మహిళల్లో పిసిఒయస్ సమస్యను తగ్గించే హెర్బల్ టీలు!

 

మహిళల్లో పిసిఒయస్ సమస్యను తగ్గించే హెర్బల్ టీలు!

భారతీయ ఆయుర్వేదం ఈనాటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల కిందట మన మహర్షులు మూలికా వైద్యాన్ని ప్రజలకు అందించారు. ఒకప్పుడు చెట్ల ఆకులు, బెరడు, పువ్వులు వంటి వాటిని నీటిలో కాచిన పానియాన్ని కషాయం అని పిలిచేవారు. ఇప్పుడైతే మారిన కాలానికి అనుగుణంగా హెర్బల్ టీ అని పిలుస్తున్నారు. పదాలు మారినా, మాటలు వేరైనా అందులో అర్థం మాత్రం మారదు. హెర్బల్ టీ అనేది మనిషిలో రోగనిరోధకశక్తిని పెంచి, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు దోహదపడుతుంది. శరీరంలో ఎన్నోరకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో హెర్బల్ టీ లు అద్భుతంగా సహాయపడతాయి. 

మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. ఇది మహిళల్లో ఇతర వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.  ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఒఎస్) ను పరిష్కరించే కొన్ని హెర్బల్ టీలు ఇక్కడున్నాయి!!

పుదీనా టీ!!

పుదీనా అందరికీ అందుబాటులో ఉండే మొక్క. అందరికీ మార్కెట్లలో సులభంగా లభ్యమవుతుంది కూడా. ఈ పుదినాతో టీ చేసుకుని తాగితే ఎలివేటెడ్ టెస్టోస్టెరాన్, హిర్సుటిజం అనే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఎలివేటెడ్ టెస్టోస్టెరాన్, హిర్సుటిజం అంటే ముఖం లేదా వీపు భాగంలో అధిక వెంట్రుకలు కలిగి ఉండటం. ఇది మాత్రమే కాకుండా అండోత్సర్గమును ప్రోత్సహిస్తుంది. ఆండ్రోజెన్లను తగ్గిస్తుంది.  ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా టీ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

గ్రీన్ టీ!!

పిసిఒయస్ సమస్యతో బాధపడుతూ అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి గ్రీన్ టీ మంచి ఎంపిక. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గించడంలో బాగా సహయపడుతుంది. మహిళలు ప్రతిరోజు ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.

అల్లం టీ!!

ఆడవారిలో హార్మోన్ల నియంత్రణలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరంలో నొప్పి తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్, తలనొప్పి వంటి సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. అల్లం టీ ని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తేనె లేదా నిమ్మరసంను ఇందులో జోడిస్తే మరింత ప్రయోజనాలు ఉంటాయి.

అతిమధురం  టీ!!

అతిమధురం అనేది ఆయుర్వేదంలో ఒక ఔషధం. ఎలివేటెడ్ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడానికి అద్భుతమైన ఔషదంగా దీన్ని పేర్కొంటారు. దీని తీపి రుచి కారణంగా తీపి మీద ఇష్టం ఉండి అధిక బరువు ఇతర కారణాల వల్ల ఇబ్బంది పడేవారు అతిమధురం చెట్టు వేర్లను నీటిలో ఉడికించి టీ గా చేసుకుని తాగవచ్చు.

దాల్చిన చెక్కతో టీ!!

దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగడం వల్ల ఎలివేటెడ్ బ్లడ్ షుగర్, ఇన్సులిన్ స్థాయిలు అద్భుతంగా తగ్గించవచ్చు. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా అస్తవ్యస్తమైన పీరియడ్స్ ను నియంత్రణలో తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో కెఫిన్ ఉండదు కాబట్టి నచ్చినప్పుడు దీన్ని తాగచ్చు.

ఇలా అందరికీ అందుబాటులో ఆయుర్వేదపరంగా పిసిఒయస్ సమస్యకు హెర్బల్ టీలు ఉన్నాయి. వాటిని వాడి సమస్యను తగ్గించుకోవడం బాధితుల చేతుల్లోనే ఉంటుంది.

                                       ◆నిశ్శబ్ద.