Shivatandavam Comedy Serial 55
55వ భాగం
రెండో ఆట సినిమానుంచి వచ్చే రౌడీ కుర్రాళ్ళు వెనకబడ్డ వసుంధరని చూసారు. వసుంధర దారికి అడ్డుగా నిలబడ్డాడు. వసుంధర ఆగిపోయింది. అందులో ఒకడు మేకలాగా సరదాగా అడిగాడు "దారి తప్పావా పాపా! నీకు భయంలేదు. మాతో పాటు వచ్చేయ్"
"ఇక్కడే మా ఇల్లు! కులాసాగా వుండొచ్చు." అన్నాడు ఇంకోడు.
మూడోవాడు ఏకంగా వసుంధర చేతిని పుచ్చుకున్నాడు. దా...దా...దా...అంటూ గేదెలాగా అరుస్తూ తనవైపు లాక్కుంటున్నాడు. ఆ ముగ్గురూ వసుంధరని పట్టేసుకున్నారు. ఆమె నోరుమూసి ఎటో లాక్కుపోతున్నారు. వసుంధర ఒకడ్ని కొరికింది.
ఆ దెబ్బతో ఒకడు 'నీయమ్మ' అంటూ కెవ్వున అరిచి ఆమె నోటి మీదినుంచి చెయ్యి తీసేశాడు. "బుజ్జులూ" అని ఆందోళనగా అరిచింది వసుంధర. ముందు పరుగెత్తుతున్న కిష్టుడు ఆకేక విని అకస్మాత్తుగా ఆగిపోయాడు.
ఆ పిలుపు వచ్చిన దిక్కుకి వెనక్కి వేగంగా పరుగెత్తాడు. ముగ్గురు రౌడీ కుర్రాళ్ల మధ్య గింజుకుంటున్న వసుంధరని చూడగానే బుజ్జులు తనని తాను సంభాళించుకోలేక పోయాడు. అతను ప్రళయకాలరుద్రుడల్లే ఎగిరి ఆ ముగ్గురిమీద పడ్డాడు.
అందిన వాడ్ని అందినట్టు కొడుతున్నాడు. వాళ్ళు ముగ్గురు, తాను ఒక్కడు. వాళ్ళు కూడా తిరగబడ్డారు. కిష్టుడు బెల్టు ఊడదీశాడు. ఆ ముగ్గురికీ తానుగా ముఫ్ఫైమందిలా కనిపిస్తూ చెరిగి పారేస్తున్నాడు. అన్నయ్య దగ్గిర కసరత్తులో గట్రాల్లో శిక్షణ పొందివుంటడం వల్ల కిష్టుడు చాకులాగా, గొప్ప విరోచితంగా పోరాడగలుగుతున్నాడు.
ఒకడి కడుపులో, ఇంకొకడి మూతిమీద, మరొకడి డొక్కలో కాళ్ళూ చేతులు ఉపయోగించి ఒక్కేసారి ఎడాపెడ కొట్టేస్తున్నాడు. తనకున్న రెండు కాళ్ళూ, రెండు చేతులూ ఆ ముగ్గురికీ ఒకేసారి సమాధానం చెబుతున్నాయి. పిడుగులా మీదపడుతున్నాడు.
పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఒక్కో దెబ్బా మణుగు బరువుతో తగుల్తోంది. ఉడుం పట్టుతో మనుషుల్ని విసిరేస్తున్నాడు. అసలే తాగివున్నారు వాళ్ళు, అంచేత తమమీద పడుతున్నది ఒక్కడో ఇరవైమందో తెలీకుండా ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇన్నిదెబ్బలు తినలేదు.
ఇంతగా వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మలేదు. అంచేత కిష్టుడికి సమాధానం చెప్పే స్తోమత లేక ఆ ముగ్గురూ కాళ్ళకి బుద్ధిచెప్పి పారిపోయారు. కిష్టుడు బాగా అలిసిపోయాడు. ఆ స్థితిలోనే అతడు వసుంధర చేతిని పట్టుకుని మరో వీధిలోకి పరుగెత్తాడు. వసుంధర కాళ్ళు తేలిపోతున్నాయి. ఆమె ఒకచోట కుప్పలా కూలిపోయింది పరుగెత్తే ఓపికలేక.