ప్రసవం తరువాత తల్లి మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?

 

ప్రసవం తరువాత తల్లి మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?

ప్రతి ఆడపిల్ల జీవితంలో తల్లి కావడం అనేది ఒక ముఖ్యమైన దశ. అందరూ చెప్పుకునేట్టు తల్లి కావడం అనేది మాటల్లో చెప్పినంత సులభం ఏమి కాదు. కేవలం శారీరక మార్పులు, శారీరక ఇబ్బందులు మాత్రమే కాకుండా గర్భం ధరించిన ఆడవారిలో మానసిక సమస్యలు కూడా చాలా చోటు చేసుకుంటాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు, వాటి పనితీరులో ఏర్పడే గందరగోళం వల్ల సాధారణంగానే మానసిక మార్పులు కలుగుతాయి. కానీ ఈ మానసిక మార్పులు, సమస్యలు  కేవలం గర్భాన్ని మోసినన్ని రోజులు మాత్రమే కాకుండా ప్రసవం తరువాత అధికంగా ఉంటాయి.

ప్రసవం తరువాత కొంతమంది తల్లులు ప్రతి చిన్న విషయానికి చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటారు. వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. 

అంతకు మునుపు కంటే ప్రసవం తరువాత అదనపు పని ఉండటం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రసవం జరగడమే చాలా భావోద్వేగమైన సందర్భం అవుతుంది. ఆ తరువాత మానసికంగా, శారీరకంగా సున్నితమైపోతారు మహిళలు. 

బిడ్డను కనడంలో శారీరకంగా, మానసికంగా ఏర్పడే ఒత్తిడి వల్ల అది కాస్తా మానసిక ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.  

బిడ్డను కన్నప్పుడు ఏ బిడ్డ పుట్టిన సమానంగా స్పందించే వారు కొందరే ఉంటారు. ముఖ్యంగా భర్త, మామ, అత్త మొదలైనవారు ఆడపిల్ల పుట్టిందని నిష్టూరంగా చూడటం, తగినంత కేరింగ్ చూపించకపోవడం, చిన్న చూపు చూడటం వంటి సంఘటనలు ఎదురైతే మానసికంగా ఒత్తిడిలోకి వెళతారు.

స్వేచ్ఛను కోల్పోవడం కూడా మానసికంగా తల్లులు ఇబ్బంది పడటానికి కారణం అవుతుంది. పిల్లలను చూసుకుంటూ ఉండటం. తనకంటూ ఎలాంటి ప్రత్యేక సమయం లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రతి విషయంలో పిల్లలను చూపిస్తూ పెద్దవాళ్ళు తల్లులను కట్టడి చేయడం కూడా దీనికి ప్రధాన కారణం. 

ప్రసవంలో తల్లి శరీరంలో అనేక శారీరక, హార్మోన్ పరమైన మార్పులు కలుగుతాయి. ఇవి మానసిక అస్థిరతకు దారితీస్తాయి.

ఇవి మాత్రమే కాకుండా సంతోషం లేని వైవాహిక జీవితం వున్న స్త్రీలకు లేక కష్టపు కాన్పులయిన వారికి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా వుంటుంది. చాలా మంది మహిళలలో  ప్రసవం మానసిక సమస్యను కలుగజేస్తుంది.  

తల్లి మానసిక ఆరోగ్యం ఎందుకు ముఖ్యం?

బిడ్డలు పుట్టాక తల్లులకు భావోద్వేగపరమైన ఆసరా తక్కువగా ఉంటుంది. అందరి శ్రద్ధ, ముఖ్యంగా కుటుంబం శ్రద్ధ బిడ్డ అవసరాలు, ఆరోగ్యం మీదే ఉంటుంది. తల్లిని, తల్లి అవసరాలను, ఆమె ఇబ్బందులను పట్టించుకునే వారు చాలా తక్కువగా ఉంటారు. అలాగే తన సమస్యలు ఏవైనా చెబితే ఇతరులు ఏమనుకుంటారోననే బిడియంతో తల్లి తను విచారంగా ఉన్నట్లు చెప్పదు. అందుకె తల్లి భావోద్వేగాల మీద, ఆమె అవసరాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి.  

ప్రసవం తరువాత వచ్చే మానసిక సమస్యలు ఒక సంవత్సరం పాటు ఉండొచ్చు, ఇది తల్లిని, బిడ్డను కూడా ప్రభావితం చెయ్యొచ్చు. బిడ్డ ఎదుగుదల, అభివృద్ధిలో లోపాలు రావొచ్చు. తల్లి మానసికంగా ఎంత దృఢంగా ఉంటే బిడ్డ విషయంలో అంత జాగ్రత్తగా ఉండగలదు. కాబట్టి తల్లి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం.

                                  ◆నిశ్శబ్ద.