వచ్చిన పంకజాన్ని చూశాడు "నువ్వేనా పెళ్ళికూతిరివి?" పంకజం తలూపింది "బాబూ! మా అమ్మాయి ఉత్త అమాయకురాలు! దాన్నేమీ అనకండి. దానికేమీ తెలీదు" అంటోంది పంకజం తల్లి విధవరాలు.

"నేను మీ అమ్మాయిని ఏమీ చేయను. నాకు నా కూతురెలాంటిదో, మీకు మీ అమ్మాయి అలాంటిదే! కూతుళ్ళెప్పుడూ అమాయకులే. కొడుకులే దుర్మార్గులు. నాక్కావల్సింది ఆ బాస్టర్డ్ ! జగ్గూ బాస్టర్డ్ ! వాడ్ని షూట్ చేసి, వెళ్ళిపోతాను అదే నా డ్యూటీ !" అన్నాడు పోలీసాఫీసరు.

"నాన్నా! ఆవేశపడకు!" అంటోంది అతని కూతురు.

"ఆలస్యమై పోయింది విమలా! బాగా ఆలస్యమై పోయింది. ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే అన్యాయం జరిగిపోతుంది. పిలవండి వాడ్ని ఎక్కడున్నాడో వెతకండి" అంటున్నాడు.

అప్పుడే జగ్గు రౌడీలతో అక్కడికి వచ్చాడు. పోలీసుల్ని చూసి రౌడీలు పారిపోయారు. జగ్గూకూడా అదేపని చేయబోతుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.

పోలీసాఫీసరు పెద్ద పెద్ద అంగలతో జగ్గూని చేరుకుని, గురి చూసి జగ్గూ కడుపులో ఒకే ఒక గుద్దు గుద్దేడు. "అమ్మా" అంటూ బాధతో మెలికలు తిరిగిపోతూ కడుపు పట్టుకున్నాడు జగ్గు! "కొట్టొద్దు నాన్నా! చచ్చిపోతాడు" అంటూ అడ్డం పడింది విమల.

విమలను తోసేసి జగ్గూతో అంటున్నాడు పోలీసాఫీసరు.

"మా విమలకి లవ్ లెటర్లు రాసినందుకు కడుపులో గుద్దాను. దాన్ని షికార్లకు తిప్పినందుకు ఇదిగో ఈ చెంపదెబ్బ ! (ఛెళ్ళుమంది) పెళ్ళి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్ లు చేసినందుకు వీపు విమానం మోత మోగాలి. ఒంగో ! (పిడుగుద్దులు) దాన్ని మోసం చేసి ఇంకో అమ్మాయి మెళ్ళో తాళి కట్టే ప్రయత్నం చేసినందుకు నిన్ను షూట్ చేయాలి. స్టడీగా నిలబడు !" అంటూ తుపాకీ గురిపెట్టాడు.

విమల తన తండ్రి కాళ్ళమీద పడిపోయింది "కాల్చవద్దు నాన్నా!" అని వేడుకుంది.

జగన్నాధం సైతం భయపడిపోయాడు. చేతులు రెండూ జోడించి తనని కాల్చవద్దని ప్రాధేయపడ్డాడు. పోలీసాఫీసరు శాంతించాడు.

"ఆల్ రైట్ ! నీ తప్పేమిటో నువ్వు తెలుసుకున్నావ్! అంచేత షూట్ చేయను. ఈ పందిట్లో ఇక్కడే ఇప్పుడే మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టు! అగ్రీడ్?" జగన్నాధం పోలీసాఫీసరు కాళ్ళమీద పడిపోయాడు.

పెళ్ళి పీటలమీద జగన్నాధం, విమలా కూచున్నారు. పురోహితులూ.... మంత్రాలూ..బాజాలూ భజంత్రీలు..అట్లా ఆ దృశ్యం ముగిసిపోయింది.