Shivatandavam - Comedy Serial 48
48వ భాగం
శివుడు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు దివాళా తీసిన అవతారంతో. హల్లో పుస్తకం చదువుకుంటోంది పంకజం. శివుడు పంకజాన్ని చూసాడు. పంకజం అంటూ రివ్వున వెళ్ళి ఆమెను తన బాహువుల్లో బంధించాలనుకున్నాడు. సభ్యత కాదని ఆగిపోయాడు. తాను వచ్చినట్టు గొంతు సవరించుకున్నాడు శివుడు. పంకజం పుస్తకంలోంచి తల తిప్పలేదు.
"ఎవరు కావాలి?" అని అడిగింది.
నువ్వే అందామనుకున్నాడు. ఫోన్ లోస అవ్యంగా సమాధానం రాలేదు గనక ఆ మాటని వాయిదావేసి "మా అక్కయ్య" అన్నాడు.
"మీ అక్కయ్య మీ ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఎందుకుంటుంది?" పుస్తకంలోంచి చూపు మార్చకుండానే అన్నది పంకజం.
"మీ అక్కయ్య కోసమే వస్తే వెళ్ళిపోవచ్చు" పుస్తకంలోనే వుంచింది చూపు.
"నేను...నీకోసం...వచ్చాను!" నీళ్ళు నములుతూ అన్నాడు శివుడు.
"నాకోసమా...ఎందుకు?"
"అదే ...జరిగిందంతా..." పంకజం చాలా సీరియస్ గా సమాధానం చెప్పేసింది.
"చూడు మిస్టర్ చెప్పవలసింది ఏదో ఫోన్ లోనే చెప్పాను. ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. మర్యాదస్తులకు ఒకమాట చాలు. మీరు వెళ్ళవచ్చు." ఆమె అంత కటువుగా మాట్లాడినందుకు శివుడు బాగా దెబ్బ తినేసాడు. తలవంచుకున్నాడు.
మెల్లిగా వెనక్కు తిరిగాడు. బరువుగా అడుగు వేయబోయాడు.
"శివుడూ!" అని పిలిచింది పంకజం. కోటి వీణలు ఒకేసారి మీటినట్టు, సుస్వాగతం పలికినట్టు శివుడికి కనిపించింది. ఎంతో ఉత్సాహంతో వెనుదిరిగి ఆనందంగా అన్నాడు శివుడు.
"పిలిచావా పంకజం?" ఇప్పుడు పంకజం సంకట పరిస్థితిలో పడిపోయింది. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కటువుగా అన్నది.... "అవును" వాళ్ళెప్పుడు గేటుమూసి గొళ్ళెం పెట్టి వెళ్ళవలసి ఉంటుంది. ఇక ముందు అడక్కుండ లోపలికి రావద్దు వెళ్ళొచ్చు." ఆవమాన భారంతో తల తిరిగి పోతుండగా శివుడు తడబడే అడుగుల్తో అక్కడ్నుంచి కదిలాడు.
మరుక్షణం తన కళ్ళని చేతుల్తో కప్పుకుని వలవలా ఏడుస్తోంది. సుభద్ర ఆమెను అభినందిస్తూ అన్నది.
"విజయం నీదవుతున్నప్పుడు సంతోషించాలిగానీ, కన్నీరు పెట్టుకోవచ్చా? తప్పు....ఊ....నా మాట విను." శివుడు దిగాలుగా కూచున్నాడు. అతని సోఫా దగ్గిర సీజరు కూడా తోక ముడుచుకుని పడుకుని ఉంది.
