మహిళల్లో హ్యాపీ హార్మోన్స్ ని పెంచే సూపర్ ఫుడ్స్!
మహిళల్లో హ్యాపీ హార్మోన్స్ ని పెంచే సూపర్ ఫుడ్స్!
మహిళల ఆరోగ్యానికి హార్మోన్లు ముఖ్యమైనవి. ఈ హార్మోన్లే మహిళల్లో మానసిక పరిస్థితిని, శారీరక సమర్త్యాన్ని నిర్దేశిస్తాయి. శారీరకంగా మహిళలు నీరసంగా ఉన్నట్టు అనిపించడం, బద్ధకంగా, ఏ పని మీదా ఆసక్తి లేకుండా ఉండటం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఈరకమైన సమస్యలకు కేవలం హార్మోన్లు అసమతుల్యంగా ఉండటమే ముఖ్యకారణం. ఈ హార్మోన్లను తిరిగి ఆక్టివ్ చేయగలిగితే మహిళలు చురుగ్గా ఉండగలుగుతారు. మహిళలలో హార్మోన్లను చురుగ్గా చేసే కొన్ని అద్భుతమైన న్యూట్రిషన్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిని తీసుకుంటే బద్ధకంగా, నీరసంగా, అసక్తి లేకుండా ఉండే మహిళలు అమాంతం బూస్టింగ్ అయిపోయి చకచకా అన్ని పనులలో ముందుంటారు.
ఇది ఎలా సాధ్యం!
సెరోటోనిన్, ఎండార్ఫిన్స్, డోపమైన్ మరియు ఆక్సిటోసిన్ అనే నాలుగు హార్మోన్లు ఉన్నాయి. ఇవి మహిళల్లో ఉన్న మానసిక అసమతుల్యతలను సరిచేసి సంతోషకరమైన మూడ్స్ ని ఇస్తాయి. ఈ హార్మోన్స్ ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటే సొల్యూషన్ దొరికినట్టే!! మరి ఆ ఆహారపదార్థాలు ఏమిటంటే……..
మంచినీరు!
ఏమిటి మంచినీరు సంతోషాన్ని కలిగిస్తుందా?? అవి అందరూ తాగుతారు కదా అనే సందేహం వచ్చేస్తుంది అందరికీ. సాధారణంగా నీరు తాగడం వేరు. కానీ ఉదయాన్నే ముఖం కడుక్కున్న తరువాత అటు ఇటు హడావిడి పడకుండా మరీ చల్లగా ఉన్నవి కాకుండా సహజమైన నీటిని ఒకచోట కూర్చుని కొద్దికొద్దిగా తాగాలి. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల జరిగేది ఏమిటంటే, శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల రోజంతా శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది.
ఫోలేట్ అధికంగా ఉన్న ఆహారం!
ఫోలేట్ లేదా విటమిన్ B12 అధికంగా ఉండే ఆకుకూరలు, చిక్కుళ్ళు, తోటకూర, గుడ్లు మొదలైన ఆహారాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. డిప్రెషన్ మరియు యాంగ్జయిటీ ఉన్నవారిలో ఫోలేట్ లోపం ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. ప్రతిరోజు ఆహారంలో మిగిలిన కూరలతో పాటు ఒక కట్ట తోటకూరను తాలింపు పెట్టుకుని తినడం వల్ల శరీరానికి కావలసిన ఫోలేట్ లభిస్తుంది.
నట్స్ అండ్ సీడ్స్ ( డ్రై ఫ్రూట్స్, సీడ్స్)!
డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అనేవి ఎంతో ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా గింజలు ట్రిఫ్టోఫాన్ ను కలిగి ఉంటాయి. ఇది సెరొటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదం, వాల్‌నట్, చియా గింజలు, అవిసె గింజలు వంటి కొన్ని గింజలు తీసుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్స్ ఆక్టివ్ అయ్యి సంతోషకరమైన మూడ్స్ పెంచుతాయి.
విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు!
కొన్ని ఖనిజాలు, విటమిన్లు కలిగిన పోషకమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. నిమ్మ, నారింజ, బెర్రీలు, ఉసిరి మొదలైన విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో సమతుల్యంగా పోషకాలను భర్తీ చేయడానికి సహాయపడతాయి. ఇవి మానసిక స్థాయిలను మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్!
డార్క్ చాక్లెట్ వల్ల మూడ్స్ మెరుగవుతాయని చాలామందికి తెలుసు. డార్క్ చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది.
ప్రోబయోటిక్స్!
పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఇడ్లీ/దోస వంటి పులియబెట్టిన ఆహారాలు, మజ్జిగ వంటి వాటిని భోజనంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా పోషకాహార నిపుణులు సూచించిన మరికొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి.
సాయంత్రం అవ్వగానే అలసిపోవడం చాలామంది విషయంలో జరుగుతుంది. ఆ సమయంలో హార్మోన్ల స్థాయిని పెంచడానికి ఒక చిన్న కప్పు కాఫీ తాగచ్చు.
రోజువారీ ఆహారంలో బత్తాయి, అరటిపండు, పప్పు ఎక్కువగా చేర్చుకోవాలి..
రాత్రిపూట పడుకోవడానికి అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. మంచి నిద్ర పడుతుంది.
అతిగా తినడం మానుకోవాలి. అతిగా తింటే హార్మోన్ల వ్యవస్థ గందరగోళం అవుతుంది.
ప్రతి రోజు ఉదయం సమయంలో తీసుకోవలసిన అల్పాహారాన్ని స్కిప్ చేయకూడదు.
ఇవన్నీ పాటిస్తే మహిళల మానసిక స్థాయిని ఇబ్బంది పెట్టే హార్మోన్లు తగ్గి ఆక్టివ్ గా సంతోషంగా ఉంచే హార్మోన్ల స్థాయి పెరుగుతుంది.
◆నిశ్శబ్ద.