శివతాండవం - కామెడీ సీరియల్ 49

 

49వ భాగం

అప్పల్సామైతే వెళ్ళిపోయాడు గానీ అతను తెచ్చిన పుస్తకాలు అక్కడే వదిలేశాడు. ఆ పుస్తకాల మీద శివుడి చూపు పడింది. మొత్తం మూడు పుస్తకాలు వాటిని తీసుకుని చూసాడు శివుడు.

ఆడదాన్ని ఎట్లా లొంగదీసుకోవాలి అరవై చిట్కాలు? మహిళ మనసు గెలిచేదెట్లా ముప్పయి మార్గాలు ! అతివ అనుగ్రహానికి అతిదగ్గర దారులు అరవై ఒకటి! ఆ పుస్తకాల టైటిళ్ళు చదవడం పూర్తిచేసిన తర్వాత అక్కడికి అప్పల్సామి మళ్ళీ వచ్చాడు తన పుస్తకాలు శివుడు చేతిలో ఉండటం చూసి నీళ్ళు నముల్తూ అన్నాడు అప్పల్సామి.

"క్షమించాలి డబ్బుల్తో పన్జరగడం లేదని అట్నుంచి నరుక్కొచ్చి ఈ పుస్తకాలు కొన్నానండి. వాటిల్లో చెప్పిన చిట్కాలు వాడితే ఎంతలావు ఆడదైనా అయిసై పోద్దని సెవన్నాట్ నైన్ గాడు చెప్పాడు. పాతిక రూపాయలు పోసి కొన్నానండి." శివుడు తన జేబులోంచి వందకాగితం తీసి అప్పల్సామి కిస్తూ అన్నాడు.

"ఉంచుకో. ఈ పుస్తకాలు నా దగ్గిరే ఉంచు."

"సార్"

"ఇల్లాంటి పుస్తకాలు ఇంకా ఏదైనా దొరికితే పట్టుకురా."

"చిత్తం" అన్నాడు అప్పల్సామి.

అప్పటికే అతనికి పూర్తిగా మతిపోవడం వల్ల అక్కడో క్షణం కూడా నిలబడలేక పారి పోయాడు వంద నోటుతో.... రైల్వే స్టేషన్. కిష్టుడూ, వసుంధరా ఫస్టుక్లాస్ కంపార్టుమెంటులో కూచున్నారు. కైలాసం ఫ్లాట్ ఫాం మ్మీద నిలబడ్డాడు. రైలుకి సిగ్నల్ ఇచ్చారు. గార్డు విజిల్ వూదాడు. పచ్చదీపం చూపెట్టాడు.

రైలు కదిలింది. కైలాసం తృప్తిగా గాలి పీల్చుకున్నాడు. చేతులూపుతూ ఫ్లాట్ ఫాం మ్మీద నిలబడిపోయాడు. రైలు ఫ్లాట్ ఫాం దాటగానే కిష్టుడికి హుషారెక్కువైంది. మెల్లిగా కూనిరాగం ప్రారంభించాడు. అది పాటగా ఎదిగింది. వసుంధర కూడా గొంతు కలిపింది. కనుక యుగళ గీతమైంది. ఆ కంపార్టుమెంటులో ఆ ఇద్దరే వున్నారు గనక సరిపోయింది. రాత్రి పదిగంటలు దాటినా తమ్ముడు ఇంటికి రాకపోవడంతో శివుడికి పిచ్చెక్కినట్టయింది.

ఎదురింటి వైపు చూసాడు. ఆ ఇంట్లోకూడా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి తమ్ముడి గురించి ఆ ఇంట్లో అడిగితే తెలుస్తుందనే ఉద్దేశంతో శివుడు అక్కడికి బయలుదేరాడు. సరిగ్గా రోడ్డుమీదే పంకజం ఎదురుపడింది.

"మీ బేబీ ఇంట్లో వుందా?" అడిగాడు శివుడు.

"మీ తమ్ముడు కూడా లేడా?" అడిగిందామె.

"అంటే? మీ బేబీ మీ ఇంట్లోలేదా?"

"అనేగా అర్థం! హు....పిల్లనిచేసి ఎక్కడెక్కడ తిప్పుతున్నాడో ఏమో" శివుడికి పెసరంత కోపం వచ్చింది.

"మా వాడ్ని అమాయకుడ్ని చేసి ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో!" అన్నాడు.

"అంటే తప్పంతా మా బేబీదా?"

"లేకపోతే మా తమ్ముడిదా?"

"మగవాడు ఎంతకైనా తగును!"

"ఆడది కూడా అంతే!"

"మాటకి మాట చెప్పడమే గాని పిల్లల్ని వెతికే బాధ్యత తెలీదా?"

"ఆ బాధ్యత నీకు మాత్రం లేదా?"

"ఉన్నది కనుకనే పోలీస్టేషన్ కి బయలుదేరాను."

"అయితే వుండు. కారు తెస్తాను. నీకు తోడుగా వస్తాను."

"థాంక్స్ . నాకెవరితోడూ అఖర్లేదు. నే ఒక్కదాన్నే వెళ్ళగలను. నాకూ వుంది కారు డ్రైవర్, కారు తీసుకురా!" అన్నదామె.

పంకజానికి కారు తెచ్చాడు వాళ్ల డ్రైవరు. ఆమె కారులో కూర్చుంది. ఆ కారు కదిలింది. శివుడు కూడా తన కారు దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసాడు. ఆమె వెళ్లిన వైపే తానుకూడా వెళ్లాడు. ఈ తతంగం యావత్తూ చూస్తూనించున్న కైలాసం గట్టిగా నిట్టూర్చాడు.