Shivatandavam - Comedy Serial 36
36వ భాగం
శివుడు విసుగ్గా అడిగాడు "ఇంతకీ ఆయనేం చేశాడో చెప్పనేలేదు నువ్వు!"
ఏడుపు దిగమింగుకుని చెప్పింది సుభద్ర "ఇంకా ఏం చెప్పమంటావురా తమ్ముడూ? నన్నూ, నా పిల్లనీ వదిలేసి సన్యాసంలో చేరిపోతానంటూ ఇల్లు విడిచి పారిపోయారు"
ఆ మాట వినగానే కైలాసం గుండెల్లో బాకు దిగినట్టయింది. పాపవైపు ఎంతో జాలిగానూ, సానుభూతితోనూ చూశాడు.
"మంచి పని చేశాడు" అన్నాడు శివుడు.
ఆ మాటకి తోక తొక్కిన పాములా లేచి నిలబడింది సుభద్ర.
"ఏమిట్రా? మంచిపని చేశాడా? అవున్లే నువ్వు ఆ మాటనక యింకేమంటావూ? నీ కెట్లాగూ పెళ్ళీ పెటాకుల్లేవు. ఇంకోడు సంసారం చేసుకుంటూ సుఖంగా బతికితే కళ్ళల్లో నిప్పులు పోసుకునే మనిషివి ఆ మాటనక యింకేమంటావ్ ? ఒరే నీ దిగుల్తోనే అమ్మ నాన్న పోయార్రా! కనీసం వాళ్ళున్నా నా మంచీ చెడ్డా చూసేవారు.
ఇంటికి మగబిడ్డవై వుండి, వాళ్ళని పొట్టన పెట్టుకున్నది చాలక, నాకు అపకారం జరిగితే మంచే జరిగిందని చెబుతవా? అని తమ్ముడు అనవలసిన మాటేనా ఇది? బావగారు సన్నాసుల్లో కలవడం మంచిదా?"
"కనీసం ఇప్పటికైనా ఆయన ఒక తెలివైన పని చేశాడు. అందుకు సంతోషించాలి. ఆడదాని చేతిలో కీలుబొమ్మైన ఏ మగవాడూ ఎప్పుడూ ఎక్కడా బాగుపడలేదు"
"ఒరే ఒరే నేను నీ అక్కనిరా? నీ తోడబుట్టినదాన్ని. అంతంత మాటలనడానికి సిగ్గు లేదూ ?"
"నా అక్కవైనా నువ్వూ ఆడదానివే! బావగారిని బొమ్మను చేసి ఆడించిన ఆడదానివి. వాళ్ళ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేశావు. బావగార్ని అమాయకుడ్ని చేసి వేరే కాపురం పెట్టలేక ఆస్తికోసం అన్నదమ్ముల మధ్య పోట్లాటలు పెట్టావు. కోర్టు కెక్కించావు. ఎట్లాంటి కుటుంబం వాళ్ళది?
బెజవాడలో పానుగంటి వారి వైభవమే వైభవం! అలాంటిది ఆ కుటుంబంలో అడుగుపెట్టి ఆ వైభవాన్నే తుడిచి పెట్టేశావు. గవర్నర్ పేటలో ఒక మేడ నీ పేర రాయించుకుని తృప్తిపడ్డావా! ఏలూరు రోడ్డుమీద ఏడొందల గజాల స్థలాన్ని నీ స్వాధీనం చేసుకున్నావ్. బంటుమిల్లి పొలాలు సరే సరి. సగానికి సగం నీ సొంతమైపోయాయి అక్కా నువ్వే కాదక్కా, ఏ అక్కయినా ఇంతే! ఈ నేలమీద బతికే ప్రతి ఆడదీ అంతే! చల్లటి కుటుంబంలో అడుగుపెట్టి మంటలు సృష్టిస్తుంది. అదే ఆడదాని డ్యూటి. బావగారు బాగా లేటు చేసినా మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఆయన్ని అభినందిస్తున్నాను" అన్నాడతను.
సుభద్రమ్మ తన కోపాన్ని యింకా దాచుకోలేక పోయింది.
"అభినందిస్తావురా అభినందిస్తావు. ఆయన సన్నాసుల్లో కలిసిపోయారంటే అభినందించావూ? ఒరే అసలాయన సన్నాసుల్లో కలవడానికి నువ్వేరా కారణం? నీ పాపిష్టి మీటింగులూ, పేపర్లలో నీ ముదనష్టపు వ్యాసాలూ, వార్తలూ, హితబోధలూ ఇవన్నీ ఆయన మనసుని పాడుచేశాయిరా! నిన్ను ఆదర్శంగా పెట్టుకుని వెళ్ళిపోయారు. నా సంసారంలో నిప్పులు పోసింది నువ్వేరా నువ్వే"
"అక్కా! నువ్వంత అమాయకంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలీకుండా వుంది. బావగారు చీకట్లోంచి వెలుగులోకి వచ్చారు. భవబంధాలు తెంచుకుని లోకకళ్యాణం కొరకు వెళ్ళిపోయారు. ఆ మాట కొస్తే ఒక్క బావగారనే ముంది ఈ రాష్ట్రం నిండా, ఈ దేశం నిండా నన్ను అనుసరించే జ్ఞానులు అనేకమంది ఉన్నారు. ఈ మహా యజ్ఞంలో మేమంతా సమిధలం" అన్నాడు శివుడు గర్వంగా.
"అక్క సంసారం చెక్కముకలయిందంటే విని సంతోషించే తమ్ముడ్ని నిన్నే చూస్తున్నానురా! నిన్నే చూస్తున్నా! అయిందేదో అయిపోయింది. నువ్వు పూర్తిగా చెడిపోయావు. పసివాడు కిష్టుడు భారమేదో నేను తీసుకుంటాను వాడిని మా ఊరు పంపించు, వెళ్ళిపోతాం" ఆ మాటకి శివుడు పకపక నవ్వాడు.
అతనంతగా ఎప్పుడూ నవ్వలేదు. కొత్తగా నవ్వినా ఆ నవ్వులో అంతరార్థ మేమిటో కైలాసానికి బోధపళ్ళేదు. శివుడి వైపు వింతగా చూస్తున్నాడంతే శివుడి నవ్వుతో సుభద్రకి ఒళ్ళు మండిపోయింది!
"ఎందుకురా నవ్వుతావ్! నేనేం తప్పు మాటాడేనని? నీలాగే నేను కూడా కిష్టుడుకి తోబుట్టువునే! పైగా ఇంటికి పెద్దదాన్ని. పుట్టింటిమీద నాకు మమకారం వుండటం తప్పేం కాదు. వాణ్ణి నీ పిచ్చి పిచ్చి పాఠాల్తో పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. వాడిని నేను చదివించుకుంటాను. పెద్ద ఆఫీసర్ని చేస్తాను"
"నీ పిలనిచ్చి పెళ్ళి చేస్తావ్" శివుడు వ్యంగ్యంగా అన్నాడు.
అతనెట్లా అన్నా ఆ మాట కైలాసాన్ని బాగా వర్రీ చేసింది. అతను పాపవైపు చూశాడు. ఆ పుత్తడి బొమ్మ తలొంచుకుని వేళ్ళు లెక్కబెట్టుకుంటోందంటే.