Read more!

కుంభకోణం యాత్ర – 23

 

 

 

కుంభకోణం యాత్ర – 23

తిరు నాగేశ్వరం

 


                                                                                         

ఇప్పుడు మనం తిరు నాగేశ్వరం వెళ్తున్నాము.  అవటానికి ఇది శివాలయే అయినా, నవ  గ్రహాలలో ఒకటైన రాహువుకి కూడా ఇక్కడ ఆలయం వున్నది.  అందుకని రాహు స్ధలమంటారు.  నవగ్రహ ఆలయాలు దర్శించేటప్పుడు ఈ ఆలయానికి తీసుకొస్తూంటారుగానీ, చుట్టు పక్కలవేటి గురించీ చెప్పరు.  ఇక్కడికి 2 కి.మీ. ల దూరంలోనే ఉప్పిలియప్పన్ ఆలయం వున్నది.  దీని తర్వాత మనం వెళ్ళేది ఉపిలియప్పన్ కే.

 

 

కుంభకోణం నుంచి తూర్పుగా 8 కి.మీ. ల దూరంలో వున్నది ఈ తిరు నాగేశ్వరం.  ఇది నేను ముందు చెప్పాను కదా పంచ క్రోశ ఆలయాలు అని .. వాటిలో ఇది ఒకటి. ఇక్కడ శివుడి పేరు నాగనాధ స్వామి.  అమ్మవారు గిరిగుజాంబిక  (గిరి కుచాంబిక).  ఈవిడకి ఇరు ప్రక్కలా లక్ష్మి, సరస్వతి వుంటారు.  ఇక్కడ శివుడికి, పార్వతికి రెండు, రెండు ఆలయాలున్నాయి.  నాగనాధస్వామి, గిరికుచాంబికనే కాక అర్ధ నారీశ్వరుడు, పిరైయానివనుదలుమాయ్ అనే పేర్లతో.  రాహు ఇక్కడ శివుణ్ణి సేవించి తన శాపం పోగొట్టుకున్నాడుట.  

 

 

రాహు ఆలయం

పెద్ద ఆలయం.  రెండవ ప్రాకారంలో రాహువుకి ప్రత్యేక ఆలయం వున్నది.  ఇక్కడ విశేషం ఏమిటంటే రాహు పూర్తిగా మానవ రూపంతో కనబడతాడు.  ఇరు పక్కల ఆయన దేవేరులు నాగవల్లి, నాగకన్ని వుంటారు.

 

 

రాహుకాలంలో రాహువుకి పాలాభిషేకం విశేషం ఇక్కడ.  నల్లగా వున్న విగ్రహాలమీదనుంచి పాల ధారలు కిందకి దిగుతుంటే పాలు నీలం రంగులో కనిపిస్తాయి.  మళ్ళీ నేలమీద తెల్లగానే వుంటాయి.  ఈ దృశ్యం చూసి తీరవలసినదే. జాతకాలలో రాహు దోషం వున్నవారు ఇక్కడ అభిషేకం చేయిస్తే ఆ దోషం తొలగిపోయి సుఖంగా వుంటారని నమ్మకం. చాలామంది చేయిస్తూ వుంటారు.  రోజూ రాహుకాలం సమయం మారుతూ వుంటుంది కనుక అభిషేకం చేయించ దల్చుకున్నవాళ్ళు ఆ సమయం చూసుకుని, దానికి గంట ముందు ఆలయానికి చేరుకుని టికెట్ తీసుకోవాలి.  దీనికోసం ముందుగా బుక్ చేసుకోవటం వగైరా లేదు.ఆది శేషుడు, దక్షుడు, కారకోలుడు మొదలకు సర్ప ప్రముఖులు ఇక్కడ శివుణ్ణి సేవించారుట.  నల మహారాజు, గౌతమ మహర్షి, పరాశరుడు, భగీరధుడు కూడా ఇక్కడ స్వామిని సేవించినవారే.

 

 

రాహువు ఒక రాశినుంచి, ఇంకొక రాశికి మారినప్పు (18 నెలలకి ఒకసారి) ఇక్కడ ఆయనకి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో రాహువుని శేష వాహనం మీద ఉరేగిస్తారు. తిరుజ్ఞాన సంబంధార్, తిరునవుకరసు నాయనార్, తిరు సుందరమార్తి నాయనార్, అరుణగిరిస్వామి ఇక్కడ శివుణ్ణి స్తుతించారు.చోళరాజు కేదారాదిత్య (950 – 957 ఎ.డి.) ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు.  లోపలి మండపం ప్రసిధ్ధ శైవ భక్తుడు (పెరియ పురాణం) సీక్కిజార్ నిర్మించాడు.  17వ శతాబ్దంలో అచ్యుతప్ప నాయక రాజు మంత్రి గోవింద దీక్షితార్ బయట మండపాన్ని కట్టించాడు.రాహు కాలంలో ఇక్కడ తనని భక్తితో పూజించిన వారి కోరికలు తీరేటట్లు శివుడినుంచి వరం పొందాడట రాహువు.

 

దర్శన సమయాలు

ఉదయం 6 నుంచీ 12-45 దాకా, తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచీ 8-30 దాకా.

 

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)