Shivatandavam - Comedy Serial 37
37వ భాగం
శివుడు విషయాన్ని వివరిస్తున్నాడు.
"అక్కా, నీ గుణం నాకు బాగా తెలుసు. భర్త సన్యాసం స్వీకరించినందున నువ్వు బాధపడవు, నటిస్తావంతే! నీ కన్ను కిష్టుడిమీద పడింది. వాడ్ని లాక్కుపోయి నీ పిల్లకిచ్చి పెళ్ళి చేసి ఈతి బాధల్లో ముంచేస్తావ్. బావగారిలాగా వాడ్ని కూడా నీ పిల్లచేతిలో బొమ్మచేస్తావ్! అంతే గదా"
"నువ్వు ఏమైనా అనుకో! నా తమ్ముడి బాగోగులు నావి కావా?"
"ఆల్ రైట్ ఆల్ రైట్ కాసేపట్లో వాడే వస్తాడు. అడిగేదేదో వాడ్నే అడుగు. నీతో వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. తీసుకెళ్ళు. కైలాసం"
"సార్!"
"వీళ్ళకి ఔట్ హౌస్ కి దారి చూపించు!"
అంత మర్యాదకి సుభద్రమ్మ షాకు తినేసింది.
"ఏమిట్రా? ఔట్ హౌసా? తోబుట్టువునిరా! పనిమనిషిలా చూస్తే పాపం తగులుతుంది!"
"అసలిక్కడ ఆడవాళ్ళుండటమే మహా పాపం! ఎంతైనా అక్కవు గదా కిష్టుడిమీద పందెం కాస్తివి గదా వాడొచ్చెంత వరకూ మీరుండాలి గదా అందుకు ఔట్ హౌసొక్కటే"
మాట మధ్యలో సుభద్ర అరిచేసింది "ఒరే నీ దిక్కుమాలిన ఔట్ హౌస్లో పడిగాపులు కాయవలసిన ఖర్మ నాకేం లేదురా! డబ్బు పారేసి ఖరీదైన హోటల్లోనే ఉంటాం. అవసరమైతే హోటల్నే కొంటాం. అక్కడికే తమ్ముడ్ని రప్పించుకుంటాం. రామ్మా జ్యోతీ, జరిగిన అవమానం చాలుగానీ పోదాం పద!" జ్యోతి లేచింది. సుభద్ర సూటుకేసుతో కదిలింది. అమ్మని అనుసరిస్తోంది జ్యోతి.
"కైలాసం" గంభీరంగా పిలిచాడు శివుడు.
"సార్!"
"అక్కయ్య ఎక్కడ దిగుతోందో మన కార్లో దింపు!" అన్నాడు.
అంతవరకూ ఒక్క మాట కూడా మాట్లాడని జ్యోతి అప్పుడు మాట్లాడింది. పుత్తడి బొమ్మమాట ఎంత కమనీయంగా ఉంటుందో కదాని ఎదురు చూస్తే కైలాసం షాకయ్యేలా మాట్లాడింది. నత్తితో "పె - దమావయ్యా! మీ... కారొద్దు..దాంట్లో బ్ర...హ్మ...చ్చారులే...ఎ...క్కండి" అమ్మో దేవుడింత కసాయివాడా అనిపించింది కైలాసానికి! అపరంజి బొమ్మని అతి శ్రద్ధగా తయారుచేసి మాటలో బ్రేకులు పెట్టిన బ్రహ్మ నిజంగా కసాయివాడేనని కూడా కైలాసం అనుకున్నాడు.
సుభద్ర జ్యోతి చేతికి పట్టుకుని ఆ ఇల్లు దాటుతుంటే శివుడు నిట్టూర్చాడు. కైలాసానికి తొలిసారిగా గురువుగారి మీద వళ్ళు మండిపోయింది. కారణాలు రెండు. ఇంటికొచ్చిన ఆత్మీయుల్ని అవమానించి పంపడం. రెండు వారి ఉపన్యాసాలూ, వ్యాసాల ద్వారా సొంత అక్కయ్య సంసారానికే ద్రోహం చేయడం. కానీ తన కోపాన్ని దిగమింగుకోవాలే గాని చిందులు తొక్కే అధికారం తనకి లేదు కదా!