శివతాండవం - కామెడీ సీరియల్ 47

 

47వ భాగం  

శివుడు చాలా నీరసంగా వున్నాడు సోఫాలోకి వాలిపోయి శూన్యంలోకి ఆలోచిస్తున్నాడు. అతనికేదో ఆలోచన వచ్చింది. మెల్లిగా ఫోన్ దగ్గిరికి వెళ్ళాడు. డయల్ చేసాడు. పంకజమింట్లో ఫోన్ మోగింది. పంకజం ఫోన్ తీయబోయింది. సుభద్ర హెచ్చరించింది.

"శివుడే అయి వుంటాడు. వాడు హల్లోనగానే నువ్వు హా ప్రాణేశ్వరా అన్నావో వాడికీ జన్మకి బుద్ధిరాదు. బెట్టు చెయ్యి. కటువుగా మాట్లాడు, తెలిసిందా?" పంకజం తల ఊపింది.

రిసీవరు తీసుకుంది. అవతల నుంచి శివుడు మాట్లాడుతున్నాడు.

"హల్లో ! నేను శివుడ్ని మాట్లాడుతున్నాను. హల్లో" పంకజం కళ్ళు ఆనందంతో మెరిసాయి. ఆమె పరవశిస్తోంది. కళ్ళు అర మోడ్పులైయ్యాయి. సంతోషం వెల్లువై ఆమెను ముంచెత్తుతోంది. సుభద్ర హెచ్చరికను లక్ష్య పెట్టకుండా క్షణంలోనో, అరక్షణంలోనో ప్రాణేశ్వరా అనేది కూడాను.

ఆ ప్రమాదం గమనించి సుభద్ర ఆమె చేతిలోంచి రిసీవరు లాక్కుని హుక్కు మీద పెట్టేసింది.

"వదినా!" అన్నది పంకజం బాధగా.

"ఏవమ్మా! బాధగా వుందా? నే చెప్పిందేమిటి? నువ్వు చేస్తున్నదేమిటి?"

"అతని గొంతు విని నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను వదినా!"

"అంతేనమ్మా! అంతే! మన ఆడజాతికి అఘోరించిన బలహీనత అదే! కట్టుకున్న పెళ్ళాన్ని గొడ్డును బాదినట్టు బాది 'కాఫీ ఇవ్వు సుందరీ' అని మొగుడు రాగాలు తీస్తే 'క్షణంలో కలుపు కొస్తాను ప్రియా' అంటూ వంటగదిలోకి పరుగులు తీస్తాం!" అన్నది సుభద్ర నిష్టూరంగా. మళ్ళీ ఫోన్ మోగింది.

"అదిగో...మళ్ళీ వాడే! నువ్వు ఫోన్ చేసినప్పుడు వాడెంత మొరటుగా ప్రవర్తించాడో జ్ఞాపకం చేసుకో! దెబ్బకు దెబ్బ తీయ్!" అని పంకజాన్ని ప్రోత్సహించింది సుభద్ర.

పంకజం రిసీవర్ ఎత్తింది. అవతల నుంచి శివుడు గొంతు. "పంకజమేనా?"

"అ...వును!"

"నేను పంకజం... శివుడ్ని! మా అక్కయ్య నాకంతా చెప్పింది పంకజం. తప్పంతా నాదే! క్షమించు!....మాట్లాడు పంకజం.... మాట్లాడు. ప్రేమించానని ఒక్కమాట చాలు....హల్లో"

"నీతో మాట్లాడవలసిన అవసరం నాకేమీ లేదు, రాదు. ఇక ముందెప్పుడూ ఫోన్ చెయ్యొద్దు!" అని పెట్టేసింది పంకజం.

"ఫర్లేదు. జారిపోతావనుకున్నాను. కొంచెం జాగ్రత్తపడ్డావు. అయినా ఈ డోసు సరిపోదు. కొంచెం పెంచాలి!"

"నా వల్ల కాదు వదినా!" అంటూ ఆమె సోఫాలో కూలిపోయింది.

"అంటే ఏమిటి? రేపే దండలు మార్చేసుకుని దంపతులై పోతారా?" వ్యంగంగా అడిగింది సుభద్ర.

"వదినా!"

"ఏమో... నీ వరస చూస్తుంటే నాకదే అనిపిస్తోంది.!" పంకజం ఆర్ధంగా అన్నది.

"అతనంత ప్రాధేయపడుతూ మాట్లాడుతుంటే నేనెట్లా కటువుగా ప్రవర్తించను? తప్పంతా నాదే క్షమించు పంకజమంటూ ప్రాధేయ పడుతున్నాడొదినా! ఆ ఒక్కమాట కోసమే నేను ఇన్నేళ్లూ రాయిలా బతికాను. ఆ ఒక్కమాట కోసమే ఇన్నేళ్ళు ఎదురు చూశాను."

"నువ్వు ఊ కొట్టాలేగాని అల్లాంటి తియ్యటి మాటలు సవాలక్ష అంటాడు. ప్రాధేయపడటమే కాదు నీ పాదాలు కూడా పట్టుకుంటాడు. మగజాతి వదినా! అది ఆ జాతి ప్రత్యేకత!" అన్నది సుభద్ర. అంతలో.... గేటు దగ్గిర కుక్క మొరిగింది. సుభద్ర తొంగిచూసింది. గేటు బయట సీజరు, సీజర్తోపాటు శివుడూ నిలబడి వున్నాడు. గేటులోపల సోఫియా వుంది. ఆ ఇద్దర్నీ చూసి సోఫియా మొరుగుతోంది. సుభద్ర పంకజాన్ని హెచ్చరిస్తూ అన్నది. "అదిగో నీ ప్రాణనాధుడు.

క్షమాభిక్షకోసం గేటు దగ్గిర తచ్చాడుతున్నాడు.

" పంకజం వెళ్ళబోయింది. "వెళ్ళకు గేటు తీసుకుని వాడే వస్తాడు. నువ్వీగదిలోనే వుండు. మొహమ్మీద కొట్టినట్లు మాట్లాడు. నే చెప్పిందంతా గుర్తించుకో! చెప్పినట్లు చెయ్యకపోయావో మీ పెళ్ళికి నేను రాను. అదిగో వచ్చేస్తున్నాడు" అంటూ సుభద్ర పక్కగదిలోకి వెళ్ళిపోయింది.