Shivatandavam Comedy Serial 53

 

53వ భాగం

కైలాసం ఈవినింగు ఎడిషన్ పేపరు తీసుకొచ్చాడు. దాన్ని చూస్తూ అన్నాడు "మీరు చెప్పినట్టు బుజ్జులు ఫోటోతో సహా పేపర్లో ప్రకటన ఇచ్చాను చూడండి!" శివుడు పేపరు తీసుకున్నాడు.

అందులో ఒకచోట కిష్టుడి వేశారు. దానికింద నాలుగు మాటలు రాశారు. మాటలు మామూలే. ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని అతను రాకపోతే అతన్ని అప్పగించిన వారికి బహుమతి కింద శివుడు చిరునామా - ఫోన్ నెంబరు వగైరా.

"మనం ప్రకటించిన బహుమతి చాలా మందిని ఆకర్షించింది సార్" అన్నాడు కైలాసం.

"అయితే వెంటనే బుజ్జులు దొరుకుతాడు"

"ఇంత పెద్ద మొత్తం బహుమతిగా ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదని పేపరు వాళ్లే చెప్పారు. ఈ విధంగా పెద్ద బహుమతి ప్రకటించి 'కనుబడుట లేదు' అనే శీర్షికతో మనం పెద్ద చరిత్ర సృష్టించినట్టు చెప్పాలి. ఒకటా రెండా బుజ్జుల్ని అప్పగించిన వాళ్ళకి ఐదు వేలు బహుమతి!"

"ఆఫ్టరాల్ అయిదు వేలు. వాడు దొరికితే నాకదే పదివేలు."

"మీకు చెప్పకూడదు సార్"

"ఫర్లేదు చెప్పు"

"అయిదు వేలు బహుమానమని చదవగానే పత్రికల్లో పనిచేసే ప్రూఫ్ రీడర్లంతా రైల్లెక్కేసారండి."

"అదేమిటోయ?"

"చాలా పెద్ద బహుమతి గదండీ! లక్కు బాగుంటే బుజ్జులు వాళ్లకే దొరకవచ్చు గదండీ! దొరికితే అయిదువేలు గదండీ?"

"అయిదువేలూ పంకజమే పుచ్చుకుంటుంది!" అన్నది సుభద్ర అక్కడికి వస్తూ ఆమె చేతిలో కూడా పేపరుంది.

"అంటే?" ఆందోళనగా అడిగాడు శివుడు.

"విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చింది. జగన్నాధమింట్లో పిల్లాపిల్లాడూ క్షేమంగా ఉన్నారుట. వచ్చి తీసుకెళ్ళమని జగన్నాధం పంకజానికి ఫోన్ చేశాడు. పంకజం అప్పుడే కార్లో వెళ్లను కూడా వెళ్ళిపోయింది. ఆ మాటకి శివుడు కోపం తెచ్చుకున్నాడు. "ఒక్కర్తీ అంత దూరం కార్లో వెళ్ళిందా?"

"నీకు చెబితే నువ్వు తోడు వెళ్ళేవాడివా?" వ్యంగ్యంగా అన్నది సుభద్ర.

"తప్పేముంది? మనిషికి మనిషి తోడు. ఆవిడిగారికి వసుంధర ఎంత ముఖ్యమో నాకు కిష్టుడూ అంతే! పిల్లలు క్షేమంగా వున్నారని ఒక్కమాట....ఒక్కమాట నాతో చెబితే ఆవిడ సొమ్మేం పోదుగా!....కైలాసం"

"సార్" "కారు సిద్ధం చెయ్యమని చెప్పు!"

"ఇప్పుడు కారెందుకు?" అడిగింది సుభద్ర.

"విశాఖపట్నం వెళ్లాలి!" అన్నాడు శివుడు.