Shivatandavam - Comedy Serial 35
35వ భాగం
హనుమాన్ భవన్ ముందు ఆటో ఆగింది. వీధి గుమ్మం దగ్గిర నించున్న కైలాసం వచ్చిందెవరో చూద్దామని దృష్టి సారించాడు. ఒకరు కాదు... ఇద్దరు ! ఇద్దారూ ఆడవాళ్లే! నడివయస్సు మహిళ, ఆమెతోపాటు ముక్కుపచ్చలారని బంగారు పాప.
మహిళ వయస్సు యించు మించు నలబై వుంటే పాపవయస్సు కేవలం పదహారే వుంటాయి. వాళ్ళిద్దరూ బహుశా తల్లీకూతుళ్ళ వుంటారని కైలాసం అనుకున్నాడు.
పెద్దావిడ సూట్ కేస్ దించుకుని ఆటోవాడికి డబ్బులిచ్చి పంపింది. ఆటో వెళ్ళిపోయింది. ఎవరు వీళ్ళు? సరిగ్గా గురువు గారింటిముందే దిగి, గురువుగారి బోర్డునీ యింటినీ యింత పరిశీలనగా చూస్తున్న వీళ్ళకి గురువుగార్తో ఏమిటి సంబంధం? ఏమి బంధుత్వం? పాపని చూస్తున్న కైలాసం కళ్ళు ఎంత తిప్పుకుందామన్నా కుదరడం లేదు.
ఆమె అందచందాలకు అతని కళ్ళు రెండూ అంకితమై పోయాయి. ఏమిటేమిటో గాని వుంది మనసు. గుండెల్లో మోహనరాగం గొంతు విప్పింది. ఎన్నడూ అనుభవానికి రాణి ఈ పరవశత్వానికి అర్థమేమిటో? సూట్ కేసు ఇంట్లోకి మోసుకొచ్చి సర్వీసు చేద్దామనుకున్నాడు కైలాసం. ఆ చర్య ఏ విపరీత పరిస్థితులకు దారీ తీస్తుందోనని భయపడి ఆ ఆలోచన తుంచేసుకున్నాడు. సూటుకేసులోనే సంసారమంతా సర్దేసిందో ఏమో ఆ పెద్దావిడ చాలా అవస్థ పడిపోతూ దాన్ని మోసుకుంటూ గుమ్మం వరకూ వచ్చింది.
కైలాసం ప్రశ్నకి పాప సమాధానం చెప్పలేదు. పెద్దావిడే కలుగచేసుకుంది.
"ఇది మా శివుడిల్లే కదా!"
"మా శివుడు కాదండీ కె. శివరామారావు!"
"అట్లాగా? వున్నాడా ఇంట్లో" అడిగిందామె చిరుకోపంతో.
ఆమె ఏకవచన ప్రయోగం కైలాసాన్ని కలత పెట్టింది. ఎందుకైనా మంచిదని మర్యాదగా అడిగాడు.
"ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు!"
"చెప్పకపోతే ఇంట్లో అడుగు పెట్టనివ్వవా?"
"అని కాదు"
"నా పేరు సుభద్ర. శివుడు నాకు స్వయంగా తమ్ముడు. ఒక తల్లీ బిడ్డలం. చాలా?" అంతవరకు గురువుగారికి ఒక అప్పగారున్నట్టు కైలాసానికి తెలీదు.
ఆమె ఎవరో గురువుగారితో ఆమె బంధుత్వమేమిటో చెప్పిం తర్వాత అక్కడో క్షణం నించోకుండా గబగబా ఇంట్లోకి పరిగెత్తాడు కైలాసం. సుభద్రతో పాటు పాప కూడా మెల్లిగా హాల్లోకి నడిచింది. సుభద్ర హాల్లో నిలబడి గోడలవైపు చూసింది. గోడల్నిండా బ్రహ్మచారుల చిత్రపటాలే? మొహం చిట్లించి సూట్ కేస్ కిందపెట్టి సోఫాలో కూచుంది. సుభద్రతో పాటు పాప కూడా కూచుంది. సుభద్ర చెంగుతో మొహం తుడుచుకుంటుంటే శివుడు అక్కడికి వచ్చాడు.
"వస్తున్నట్లుగా ఉత్తరం రాయొచ్చుగా?" అన్నాడు.
శివుడ్ని చూడగానే కంటనీరు పెట్టుకుంది సుభద్ర. చెంగుతో కళ్ళొత్తు కుంటూ సన్నగా ఏడుపు ప్రారంభించింది.
"ఇప్పుడేం జరిగిందని ఈ ఏడుపు ?" విసుగ్గా అడిగాడు.
"ఇంకేం జరగాలి ! ఆడదానికేం జరక్కూడదో అదే జరిగిపోయింది!" అన్నదమె.
"బావగారు క్షేమమేగా/" సుభద్రమ కటువుగా సమాధానం చెప్పింది
"ఆయనకే! నిక్షేపంగా వున్నారు. ఎటొచ్చీ నేనూ, నా పిల్లలే అన్యాయమైపోయాం! ఇంక నువ్వేరా మాకు దిక్కు!" శివుడి కేం అర్థం కాలేదు. అట్లాగే దూరంగా నిలబడి పాపవైపు కన్నార్పకుండా చూస్తున్న కైలాసానికి అస్సలర్థం కావడం లేదు.
"అసలేం జరిగిందో చెప్పకుండా రాద్దాంతం చేస్తావేం?" సుభద్ర తమ్ముడువైపు ఆసహనంగా చూసి అన్నది
"అవున్రా! నీకు రాద్ధాంతంగానే వుంటుంది. తోబుట్టువు ఒకర్తింకా బతికుందనే ధ్యాస ఏమైనా వుందా నీకు? దాని యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనుక్కుందామనే ఉద్దేశంగానీ, ఉబలాటం గానీ ఎప్పుడైనా చూపించావుట్రా? నీకేం పట్టినట్టు నీ బతుకు నువ్వు బతుకుతున్నావ్ గనకనే నేను మా వారి దృష్టిలో చులకనైపోయేను. దిక్కులేని దాన్నాయిపోయాను.
జెమా జేట్టీలాంటి తమ్ముళ్ళు ఇద్దర్ని పెట్టుకుని గతి లేనట్టు ఆ ఇంట్లో బతకాల్సి వచ్చింది. అయ్యో? ఎంతైనా అక్క గదా! ఒకే రక్తం పంచుకు పుట్టింది గదానే బుద్ధీ జ్ఞానం వుంచుకుని అక్కా మేమున్నాం నీకేం ఫర్లేదని ఒక మాట అని వుంటే ఆయనింత పని చేసేవారా? మీకేం పట్టనట్టు..రాకపోకలు పెట్టుపోతలు మానేస్తే, ఆడ ముండని ఒంటరి దాన్ని ఆయన నన్ను అన్యాయం చేస్తారంటే చేయరు మరీ!" అంటూ రాగం తీసింది.