Shivatandavam Comedy Serial 52

 

52వ భాగం

విమల ఫోటు నుంచి కదిలివస్తూ "అలగండలగండి. ఇట్లా ఎన్నిసార్లు అలిగి వెళ్ళిపోలేదూ...? ఎన్నిసార్లు తిరిగి రాలేదు. అసలీ కోపం అంతా మా నాన్న మీదేగా. మనం పిలవంగానే రమ్మని నెలకిరవై చొప్పున ఉత్తరాలు రాస్తున్నాను. వచ్చేరా! ఆయనొచ్చేసినట్టు పెద్ద హంగామా చేసి వెళ్ళిపోయారు గదూ! వెళ్ళండివెళ్ళండి. ఎన్నాళ్ళు తిరుగుతారో తిరగండి." అంటూ ఆమె ఉయ్యాల బల్లమీద కూర్చుంది.

"ఇదే మా ఇల్లు" జగన్నాధం గొంతు వినిపించింది.

మళ్ళా ఫోటో మాట్లాడుతున్నదేమోనని విమల ముందర ఫోటో వైపు చూసింది. ఆ లక్షణాలేమీ కనిపించక పోవడంతో వీధి గుమ్మం వైపు చూసింది. వసుంధర కిష్టుడితో జగన్నాధం ఇంట్లో వెలిశాడు. మొగుడొచ్చినందుకు కాదుగానీ వసుంధరనీ మరో కుర్రాడ్నీ తెచ్చినందుకు ఆశ్చర్యపోతూ ఉయ్యాలబల్ల దిగింది విమల జగన్నాధం ఒక గోడకి చెబుతున్నట్టు చెప్పాడు.

"ఎక్స్ కర్షనట. క్లాసు పిల్లల్తో ఈ ఊరొచ్చింది బేబీ. ఆఫీసుకి ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను." విమల వసుంధరని దగ్గిరకి తీసుకుంటూ అడిగింది.

"ఏమ్మా పంకజమ్మత్తయ్యా వాళ్ళు కులాసాగా ఉన్నారా?" వసుంధర తలూపింది.

"ఎప్పుడొచ్చారో ఏమిటో...ముందు స్నానం పూర్తి చెయ్యమ్మా! ఈలోగా వంట చేసేస్తాను" అంటూ వసుంధరని తీసుకు వెళుతుంది.

"మనం మాత్రం ఈ ఇంట్లో భోంచేయం. మగాళ్ళ హోటల్లో మీల్సు బ్రహ్మాండంగా వుంటాయి. అక్కడికి పోదాం అట్లా కూర్చో ఇప్పుడే వస్తాను" అంటూ కిష్టుడ్ని కూచోబెట్టి జగన్నాధం తన గదిలోకి వెళ్ళి మూసుకున్నాడు.

జగన్నాధం వరస కిష్టుడికి మొదట్నుంచీ అనుమానంగానే వుంది. ఎందుకైనా మంచిదని అతడు కూడా లేచి, కిటికీలోంచి జగన్నాధం గదిలోకి తోంగి చూసాడు. జగన్నాధం ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. కిష్టుడి గుండెల్లో రాయి పడింది. తను శబ్దం చేయకుండా కిటికీ పక్కనే నిలబడి వినే ప్రయత్నంలో వున్నాడు. జగన్నాధం యస్టీడీ చేశాడు. అవతల్నుంచి గొంతు వినిపించగానే జగన్నాథం తన గొంతు తగ్గించి ఇటూ చూస్తూ గబగబా మాట్లాడేస్తున్నాడు.

"నేనే పంకజం" జగన్నాధాన్ని. విశాఖపట్నం నుంచి బేబీ ఎవడో కుర్రాడ్ని వెంటబెట్టుకుని ఈ ఊరొచ్చింది. ఆ....ఆ...అవునతనే! ఇద్దరూ ఇప్పుడు మా ఇంట్లోనే వున్నారు. అట్లాగే నువ్వొచ్చే వరకూ వాళ్ళని వెయ్యి కళ్ళతో చూస్తాను. నువ్వు వెంటనే బయలుదేరు. అట్లాగే! అంత మాత్రానికే థ్యాంక్సెందుగ్గానీ, నువ్వు వెంటనే బయలుదేరు, వుంటా" అంటూ అతను ఫోన్ పెట్టేశాడు.

తాను అనుమానించినంతా జరిగినందుకు కిష్టుడు బాగా వర్రీ అయిపోయాడు. తెల్లవారితే పంకజమొచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత అల్లరీ.....భీభత్సం! ఎట్లా ఈ గండం గడిచేది. జగన్నాధం చొక్కా మార్చుకుని, గుండీలు పెట్టుకుంటూ గది నుంచి బయటపడ్డాడు.

ఏమీ ఎరగనట్టు బుద్ధావతారంలాగా కూర్చున్న కిష్టుడితో "ఏం లేదోయ్ ! షర్టు మార్చుకొచ్చేనంతే ! ఊ....పద పద. హోటల్ కి పోదాం. బేబీ. మేము హోటల్లో భోంచేసి వస్తాం" అంటూ కిష్టుడ్ని వెంట బెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు జగన్నాధం.

వాళ్ళు వెళ్ళిపోయిం తర్వాత వసుంధర విమలను అమాయకంగా ప్రశ్నించింది.

"అంకుల్ హోటల్లో భోంచేయడ మేమిటీ?"

"నా మీద కోపమొస్తే ఆయన హోటల్లోనే భోంచేస్తారు?"

"మీ మీద అంకుల్ కి కోపమోచ్చిందా?"

"అందుకే హోటలంటున్నారు. వెళ్ళనివ్వు. ఎంతైనా ఇంటి తిండి ఇంటి తిండే. హోటల్లో ఆరుచి ఎందుకుంటుంది? ఈయన గారి మూలాన పాపం ఆబ్బాయి హోటల్లో తిన్లేక ఇబ్బంది పడవలసి వచ్చింది. అవునూ, ఇంతకీ ఎవరా అబ్బాయి.

" మా ఎదురింటి అబ్బాయి.

"మీ క్లాసబ్బాయి కాదా?"

"కాదు!"

"ఆంటీ. నేను ఆ అబ్బాయి ప్రేమించుకున్నాం" అంటూ తమ కథ చెబుతోంది వసుంధర.....