Shivatandavam Comedy Serial 54
54వ భాగం
ఆ రాత్రి
జగన్నాధం ఇంట్లో భోజనాలయ్యాయి. అందరికీ హాల్లోనే పక్కలు వేయబడ్డాయి. రెండు పెద్ద మంచాలు. ఒక మంచమ్మీద విమలా, వసుంధర ! ఇంకో మంచమ్మీద జగన్నాధం, కిష్టుడూ.
రాత్రి ఒంటిగంట దాటింది.
కిష్టుడికి నిద్ర పట్టడం లేదు. తెల్లవారితే పంకజంగారు దిగిపోతారు. వసుంధరని తీసుకుపోతారు. ఆ తర్వాత కష్టాలూ, కన్నీళ్ళు.ఈగండం గడిచేదేట్లా ?
కిష్టుడు తప్ప మిగతా ముగ్గురూ గాఢనిద్రలో వున్నారు. అలిసి పోయిందేమో వసుంధర ఆదమరిచి నిద్రపోతోంది. కిష్టుడి మెదడ్లో ఒక ఆలోచన మెదిలింది.
అతను కాగితాన్ని వుండగా చుట్టి వసుంధర మీదకి గురిచూసి ప్రయోగించాడు.
గురి తప్పింది.
ఆ ఉండ సాక్షాత్తు విమలకు తగిలింది. ఏమి రభస జరుగుతుందో నన్న ఆందోళనతో కిష్టుడు తనకేమీ తెలీనట్టు అటు తిరిగి పడుకున్నాడు. గురి తప్పినందుకు ఎంతో వర్రీ అవుతూ గాఢనిద్ర నటిస్తున్నాడు.
ఉండ తనమీద పడగానే విమల కళ్ళు విప్పేసింది. ఎంతైన పోలీసు బిడ్డ. చిన్న అలికిడికి కళ్ళు విప్పడం లక్షణం.
విమల కళ్ళు విప్పగానే
నిద్రలో కదిలిన జగన్నాధం ఆమె కంటబడ్డాడు. కాగితపు వుండని కదిలి పడుకున్న జగన్నాధాన్నీ మార్చిమార్చి చూసింది.
"ఉండ విసిరింది చాలక ఇంకా బెట్టు పోతున్నారు బెట్టు. రెండు రోజులు ఆలస్యమైతే చాలు అన్నీ కోతి వేషాలే!"
తన తలలో పూలచెండు తీసి జగన్నాధమ్మీదికి ప్రేమగా విసిరింది. పోలీసు బిడ్డ కనుక గురి తప్పలేదు.
తన మీద పడ్డ పూలచెండుకి ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు జగన్నాధం. విమల వైపు చూశాడు. ఆమె మేలుకుని ఇంటి కప్పు వైపు తదేకంగా చూస్తోంది.
"ఎక్కడలిగిన ఫర్లేదు. మగాడన్నావాడు ఈ ఘట్టంలో అలక్కూడదు."
జగన్నాధం మంచం దిగగానే విమల కూడా మంచం దిగింది.
ఆ ఇద్దరూ చప్పుడూ చేయకుండా తూర్పు వైపు గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నారు.
అదే అదునుగా భావించాడు కిష్టుడు. గబగబా వసుంధర దగ్గరకు వెళ్లాడు. ఆమెను తట్టి నిద్రలేపాడు. కళ్ళు విప్పి "ఏమిటీ" అని అడుగబోయింది వసుంధర. గబుక్కున ఆమె నోరు మూసి అసలు సంగతి చెప్పాడు కిష్టుడు రహస్యంగా ..."మనం ఇక్కడ్నించి వెంటనే పారిపోవాలి! మీ అంకుల్ పంకజం గారికి ఫోన్ చేసాడు. తెల్లవారితే ఆవిడ వస్తారు మనల్ని పట్టుకుంటారు."
"అమ్మో! ఇప్పుడెలా ?"
"ఇంకా ఎట్లాగని కూచుంటే ఎట్లా? ఇక్కడ్నించి పారిపోదాం. లే త్వరగా!" అని ఆమెను లేవదీశాడు. వీధి తలుపు వరకు పిల్లుల్లా వెళ్ళి, ఆ తలుపులు మెల్లిగా తీసి అక్కడ్నించి వీధిలోకి వచ్చి లేడి పిల్లల్లాగా ఒకటే పరుగు.
ఆ ఇద్దరికీ విశాఖపట్టణం వీధులుగానీ, ఆ ఎత్తు పల్లాలుగానీ బొత్తిగా తెలీవు. అయినా ఆ చీకట్లో ఎటు పరుగెత్తుతుందీ తెలీకుండానే పరుగెత్తుతున్నారు. వసుంధర పడుతూ లేస్తూ పరుగెత్తడం వల్ల కిష్టుడు తన వేగాన్ని చంపుకోవలసి వస్తోంది.
పడిన ప్రతిసారీ బుజ్జులు అని వసుంధర అరవడం, బుజ్జులు కాళ్ళకి బ్రేకులు పడటం అతనొచ్చి ఆమెను లేపడం, మళ్ళా పరుగు ప్రారంభించడం ఇట్లా వాళ్ళు ఎన్నెన్నో వీధులు తిరిగారు.