Shivatandavam - Comedy Serial 38
38వ భాగం
సుభద్ర జ్యోతితో వెళ్ళిపోతుండగా ఎదురింటి గేటు దగ్గర పంకజం నిలబడింది. ఆ తల్లీ కూతుళ్ళను వింతగా చూస్తుండగా సుభద్ర చూపు కూడా పంకజం మ్మీద పడింది. పంకజం పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. తానెవరో తెలీకుండా ఆమె ఎందుకట్లా నవ్విందో సుభద్రకు అర్థం కాలేదు.
పంకజం పలకరించింది "క్షమించాలి. వారు మీకేమవుతారో తెలుసుకోవచ్చా?"
సుభద్ర తాపీగా సమాధానం చెప్పింది "మా తమ్ముడు"
పంకజం గేటు విడిచి సుభద్రను చేరుకుని అడిగింది "వచ్చి వెళ్ళిపోతున్నారే?" సుభద్రకు ఏం చెప్పాలో తోచలేదు.
"మిమ్మల్ని వుండమని అడగలేదా వారు?"
"అదేం కాదు! నేనే వెళ్ళిపోతున్నాను" ఆ మాట పంకజం నమ్మినట్టు లేదు. అందుకే మాట మార్చింది.
"మీ పేరు"
"సుభద్ర!"
"మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో కాసేపు కూర్చోవచ్చు గదా!"
"మీరు...."
"మీక్కావల్సినదాన్నే ! పేరు పంకజం...రండి...ప్లీజ్" అంటూ సుభద్ర చేతిలో సూటుకేస్ తీసుకుంది.
పంకజం అభ్యర్థనని సుభద్ర కాదనలేక పోయింది. పంకజం వాళ్ళని సాదరంగా తనింట్లోకి తీసుకువెళ్ళింది. ముగ్గురూ హాల్లోకి వచ్చారు. ఆ హాలు కళకళలాడుతోంది. ఎంతో కళాత్మకంగా వుంది. ముఖ్యంగా గోడలమీద పంకజం నాట్య విన్యాసాలూ సుభద్రను బాగా ఆకర్షించాయి.
"మీరు డ్యాన్సరా!" అనడిగింది ఆత్రంగా.
అవునన్నట్టు తలూపింది పంకజం. "మా జ్యోతికి డాన్సంటే చాలా ఇష్టం !" అన్నది సుభద్ర.
పంకజం జ్యోతిని ఆప్యాయంగా దగ్గిరకు తీసుకుంది. తన పక్కనే జ్యోతిని కూచోబెట్టుకుంటూ సుభద్రను "కూచోండి" అని అన్నది. ముగ్గురూ సోఫాల్లో కూచున్నారు. క్షణం తర్వాత పంకజం మాట్లాడింది "మీకు బాగా కావలసినదాన్నంటూ మమ్మల్నిక్కడికి తీసుకోచ్చారు. ఎట్లా కావలసినదాన్నో మాకు తెలుసుకోవాలని వుంది అవునా?"
"అవును!"
"నా పేరు పంకజమన్నాను. ఈ పేరు మీరింతకు మునుపు ఎప్పుడూ వినలేదా?" సుభద్ర ఏదో ఆలోచిస్తోంది.
పంకజమే మళ్ళా మాట్లాడింది. "మీ తమ్ముడుగారు నా గురించి కొంతో గొప్పో చెప్పి వుండాలి!" సుభద్ర లేదన్నట్టు తలూపింది. అప్పుడు పంకజం బుక్స్ షెల్ఫ్ లో వున్న ఆల్బమ్ తీసింది. దాన్ని సుభద్ర కిచ్చింది. సుభద్ర ఆల్బమ్ తిరగేస్తుండగా పంకజం చెబుతోంది.
"మీ తమ్ముడుగారు చెప్పకపోతే నేను చెబుతాను వినండి. మీ తమ్ముడూ, నేను క్లాస్ మేట్స్ మి. ఆయన నన్ను ప్రేమించారు. నేను కూడా ఆయన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటే ఆయన్నే పెళ్ళాడాలని నిర్ణయం కూడా చేసుకున్నాను.
కానీ, విధి వెక్కిరించింది" సుభద్ర అప్పటికే వరూధినీ ప్రవరాఖ్యుల ఫోటో చూడనే చూసింది.
ఆమెకేదో ముఖ్యమైన పాయింటు అప్పుడే గుర్తుకొచ్చినట్టు వెంటనే అనేసింది. "ఇంక చెప్పక్కర్లేదు. ఈ ఫోటో చూడటంతోనే అర్థమైపోయింది. జ్యోతీ లే పోదాం!" అంటూ ఆల్బమ్ అక్కడ పారేసి జ్యోతిని చేత్తో లేవదీసింది. పంకజం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గొంతు పూడుకుపోగా "సుభద్ర గారూ!" అన్నది.
"చాలు చాల్లే! నీ నాటకాలింక కట్టిపెట్టు. నువ్వెవరో ఏమిటో తెలుసుకోకుండా రావడం నాదే తప్పు. ఎవర్తో తమ్ముడ్ని ప్రేమలో దించి, మోసం చేసి వాడి బ్రతుకు పాడుచేసిందని ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ పుణ్యాత్ముర్మాలివి నువ్వేనని ఇప్పుడర్థమైంది". "ఆవేశపడకండి సుభద్రగారూ నే చెప్పేది పూర్తిగా వినండి"
"ఇంకేం వినాలి? వాడిని ప్రేమించినట్టు నటించి, నది దాటించి కొట్టి అవమానించి పంపింది నువ్వు కాదూ?"
"అవున్నేనే! ఆ పాపిష్టిదాన్ని నేనే!"
"బంగారంలాంటి తమ్ముడు పిచ్చివెధవైపోయి దేశాలు పట్టుకు తిరుగుతుంటే - ఆ దిగులుతోనే అమ్మానాన్నా పోయారు. ఆ పాపానికి మూలకారణం ఎవరు? నువ్వు గాదూ?"
"నేనేనండీ! నేనే! కానీ నా చేతుల్లో ఏమీ లేకుండా అన్ని పాపాలు నా చేతుల కంటుకున్నాయి అదీ చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. ఆనాడు మీ తమ్ముడు నది దాటి నా కోసం వచ్చేముందు మీ తమ్ముడి ప్రాణాలు తీసేందుకు ఒక భయంకరమైన కుట్ర సాగుతున్నట్టు తెలుసుకున్నాను. సుళ్ళు తిరిగే నదిలో ఈది నా కోసం రావడం అతనికి సాహసమే కావచ్చు. నన్ను తీసుకెళ్ళే ప్రయత్నం చేసి వుంటే ఖచ్చితంగా అతని ప్రాణాలు పోయేవి. అదృష్టవశాత్తు ఆ కుట్ర నాకు తెలిసింది గనక మీ తమ్ముడింకా బతికి వున్నాడు. ఆ రోజు మసక చీకటి పడుతుండగా నేను నది ఒడ్డుకి బయలుదేరాను".