పండుగలు, ఫంక్షన్లలో తినాలంటే భయమా?
పండుగలు, ఫంక్షన్లలో తినాలంటే భయమా?
పండుగ అంటే ఒక సరదా, సందడి. పండుగ సంబరం ఎలా ఉంటుంది అంటే... కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటి అలంకరణ, ఇంట్లో అందరి హడావిడి. ఇలా పండుగల వేళ ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే ఆడవారిని ఈ పండుగలు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అదేదో ఆడవారి ప్రత్యేక నెలసరి సమస్య అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే...
మరి ఇంకేంటి అనే సందేహం అందరికి వస్తుంది.
పండుగ రోజుల్లో, ప్రత్యేక శుభదినాల్లో అమ్మాయిలను వేధించే సమస్య నోరూరించే ఆహారం. సాధారణంగానే అమ్మాయిలకు స్వీట్స్ అంటే తెగ ఇష్టం ఉంటుంది. పండుగ రోజు ఇంట్లో అమ్మ చేతి వంట మరింత రుచిగా కడుపు వద్దని చెబుతున్నా మనసు కావాలని మారాం చేస్తూ ఉంటుంది. ఆ వ్యామోహం లోనే తినేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టు ఇంట్లో వాళ్ళ మొహమాటం కూడా ఒకటి తోడుగా రెడీగా ఉంటుంది. ఈ కారణాల వల్ల బొజ్జలోకి కాసింత ఎక్కువ స్టఫ్ వెళుతుంది. అయితే ఇలా అతిథి లాగా వచ్చి పోయే పండుగలు ఊరికే పోకుండా అమ్మాయిలకు ఫ్యాట్ లను గిఫ్ట్ గా ఇచ్చిపోతాయి. దాన్ని చూసుకుని అమ్మాయిలు డైటింగ్ బాట పట్టడం, కడుపు మాడ్చుకోవడం చేస్తారు. ఈ గోల ఏదీ లేకుండా ఉండాలంటే పండుగ రోజుల్లో ఆనందంగా తింటూనే బరువు పెరగని మార్గాలను అణ్వేషించాలి. అలాంటి టిప్స్ కొన్ని ఇదిగో అమ్మాయిల కోసం…
పండుగలు శుభకార్యాల సమయంలో పెరిగిపోయే కేలరీల గురించి భయపడి నోరూరించే ఆహారానికి దూరంగా ఉండకండి. సంవత్సరానికి ఒకటి లేదా మహా అయితే అప్పుడప్పుడు వచ్చే సందర్భాలను ఎంజాయ్ చేయకుండా ఉండటం అసలు కరెక్ట్ కాదు. అయితే పండుగ రోజు నాటి విందు ఎంజాయ్ చేస్తూ బరువు పెరగకుండా ఉండటానికి సాధారణ సమయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది.
ఆకలి వేసినప్పుడే తినాలి. ఇలా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. ఆకలి లేకపోయినా అదేదో గంట కొట్టినట్టు తింటూ ఉంటే అనవసరమైన కేలరీలు శరీరంలోకి వెళతాయి. ఒకవేళ ఖచ్చితంగా సమయానికి ఏదో ఒకటి తినే అలవాటు ఉంటే మాత్రం పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. ఓట్స్ ఆధారిత ఐటమ్స్ తీసుకున్నా అవి తొందరగా కడుపు నిండిన భావన కలిగిస్తాయి.
స్వీట్లలోనూ, పిండి వంటల్లోనూ కేలరీలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని అసలు తీసుకోకుండా నిట్టూర్చడం కంటే ఒక పరిమితిలో తీసుకోవడం ఉత్తమం.
పండుగలు, వేడుకల తరువాత స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలసి ఔటింగ్ వెళ్లడం వల్ల తెలియకుండానే శరీరంలో పేరుకున్న కొవ్వు బర్న్ అయిపోతుంది.
రోజువారీ చేసే వ్యాయామాలు మరికొంచెం పటిష్టం చేసుకోవాలి. సాధారణ సమయం కంటే మరికొంత ఎక్కువసేపు వర్కౌట్ లు చేయడం వల్ల కేలరీలు బర్న్ చేయడం సులభం.
వీలైనంత వరకు యాక్టివిటీస్ లో పాల్గొనాలి. ఇంట్లో అయినా బయట అయినా, ఆఫీసులో బద్దకాన్ని దరిచేరనివ్వకూడదు.
అన్నిటికంటే ముఖ్యంగా పండగ అంటే ఎంత వంట చేస్తారో అంత ఇంటి పని కూడా ఉంటుంది. కాబట్టి వంటతో పాటు ఇంటి పనిని కూడా పంచుకోగలిగితే ఎంత తిన్నా ఎలాంటి భయం అక్కర్లేదు….
◆నిశ్శబ్ద.