Read more!

వెంటాడే మిత్రుడు

 

వెంటాడే మిత్రుడు

సుఖ,దుఃఖాలతో సంబంధం లేకుండా అనుక్షణం నీవెంట ఉండేవాడే..నీకు నిజమైన మిత్రుడు. వెలుతురులో(సుఖాలలో) ఉన్నప్పుడు అందరూ నీడలా నీవెంటే ఉంటారు. చీకటిలో(కష్టాలలో) ఉన్నప్పుడు నీ నీడకూడా నీకు తోడుగా ఉండదు. కానీ, అనుక్షణం నీ వెంటే ఉంటూ, నిన్ను సుఖాల కలల నుంచి, కష్టాల అలల నుంచి బయటకు లాగే నిజమైన నిస్వార్ధ మిత్రుడు ఈ స్వార్ధప్రపంచంలో ‘మృత్యువు’ ఒక్కడే. అందుకే అంటారు ‘ప్రాణికి భగవంతుడు ఇచ్చిన మహత్తరమైన వరం మరణం ఒక్కటే’ అని. మృత్యువు వల నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇందుకు తార్కాణంగా ఒక కథ చెప్తాను.

ఈ కథకు ఏ విధమైన పురాణాధారం లేదు. ఇది కేవలం కల్పితం.

ఒకసారి శ్రీ మహావిష్ణువుకు దేవకార్య విషయమై పరమశివునితో పని ఉండి గరుత్మంతునిమీద కైలాసం వచ్చాడు. గరుత్మంతుని కైలాస ముఖద్వారం దగ్గరే ఉండమని చెప్పి, శ్రీమహావిష్ణువు ఒక్కడూ శివసాన్నిధ్యానికి వెళ్ళాడు. కైలాస ముఖద్వారం దగ్గర గరుత్మంతుడు ఒక్కడూ ఉన్నాడు. ఇంతలో ఒక బంగారు పిచ్చుక ఎగురుతూవచ్చి గరుత్మంతుని సమీపంలో వాలింది. అక్కడ తమ జాతికి రాజైన గరుత్మంతుని చూసి, నమస్కరించి, కైలాస పర్వతసానువుల మీద ఉన్న గడ్డిలోని పురుగులను తింటూ, ఉల్లాసంగా ఎగురుతూ ఆనందిస్తోంది. అది చూసి గరుత్మంతుడు చాలా ఆనందించాడు. ఇంతలో పరమశివునితో పని ఉండి యమధర్మరాజు కూడా కైలాసం వచ్చి, గరుత్మంతుని కుశల ప్రశ్నలు వేసి, కైలాస ముఖద్వారం దాటి లోపలకు వెడుతూ, అక్కడ ఆనందంగా ఎగురుతున్న ఆ బంగారుపిచ్చుక వంక ఆశ్చర్యంగా చూసి, లోపలకు వెళ్ళాడు. యమధర్మరాజు, తన జాతి పక్షి అయిన ఆ బంగారుపిచ్చుక వంక ఎందుకు అలా చూసాడో ఎంత ఆలోచించినా గరుత్మంతునకు అర్థం కాలేదు. అతనికి అర్థం అయినది ఒక్కటే.  

తన పాలనలో ఉన్న ఆ బంగారుపిచ్చుక మీద యమధర్మరాజు దృష్టి పడింది. అంటే..దానికి ఆయువు మూడినట్టే. నా ప్రజలను కాపాడ వలపిన బాధ్యత  పక్షీంద్రునిగా నాకు ఉంది. కనుక ఆ బంగారుపిచ్చుకను కాపాడాలి అని సంకల్పించి, ఆ పిచ్చుకను దగ్గరకు పిలిచి, ‘కుమారా.. ఇక్కడ ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం, నిన్ను సురక్షితమైన ప్రదేశానికి చేర్చుతాను., నా వీపున అధిరోహించు’ అని చెప్పాడు. ఆ బంగారుపిచ్చుక గరుత్మంతుని వీపును ఎక్కి కూర్చుంది. వెంటనే గరుత్మంతుడు మహావేగంగా ఎగురుతూ, కైలాసగిరికి కొన్ని వేల యోజనాల దూరంలోనున్న ఒక దట్టమైన అడవిలోని ఓ పర్వత పగులులోని జాగాలో ఆ బంగారుపిచ్చుకను ఉంచి ‘ఇదే నీకు సురక్షితమైన ప్రదేశం, ఈ అరణ్యంలో హాయిగా జీవించు’ అని చెప్పి తిరిగి అదే వేగంగా కైలాస పర్వతం చేరుకున్నాడు.

కొంతసేపటికి యమధర్మరాజు తిరిగి వచ్చి అక్కడ ఉండే బంగారుపిచ్చుక కోసం అటు ఇటు చూసాడు. అది గమనిస్తున్న గరుత్మంతుడు తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, పైకి అమాయకత్వం నటిస్తూ, ‘యమధర్మరాజా..ఎవరి కోసం వెతుకుతున్నారు’ అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు ‘ఇక్కడ ఒక బంగారుపిచ్చుక ఉండాలి..ఎక్కడకు వెళ్ళిందా అని వెతుకుతున్నాను’ అని బదులు ఇచ్చాడు. అది విని గరుత్మంతుడు మరింత అమాయకత్వం నటిస్తూ ‘ఈ సృష్టిలో ఎన్నో గొప్ప గొప్ప ప్రాణులు ఉండగా, అల్పప్రాణి అయిన ఆ బంగారుపిచ్చుక గురించి ఎందుకింత ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తున్నారు యమధర్మరాజా’ అని అడిగాడు. ‘ఏమీలేదు గరుత్మంతా..ఈ కైలాసగిరికి కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న ఓ దట్టమైన అడవిలోని ఒక పర్వత పగులులో నివసించే ఓ పాముకు ఆ బంగారుపిచ్చుక పది క్షణాలక్రితం ఆహారం కావాలి... ఈ పది క్షణాల వ్యవధిలో ఆ బంగారుపిచ్చుక అక్కడకు చేరుకునే శక్తి, బలం దాని రెక్కలకు లేవే..అని ఆశ్చర్యపోతూ శివసన్నిధికి వెళ్లాను, తిరిగి వచ్చేటప్పటికి ఆ పిచ్చుక కనిపించకపోయేసరికి ఆశ్చర్యం వేసింది’ అని ఓ క్షణకాలం కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి చిరునవ్వుతో గరుత్మంతుని వంక చూసి ‘ఆ పాముకు ఆహారం అందింది’ అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు యమధర్మరాజు. ఆశ్చర్యపోవడం గరుత్మంతుని వంతు అయింది.

కనుక , మృత్యువు ఎప్పుడూ మనతోనే ఉంటాడు...తనతోనే తీసుకు వెడతాడు. అట్టి మిత్రుని మనమెన్నడూ మరువరాదు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం