నవరాత్రులలో అఖండ దీపం పెడితే ఏం జరుగుతుందో తెలుసా!

 

నవరాత్రులలో అఖండ దీపం పెడితే ఏం జరుగుతుందో తెలుసా!

 


శక్తికి,  ఆధ్యాత్మిక సాధనకు   గొప్ప పండుగ  ఏదైనా ఉందంటే అది దుర్గా నవరాత్రులు అనే చెప్పుకోవాలి. , సోమవారం, సెప్టెంబర్ 22, 2025న దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో పూజిండమే కాకుండా కొందరు ఘటస్థాపన (పూజా స్థలం)తో పాటు అఖండ జ్యోతిని వెలిగిస్తారు.  అఖండ జ్యోతి అంటే ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది.  అంటే అది తొమ్మిది రోజులు నిరంతరం మండుతుంది. ఈ అఖండ జ్యోతి ఇంటి నుండి చీకటిని తొలగించడమే కాకుండా జీవితం నుండి ప్రతికూలతను కూడా తొలగిస్తుందని చెబుతారు.

నవరాత్రులలో అఖండ జ్యోతి ఇంట్లో వెలుగుతూ ఉంటే  దుర్గాదేవి  తమ ఇంట్లో ఉన్నట్టే అనుకుంటారు.  తొమ్మిది రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగే ఇళ్లలో దుర్గాదేవి స్వయంగా నివసిస్తుందని,  కుటుంబాన్ని  రక్షిస్తుందని నమ్ముతారు. అయితే అఖండ జ్యోతి వెలిగించడానికి కొన్ని నియమాలు, పద్దతులు ఉన్నాయి. అవి పాటించగలిగితేనే అఖండ జ్యోతి వెలిగించాలి. అవేంటో తెలుసుకుంటే..

అఖండ జ్యోతిని వెలిగించే ముందు సంకల్పం చెప్పుకోవాలి.  దీపం వెలిగించడానికి ఇత్తడి లేదా మట్టి ప్రమిదను ఉపయోగించాలి.  అలాగే దీపాన్ని నేలపై పొరపాటున కూడా ఉంచి వెలిగించకూడదు. స్వచ్చమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది.  అది చేయలేకపోతే.. నువ్వులు లేదా ఆవనూనె వంటివి ఉపయోగించవచ్చు.

దీపం వెలిగించిన తర్వాత, తొమ్మిది రోజులు నిరంతరం దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఏమరపాటు పనికిరాదు. అలాగే  గాలి నుండి దీపాన్ని రక్షించుకోవడానికి  గాజు చిమ్నీతో కప్పి ఉంచవచ్చు.  నెయ్యి లేదా నూనె అయిపోతే లేదా వత్తిని సర్దుబాటు చేయాల్సి వస్తే, దీపాన్ని ఆర్పకుండా జాగ్రత్తగా చేయాలి. నెయ్యి లేదా నూనె అయిపోవడాన్ని గమనించుకుని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవాలి.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దీపం ఆరిపోతే చాలా మంది కంగారు పడతారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు.  వెంటనే ఒత్తిని  తిరిగి వెలిగించి దేవత  క్షమాపణ కోరాలి.  అమ్మవారి మీద భక్తి, విశ్వాసం చాలా ముఖ్యం. నిజమైన భక్తితో చేసే పూజను దేవత ఖచ్చితంగా అంగీకరిస్తుంది. అయితే దీపం ఆరిపోతే క్షమాపణ చెప్పుకుంటే సరిపోతుంది అనే నిర్లక్ష్యపు భావంతో ఎప్పుడూ అఖండ దీపం పెట్టకూడదు.  కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల దీపం శాంతం అయితేనే ఆ నియమం చెల్లుతుంది.

 అఖండ దీపం వెలిగించే ఇంట్లో మధ్యం, మాంసం నిషేధించాలి.  ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ స్నానం, దీపారాధన,  అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అఖండ దీపం స్వరూపంగా అమ్మవారిని భావించాలి.

                          *రూపశ్రీ.