ఏనుగు కవాతులు.. రాజ సంప్రదాయాలు.. మిరుమిట్లు గొలిపే మైసూరు దసరా పండుగ..!

 

ఏనుగు కవాతులు.. రాజ సంప్రదాయాలు.. మిరుమిట్లు గొలిపే మైసూరు దసరా పండుగ..!


దేశం మొత్తం 10రోజుల పాటు వైభవంగా జరుపుకునే పండుగ దసరా.. స్త్రీలను పూజించమని చెప్పే దేశమైన భారతదేశంలో ఈ దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతాయి. అమ్మవారు ఒక్కొక్క రోజు ఒకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ప్రాంతాలు వేరైనా సరే.. అమ్మవారికి జరిగే వైభోగంలో మాత్రం ఏ మాత్రం లోటు ఉండదు. ప్రాంతాన్ని బట్టి అమ్మవారి సంబరాలను వివిధ రకాలుగా, వివిధ పేర్లతో పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పండుగను నాదహబ్బగా జరుపుకుంటారు. ఇది కర్మాటక రాష్ట్ర అధికారిక పండుగ కూడా. కర్ణాటకలో జరిగే  నాదహబ్బ పండుగ గురించి వర్ణింపతరం కాదు. మైసూరులో దసరా ఒక రాజరిక కార్యక్రమం. ఇది శతాబ్దాల నాటి సంప్రదాయాలు, విస్తృతమైన ఆచారాలు  అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలతో నిండి ఉంది.

దసరా పండుగ సెప్టెంబర్ 22న ప్రారంభమైంది. ఇది చాముండి కొండపైన జరిగే ఉత్సవాలతో ప్రారంభమవుతుంది. అమ్మవారని ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో ఆరాధిస్తారు.  సెప్టెంబర్ 30 వ తేదీన దుర్గాష్టమి జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 1వ తేదీన మహానవమి జరుగుతుంది. ఈ రోజు ఆయుధ పూజ, గద అశ్వాధి పూజ, హయగ్రీవ పూజ,  మహాగౌరీ పూజ జరుగుతాయి. అక్టోబర్ 1వ తేదీన బన్ని మంటపంలో సాయంత్రం 7 నుండి 10 గంటల వరకు టార్చ్ లైట్ పరేడ్ రిహార్సల్ జరుగుతంది.

చివరిరోజు..

అక్టోబర్ 2వ తేదీ చివరిరోజు.. ఈ రోజు విజయదశమి వేడుక జరుగుతుంది. విజయ దశమి రోజు సాయంత్రం కుంభలగ్న సమయంలో 750 కిలోల బంగారు చాముండేశ్వరి దేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు.

ఏనుగుల కవాతులు,  రాజ సంప్రదాయాలు..

మైసూరు దసరాలో చాలా ప్రసిద్ధమైనది జంబూ సవారీ.  శిక్షణ పొందిన 12 ఏనుగులు ఊరేగింపులో పాల్గొంటాయి. ఈ ఏనుగులు రోజూ మైసూర్ ప్యాలెస్ నుండి బన్ని మంటపం వరకు రెండు సార్లు కవాతు చేసి అందరినీ అలరిస్తాయి. మైసూరులో ఈ దసరా ఉత్సవం మైసూరు మహారాజుల వైభోగాన్ని, వారి విజయాన్ని కూడా చెప్పకనే చెబుతుందని అంటారు.  ముఖ్యంగా దసరా సమయంలో మైసూరు నగరం మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది.  మరీ ముఖ్యంగా మైసూరు ప్యాలెస్ వజ్రంతో సమానమైన వెలుగులు విరజిమ్ముతుందని అంటారు. సాధారణ రోజుల్లో మైసూరును చూడటం వేరు,  ఇలా రాష్ట్ర పండుగ వైభవంగా జరిగే వేళ మైసూరును చూడటం వేరని, ఇది చెప్పలేని అనుభూతిని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతారు.

                              *రూపశ్రీ.