Shivatandavam Comedy Serial 50
50వ భాగం
విశాఖపట్నం బీచ్ లో.... వసుంధరా కిష్టుడూ కాళ్ళు నొప్పులు పుట్టేలా తిరిగారు. వసుంధర ఇంక నడవలేక కూచుండిపోయింది. కిష్టుడు కూడా ఆమె పక్కన కూచుంటూ అన్నాడు....
"ఇన్నాళ్ళూ పంజరంలో పక్షుల్లాగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చూడు స్వేచ్ఛా జీవితం. మనిష్టారాజ్యం. ఆంక్షల్లేవు. ఆర్డర్లు లేవు."
"ఇట్లా ఎంతకాలం తిరుగుతాం?"
"మనదగ్గిర డబ్బున్నంతకాలం !"
"ఆ తర్వాత "
"ఉద్యోగం చేస్తాం. సంపాయించుకుంటాం."
"అంతవరకూ పెద్దాళ్లురుకోవద్దు?"
"మన మెక్కడున్నామో వాళ్లకెట్లా తెలుస్తుంది?"
"ఎట్లాగో అట్లా తెలిసిందనుకో."
"తెలిస్తే ఏం చేస్తారేం. ప్రాణాలు తీస్తారా? తీస్తే తేసేయమను. నేలమీద చచ్చిపోయినా, పైలోకంలో సుఖంగా బతకొచ్చు"
"కిష్టుడూ" అంటూ అతన్ని వసుంధర గట్టిగా కావలించుకుంది.
క్షణం సేపు ఆమెను గుండెలకు హత్తుకున్నాడు కిష్టుడు. ఆ తర్వాత అనునయంగా అడిగేడతను "చావుమాట వినగానే భయపడ్డావా?"
"లేదు బుజ్జులూ ! వెంటనే చచ్చిపోయి పైలోకంలో సుఖపడదామని వుంది."
"వసూ"
"బుజ్జులూ" వాళ్లిద్దరూ అట్లా ఎంతసేపు అతుక్కుపోయి వుండేవారో గాని వసుంధర ఒక వ్యక్తిని చూసి ఖంగారుగా కౌగలి నుంచి భయటపడింది.
"అంకుల్" అన్నది అకస్మాత్తుగా.....
కిష్టుడు కూడా అంకులనబడే ఆ కొత్త వ్యక్తిని అప్పుడే చూసాడు. ఆ వ్యక్తి వాళ్లవైపే రావడంతో వసుంధర లేచి నిలబడింది. వసుంధరతో పాటు కిష్టుడు కూడా నించున్నాడు. వచ్చిన వ్యక్తి జగన్నాధం ఉరఫ్ జగ్గు. అతనే వసుంధరని పలుకరించాడు.
"ఏం బేబీ? ఈ ఊరెప్పుడు వచ్చావ్?" వసుంధర బెదురుతూ సమాధానం చెప్పింది.
"ఇవాళే....ఇవాళే వచ్చాం అంకుల్"
"పంకజం కూడా వచ్చిందా?" వసుంధర భయం భయంగా చెప్పింది.
"ఊహు....నేనొక్క....దాన్నే వచ్చాను. ఇతను ఇతనూ....మా ఎదురింటబ్బాయి....పేరు క్రిష్ణ" కిష్టుడు జగన్నాధానికి నమస్కారం చేసాడు జగన్నాధం క్షణం ఆలోచించి వసుంధరను అడిగాడు.
"మీరు ఈ ఊరు వచ్చినట్టు పంకజానికి తెలుసా?"
"ఏమ్మా? మాట్లాడవే? అసలింట్లో చెప్పే వచ్చారా?"
"ఊ....లేదు చెప్పలేదంకుల్ చెబితే రానివ్వరని చెప్పలేదు." జగన్నాధం తన ధోరణంలో క్షణం మార్చేసుకున్నాడు.
కిష్టుడి భుజం అభినందన సూచకంగా తట్టి అన్నాడు.
"వాట్ మేన్? లవ్ కేసా?" కిష్టుడు నీళ్ళు నముల్తూ అన్నాడు.
"అవునండి!" జగన్నాధం ముసిముసిగా నవ్వుతూ అన్నాడు.
"కీపిటప్. ఊ....ఇప్పుడు మీ ప్రోగ్రామేమిటి?"
"ఇంకా నిర్ణయించుకోలేదండి!" అన్నాడు కిష్టుడు.
"ఎక్కడ దిగారు."
"ఎక్కడా దిగలేదంకుల్! రైలు దిగి తిన్నగా ఇక్కడ కొచ్చేసాం. అంతే. జగన్నాధం భుజాలు ఎగురవేస్తూ అన్నాడు.
"బేడ్ వెరీబేడ్...ఈ ఊళ్లో నేనొకణ్ణి వున్నానని తెలుసు గదా. తిన్నగా మా ఇంటి కొచ్చేయొచ్చుగా." వసుంధర బెదిరిపోతూ జగన్నాధం
వైపు చూసింది.
"నేను మీ పంకజం లాంటి వాడ్ని కాదు బేబీ! అయ్ నో వాటీజ్ లవ్. లవర్సుని ఎట్లా చూసుకోవాలో నాకు బాగా తెలుసు రండి, ఇంటికి పోదాం" అన్నాడు జగన్నాధం.
కిష్టుడు సంశయిస్తున్నాడు. జగన్నాధం చాలా చొరవగా అనేసాడు.
"నీ ఫెయర్స్ ! నేనుండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మా ఇల్లు కంచుకోట. ఎన్నాళ్ళయినా ఉండవచ్చు. మీరిక్కడున్నది దేవుడిక్కూడా తెలీదు. బిలీవ్ మీ." అతని హామీలకు వసుంధర సంతోషించింది. కిష్టుడితో అన్నది.
"పద కిష్టుడూ మా అంకుల్ దేవుడితో సమానం. మనకే ఇబ్బందీ వుండదు. పద!" కిష్టుడు తప్పని సరై ఆమె మాటకి అంగీకరించాడు. ముగ్గురూ బీచ్ దాటుతున్నారు.