మీ చేతిలో ధనం నిలవడం లేదా... చాణక్యుడు చెప్పిన అసలు నిజాలు ఇవీ..!
మీ చేతిలో ధనం నిలవడం లేదా... చాణక్యుడు చెప్పిన అసలు నిజాలు ఇవీ..!
చాణక్య నీతి.. భారతీయ విధానాన్ని గొప్పగా నిలిపింది. రాజనీతి కావచ్చు, జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు.. ఇట్లా చాలా అంశాలలో చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ చాలా ఆసక్తిగానూ, ఆచరణీయంగానూ ఉంటున్నాయి. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కునే ప్రతి సమస్యకు తగిన సమాధానం, పరిష్కారం ఆచార్య చాణక్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. నేటి కాలంలో చాలామంది డబ్బు దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత సంపాదించినా సరే.. చేతిలో ధనం నిలవడం లేదని వాపోతుంటారు. దీనికి కారణం ఏమిటి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు ఆచార్య చాణక్యుడు చాలా అర్థవంతంగా వివరించాడు. దీని గురించి తెలుసుకుంటే..
పరిశుభ్రత లేకపోవడం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం తమ చుట్టూ మురికిని ఉంచుకునేవారితో లేదా ఎప్పుడూ మురికి బట్టలు ధరించేవారితో సంపద ఎప్పటికీ ఉండదు. పరిశుభ్రత లేకపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది డబ్బు ప్రవాహాన్ని ఆపివేస్తుంది. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటారు. వారి జీవితంలో శ్రేయస్సు రావడం కష్టమవుతుంది.
ఎక్కువ ఆకలితో ఉండేవారు..
కొందరు ఆహారం చూస్తే చాలు.. వెంటనే దానిపై దాడి చేస్తుంటారు. ఇలాంటి వారి వద్ద లేదా ఎప్పుడూ ఆహారం కోసం ఆరాటపడేవారి వద్ద డబ్బు ఎప్పుడూ ఉండదు. తిండిపోతు స్వభావం ఉన్న వ్యక్తులు తమ ఆహారం పట్ల చాలా దురాశ కలిగి ఉంటారు. ఈ అలవాటు వారి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. అలాంటి వ్యక్తులు తరచుగా అక్కర్లేని ఖర్చులు, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.
అదిక నిద్ర కలిగినవారు..
సూర్యోదయం అయినా లేవని వారు.. సూర్యాస్తమయం సమయంలో కూడా నిద్రపోయే వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభించవు. ఆచార్య చాణక్యుడి ప్రకారం సోమరితనం, పనికి దూరంగా ఉండే వ్యక్తులు జీవితాంతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల జీవితంలో పురోగతి సాధించే అవకాశం ముగుస్తుంది. సంపద పొందే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది.
లక్ష్మీదేవికి ఇవంటే అసహ్యం..
లక్ష్మీదేవి దుమ్ము, ధూళి, మురికి వంటి ప్రాంతాలను చూసినా, సోమరితనంగా ఉండేవారిని చూసినా చాలా కోపంగా ఉంటుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మురికి, సోమరి స్వభావం కలిగిన వ్యక్తులను ఇష్టపడదు. అలాంటి వ్యక్తులు డబ్బు సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా వారి సంపద నిలవదు. క్రమంగా వారి వద్ద డబ్బు అయిపోతుంది.
*రూపశ్రీ.