Shivatandavam Comedy Serial 51
51వ భాగం
అది జగన్నాధం ఇల్లు! హాల్లో గోడకి ఆ జగన్నాధం ఫోటో తగిలించబడి వుంది. విమల అప్పుడే భోజనం ముగించింది కాబోలు, తాంబూలం సేవిస్తూ జగన్నాధం ఫోటో వైపు కోపం చూసి గొణుక్కుంటుంది.
"హు....అలిగి ఎన్నాళ్ళు ఇంటికి రాకుండా వుంటారు? రెండు రోజులు....మహా అయితే మూడో రోజు. అంతే. దాంతో హోటలు వాడు పెట్టె గడ్డి తినలేక తోక ముడుచుకుని ఇంటికి తిరిగొస్తారు. మీ సంగతి నాకు తెలీదూ? ఇవ్వాళ. మీ కిష్టమైన గుత్తి వంకాయకూర చేసుకున్నాను"
"విమలా!" అరిచి ఏడు ఫోటోలో వున్న జగన్నాధం.
"ఎందుకరుస్తారు?"
"నిన్ను దేవుడు కూడా క్షమించడు విమలా! దేవుడు కూడా క్షమించడు."
"అంత తప్పు నేనేం చేసాను?"
"గుత్తివంకాయ కూరనీ నాకూ అవినాభావ సంబంధముంది. ఆ కూరంటే నాకెంత ఇష్టమో నీకు బాగా తెలుసు. నేను అలిగినప్పుడు నాకిష్టమైన కూరలు వండొద్దని ఎనిసార్లు చెప్పాను?"
"వండితే ఏమవుతుందిట."
"నా పవరుపోతుంది. జిహ్యాచాపల్యం పెరిగిపోతుంది. వ్రతభంగంమవుతుంది. అలగడం మానేసి ఇంట్లో కంచంముందు కూచుంటాను. నీక్కావలసింది కూడా అదేగా. నన్ను దెబ్బ తీయాలనే గదా ఇవాళ గుత్తివంకాయ కూర చేసావు?"
"నా ఇష్టం. నా ఇష్టమైన కూర నా ఇష్టమొచ్చినప్పుడు వండుతాను. కాదని చెప్పడానికి మీరెవరు?"
"నిన్ను కట్టుకున్నవాడ్ని. నీ భర్తని!"
"భర్తన్న తరువాత ఎట్లా ఉండాలి? పరమ శత్రువుకి మల్లె నెలకి ఇరవై రోజులు అలగడం భర్త లక్షణమా?"
"మగాడెందుకు అలుగుతాడు? తనకు ఇష్టంలేని పనులు ఆడది చేస్తుంటే అలక్కుండా చూస్తూ ఊరుకుంటాడా?"
"మీ కిష్టంలేని పని నేనేం చేసాను?"
"మీ నాన్నకి మీసాల పోలీసాఫీసరు మావకి ఉత్తరం రాశావా లేదా?"
"రాశాను?"
"ఏమని రాశావు?"
"రిటైరై ఆ లంకంత ఇంట్లో ఒక్కరే వుండి ఇబ్బంది పడుతున్నారు కనుక మన దగ్గిరకి వచ్చి మనతో పాటే మనింట్లో వుండమని రాశాను."
"ఆయనొచ్చి ఈ ఇంట్లోవుంటే నేనేమై పోతానో తెలుసా?" "తెలీదు" "పిచ్చి కుక్కనై పోతాను."
"అదేం పాపం?"
"పాపం కాదు విమలా! అది నా పాలిట శాపం. ఆ మనిషిని చూస్తే అలా మొరగాలనిపిస్తుంది. మొరిగి కరవాలనిపిస్తుంది. అల్లాంటి మనిషికా మనతోపాటు మనింట్లో వుండమని ఆహ్వానం పంపుతావ్! అయినా ఆయనకేం తక్కువ? బోలెడు పెన్షనొస్తుంది. బ్యాంకులో బొలెడుంది."
"ఏముండి ఏం లాభం? వండి వార్చే దిక్కులేదు."
"వంటలక్కని పెట్టుకోమను."
"కన్నబిడ్డని నేనంటూ లేకపోతే ఆ పనే చేసేవారు."
"కన్నబిడ్డ జీవితాంతం కన్నబిడ్డగానే మిగిలిపోదు విమలా! ఎవడో ఒకడికి కట్టుకున్న భార్య అవుతుంది. వాడి అడుగుజాడల్లో నడిచే ఆదర్శ మహిళ అవుతుంది.ఇరవై తొమ్మిది గంటలు గడుస్తున్నా?"
"గడువా? అదెందుకు?"
"ఈ ఇంట్లో నేనో మీ నాన్నో ఇద్దర్లో ఒకరే ఉండేందుకు ఇద్దరం వుండి పులీ మేకల్లాగా బతకలేం. నేను కావాలో మీ నాన్న కావాలో ఇరవై నాలుగంటల్లో." "ఇందాక ఇరవైతొమ్మిది గంటలన్నారు."
"ఆల్ రైట్ అట్లాగే అన్ని గంటల్లోగా నిర్ణయమేమిటో బాగా ఆలోచించుకుని చెప్పు వస్తా." అంటూ జగన్నాధం నోరు మూసుకుని ఫోటోలో బొమ్మాయి పోయాడు.