పంకజానికి పెళ్ళి కాలేదు. తన కోసమే ఆమె ఇన్నేళ్ళూ పెళ్ళాడకుండా అవివాహితగానే ఉండిపోయింది. మరి అలాంటప్పుడు ఆర్. పంకజం కె. పంకజం ఎట్లా మారింది? వెంటనే సమాధానం కూడా దొరికింది. శివుడింటి పేరు కె! కావాలని తన ఇంటిపేరు పెట్టుకుంది పంకజం. అంటే? పంకజం సాక్షాత్తు తన సొత్తే! ఇన్నాళ్ళూ ఇంటి పేరు మార్పిడి గురించి వర్రీ అయ్యేడేగాని, పంకజం మనసేమిటో గ్రహించ లేక పోయినందుకు గొప్ప బాధపడిపోయాడు శివుడు.
అప్పుడొచ్చాడు అప్పల్సామి. ఇప్పుడతను మఫ్టీలో ఉన్నాడు. అతని చేతిలో కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. "నమస్కారం సార్!" అన్నాడు అప్పల్సామి. శివుడు అనాసక్తిగా తలెత్తిచూసాడు. బదులు పలక లేదు. సివిల్ డ్రస్ లో తనని శివుడు గుర్తించి ఉండడనే పాయింటికి విలువయిచ్చి అప్పల్సామి చెప్పుకు పోతున్నాడు.
"నేనండీ బాబూ! నిప్పల్సామిని! యూనిఫారంలో వస్తే గుర్తట్టేవారు, సివిల్ డ్రస్ గదా గొడవై పోయింది. అంతెందుకండి.నేను సివిల్ డ్రస్సులో వుండి మా ఇంటికెళితే మా ఆవిడ కూడా గొప్ప కన్ ఫ్యూజై పోద్దండి. వారు లేరు, మళ్ళారండని తలుపెనక చేరి సమాధానం చెప్పుద్దండి. యూనిఫారంకీ, సివిల్ డ్రస్ కీ అంత గొప్ప డిఫరెన్సుందండి."
"కూచో!"
"చిత్తం అసలీ సివిల్ డ్రస్సెందుకేసుకొచ్చానో తేసుసండీ? యూనిఫారంలో చీటికి మాటికి తమర్ని దర్శనం చేసుకుంటావుంటే? తమరేదో కేసులో ఇరుక్కున్నారమోనని ఇరుగూ పొరుగోళ్ళకి డవుట్లొస్తున్నాయండి. అందుకే పోలీసోడితో సావాసం చెయ్యొద్దన్నారు. వదిలేయండి. యూనిఫారంలో వచ్చి అనవసరంగా మీ శిలమ్మీద దెబ్బ తీయడమెందుకని ఇదిగో ఇట్లా వచ్చాను. బాబూ అర్జంటుగా నాలుగు లేహ్యం డబ్బాలిప్పించండి?" శివుడు సీరియస్ గానే అన్నాడు.
"లేవు వున్నా, ఇకముందు ఎవ్వరికీ ఇవ్వను." ఆశ్చర్యపోతూ అన్నాడు అప్పల్సామి.
"అదేంటండీ! డబ్బాల్లేకపోతే ఆడోళ్లతో గోలైపోద్ది గండీ."
"అప్పల్సామీ"
"ఆయ"
"ఆడదంటే ఎవరనుకున్నావ్?" "దెయ్యమండి"
"కాదు నాయనా! దేవత" అప్పల్సామి ఉలిక్కిపడ్డాడు.
ఆ మాట ఎవరైనా అన్నారేమోనని అటూఇటూ చూసాడు. శివుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు.
"దేవతని, దేవతగా గుర్తించలేని మగాడే దెయ్యం. పెనుభూత పరమరాక్షసుడు. అర్థమైందా?" శివుడు ధోరణికి అప్పల్సామి భయపడ్డాడు. లేచి నుంచిని అన్నాడు.
"చిత్తం అర్థమైందండి. మళ్ళా ఇంకోసారొచ్చి దర్శనం చేసుకుంటానండి. సెలవిప్పించండి" అంటూ అప్పల్సామి అక్కడ్నుంచి పరుగెత్తి నంత పనిచేసాడు.