శరన్నవరాత్రుల ఆరంభం.. దుర్గమ్మ నవ రూపాల ఆంతర్యం..!

 

శరన్నవరాత్రుల ఆరంభం.. దుర్గమ్మ నవ రూపాల ఆంతర్యం..!

 

ప్రతి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయి. వీటిలో రెండు గుప్త నవరాత్రులు. అంటే వీటిని బయటకు చెప్పకుండా అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా ఆరాధిస్తారు.  మరి రెండిటిలో చైత్ర నవరాత్రులు ఒకటి కాగా రెండవది శరన్నవరాత్రులు.  ఈ శరన్నవరాత్రులనే దుర్గా నవరాత్రులు, దేవి నవరాత్రులు అని అంటారు. ఆశ్వయుజ మాస పాడ్యమి నుండి మొదలయ్యే ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు భక్తులను మైమరిపిస్తారు.  అమ్మవారి రూపాలు చాలా విశిష్టమైనవి. అయితే ఇదే నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గా సప్తశతి పారాయణ చేశారంటే ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మది రూపాల గురించి ప్రస్తావించారు.  ఆ అమ్మవారి తొమ్మిది రూపాల గురించి తెలుసుకుంటే..

శైలపుత్రి..

హిమవంతుని కుమార్తె శైలపుత్రి.  హిమవంతుని తపఃఫలముగ హిమవంతుని భార్య అయిన మేనక గర్భమున జన్మించింది.  దక్ష యజ్ఞ సమయంలో యజ్ఞ జ్వాలలో తనను తాను దహించివేసుకుని మరణించిన సతీ దేవినే హిమవంతునికి కుమార్తెగా శైలపుత్రిగా జన్మించింది.

బ్రహ్మచారిణి..

బ్రహ్మ అంటే వేదము అని అర్థం.  వేదాలను ధరించినది కాబట్టి అమ్మవారి రెండవ రూపమును బ్రహ్మచారిణి అని అంటారు.

చంద్రఘంటా..

అమ్మవారి మూడవ రూపం చంద్రఘంటా.. ఆహ్లాదకారిణీదేవి చంద్రఘంటేతి  కీర్తితా అని రహస్యాగమము తెలుపుతోంది.  అంటే ఆనందం కలిగించేదే చంద్రఘంట అని అర్థం. చూసే కళ్లకు,  శరీరంలోని ఇంద్రియాలకు మాత్రమే కాకుండా శరీరంలో సర్వ ఇంద్రియాలకు కూడా ముఖ్యంగా మనస్సుకు కూడా ఆ బ్రహ్మ స్వరూపంతో పోలిన ఆనందాన్ని కలిగించేది చంద్రఘంటా అని అంటారు. ఆధ్యాత్మికతలో మనసు ఆ భగవంతుడితో అనుసంధానం కావడాన్ని బ్రహ్మానందస్వరూపం అని అంటారు. ఆ అనుభవ దశనే చంద్రఘంటా అని అనవచ్చని పురాణ పెద్దల వివరణ.

కుష్మాండ..

మనిషికి సంసారం,  వ్యామోహం, సుఖం, కోరికలు.. వీటి మీద తాపత్రయం ఎక్కువ.  వీటన్నింటిని తన గర్భ కుహురంలో అండాకారంగా ధరించినదే కుష్మాండ అని చెబుతున్నారు. త్రివిధ తాపయుక్త సంసారమును తన పొట్టలో ధరించేదే కుష్మాండ అని అర్థమట.

స్కంధమాత..

అమ్మవారి తేజస్సు,  పరాక్రమం, శక్తితో జన్మించిన సనత్కుమారుడిని స్కంధుడు అని పిలుస్తారు.  ఈయన బ్రహ్మ పుత్రుడు. సనత్కుమారుడు నారదుడికి భూమా విద్య బోధించాడని పురాణాలు చెబుతున్నాయి.  ఈ సనత్కుమారుడు ఆ అమ్మవారి తేజస్సు, పరాక్రమం, శక్తితో జన్మించాడు కాబట్టి అమ్మవారిని స్కంధమాత అంటారని చెబుతారు.

కాత్యాయని..

కాత్యాయనుడు అనే ఋుషికి కుమార్తెగా మారి,  ఆయన పెంచి పెద్ద చేశారు కనుక ఈ అమ్మవారిని కాత్యాయని అని అంటారు. కాత్యాయని శ్రావణ మాసములో ఘోర తపస్సు ఆచరించి శివుడిని మెప్పించి ఆయనకు భార్య కాగలిగింది.

కాలరాత్రి..

కాలానికి సర్వాన్ని తనలో కలుపుకోవడమే లక్షణము. అలాంటి కాలాన్ని కూడా హరించేదే అమ్మవారు. అందుకే అమ్మవారు కాళరాత్రి అని వ్యవహరించబడ్డారు.

మహాగౌరీ..

కాలికాపురాణం లో 5వ అధ్యాయం ఉంది. ఈ 5వ అధ్యాయంలో ఒక కథనం పేర్కొన్నారు. ఒకప్పుడు అమ్మవారు నల్లగా ఉండేవారట.  అప్పుడు శివుడు అమ్మవారిని చూసి కాలి(నలుపు రంగు లేదా నల్లనిది) అని పరిహసించారట. దీంతో అమ్మవారు తపస్సు చేసి స్వచ్చమైన బంగారు వన్నెతో ప్రకాశించిందట. అంతటి ప్రకాశం కలిగిన గౌర వర్ణము అంటే పసుపు వర్ణం పొందిన తర్వాత అప్పటి నుండి అమ్మవారు మహాగౌరీ అయిందట. అందుకే ఆడవారు పూజలు, పేరంటాలు, వ్రతాలు వంటి శుభకర సమయాలలో పసుపును రాసుకుంటారు.

సిద్దిదా..

సిద్ది అంటే మోక్షము. అలాంటి మోక్షాన్ని కేవలం ప్రకృతి ద్వారానే అనుగ్రహిస్తుందట అమ్మవారు. అందుకనే ఆ అమ్మవారిని సిద్దిదా అని అంటారట.

                            *రూపశ్రీ.