Shivatandavam - Comedy Serial 39
39వ భాగం
పంకజం చెబుతున్న గతం దృశ్య రూపంలో సాగుతోంది.
వాతావరణం భీతావహంగా వుంది! ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఈదురుగాలి వీధిలో జనం తుఫాన్ వస్తుందేమోనని ఆందోళనగా వున్నారు దిగులుగా ఆకాశంవైపు చూస్తున్నారు. ఇంట్నుంచి పడవలు వెళ్ళడంగానీ, అట్నుంచి రావడంగానీ బందు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
పంకజం వాళ్ళ ఇంటిముందు పెళ్ళి పందిరితో తోరణాలతో వుంది. పెట్రోమాక్సు లైట్లు వెలుగుతున్నాయి. ఎవరో అంటున్నారు పడవలు బందైతే రావల్సిన బంధువులు సగమ్మంది రాలేదని పంకజం ఆ మాట విన్నది. అయినా శివుడొస్తాడనే ఆశ ఆమె గుండెల్లో చెరిగిపోలేదు.
పడవ లాగినా, ప్రళయమే వచ్చినా శివుడు లెక్కచెయ్యడు. తనకోసం తప్పకుండా నది ఒడ్డుకి వస్తాడు. తనని ఎవరూ చూడకుండా జాగ్రత్తపడి పంకజం ఇల్లు విడిచి వీధిలోకి వచ్చింది.
ఒక ఇంటిముందు నుంచి వెడుతుంటే ఎవరో మనుషులు ఎదురు వస్తున్నట్టు పసిగట్టింది. వాళ్ళ కంటపడకుండా దాక్కోవాలనే ఉద్దేశ్యంతో ఆమె ఆ ఇంటి అరుగుమీద నక్కి కూచుంది. ఆ మనుషులు ఏదో పదం పాడుకుంటూ వెళ్ళిపోయారు. తానుకూడా వెళ్ళిపోవాలనిలేచి నించుంది.
అంతలో.... ఆ ఇంటి గదిలోంచి ఏవో మాటలు వినిపించాయి. అవి తన గురించే.... "పంకజాన్ని నమ్మడానికి వీల్లేదు. పిట్ట ఎగిరి పోయినా ఎగిరిపోగలదు" అంటున్నాడు జగ్గు అనబడే జగన్నాధం కాబోయే వరుడు పంకజానికి మేనబావ.
"అయినా ఆడొస్తాడనే గ్యారంటీ ఏంటి?" అని అడిగేడొకడు రౌడీ లాగా వున్నాడు.
పోరంబోకు వెధవ. బాగా తాగుతున్నాడు. "వస్తాడు. తప్పకుండా వస్తాడు. పంకజం ఉత్తరం రాసింది గదా చచ్చినట్టు వస్తాడు" అన్నాడు జగన్నాధం.
"ఆడొస్తే మాత్రం గంగమ్మ తల్లి రానీయొద్దండీ? పడవలన్నీ బందే!" అన్నాడింకో రౌడీ. వాడు కూడా తాగుతున్నాడు.
"పడవల్లేకపోయినా లెక్కచెయ్యడు. ఈదుకొస్తాడు!" అన్నాడు జగన్నాధం.
"ఊరుకోండబ్బాయి గారూ ! మాంచి పోటు మీదుంది గంగమ్మ! ఎంత గజీతగాడైనా కాలెడితే బుడుంగు మంటాడేగాని ఒడ్డుచేరుకోలేడు" అన్నాడింకోడు.
"ఒరే ప్రేమ గురించి మీకేం తెలీదురా! ప్రేమ గుడ్డిది అంచేత గంగమ్మ గింగమ్మా కనిపించరు. వరదా గిరదా చూసుకోదు. గుడ్డిగా దూకేస్తారంతే! వాడి లక్కు బాగుంటే ఒడ్డుకి రావచ్చు గదా!"
"రానీండి. ఆడొస్తే గిస్తే ఆ గట్టుమీదే సఫా!"
"అక్కడే గొయ్యి తీసి పూడ్చేస్తాం!"
"సెభాష్ ఉత్సాహంమంటే అట్లా వుండాలి. ఇంద...ఈ డబ్బులుంచండి!" అంటూ ఆ రౌడీలకు వంద కాగితాలు పంచేడు జగన్నాధం. డబ్బు తీసుకుంటూ అడిగాడొకడు "అద్సరే అబ్బాయిగారూ! అమ్మాయిగారు ఆడికి ఉత్తరం రాసినట్టు తనకెట్టా తెలిసిందీ?"
"ఆ ఉత్తరాన్ని పోస్టుచేయమని వాడికిచ్చేసేను."
"అవుననుకోండి. అసలా ఉత్తరాన్ని అప్పుడే చించి పారేస్తే అది ఆడికి అందేది కాదుగదా! అప్పుడా ఈ చంపడాలూ, పాతిపెట్టడంలూ వుండేవి కాదుగదా!"
"ఏడిశావులే! అసలా మనిషి బతికి వుంటే నేను పంకజాన్ని చేసుకుని ఏం సుఖ పడతాను! వాడు రావాలి. మన చేతుల్లో చావాలి. పంకజంతో నేను నూరేళ్ళూ సుఖపడాలి. ఏమిటర్థమైందా? లేవండి...లేవండి..టైమవుతోంది!" అన్నాడు జగన్నాధం.