శారీరకలోపం ఉన్నవారిలో అధికంగా ఈ లోపం కూడా ఉంది!

 

శారీరకలోపం ఉన్నవారిలో అధికంగా ఈ లోపం కూడా ఉంది!

మహిళలకు శారీరక ఆరోగ్యం కావాలంటే పోషకాహారం తప్పనిసరి. పోషకాహారం లేకుంటే వారిలో శరీర దృఢత్వం ఎంతగానో తగ్గిపోతుంది. పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్న మహిళల శాతం మన దేశంలో చాలానే ఉంది. అయితే మహిళలలో శారీరక లోపం ఉన్నవారు చాలామంది ఉంటారు. అలాంటివారి విషయంలో పోషకాహర సంస్థ నిర్వహించిన ఒక సర్వే లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. 

మహిళల్లో శారీరక లోపం ఉన్నవారికి సాధారణ మహిళల కంటే కూడా సరైన ఆహారం ఉండటం లేదు. సాధారణంగానే మహిళలు ఇబ్బంది పడే అంశం శారీరక లోపం ఉన్నవారిలో మరింత ఎక్కువగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది??

మహిళలలో శారీరక లోపం ఉన్నవారు కుటుంబ సభ్యుల నుండి నిర్లక్ష్యం చేయబడతారు. అందువల్ల వారికి కుటుంబం నుండి సరైన ఆహారం కానీ, సరైన రక్షణ, సరైన వసతులు ఉండవు. వినడానికి ఇది కాస్త నమ్మలేని విషయంలా ఉన్నా చాలామంది ఒప్పుకుని తీరాల్సిన విషయమిది. శారీరక లోపం ఉన్న మహిళలు స్వతహాగా తమ పని తాము చేసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీని వల్ల కుటుంబ సభ్యుల మీద ఆధారపడటం జరుగుతుంది. ఎవరైనా సరే ఎక్కువగా ఆధారపడితే సహజంగానే ఒక చులకన భావం ఎదుటివారిలో ఏర్పడుతుంది. ఆ చులకన భావమే వారిని ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేస్తుంది. 

ఏదైనా అడగాలన్నా, తీసుకోవాలన్న, స్వేచ్ఛగా తినాలన్నా మనుషుల్లో ఒకానొక బెరుకు తనం, అపరాధ భావన నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలలో ఇలాంటి మహిళల విషయంలో చాలా చిన్న చూపు ఉంటుంది. సాధారణంగానే దిగువ తరగతి మహిళలలో మగవారి డామినేషన్ ఎక్కువ. కష్టపడిన డబ్బును కూడా స్వేచ్ఛగా తినలేని, ఉపయోగించుకోలేని పరిస్థితిలో మధ్యతరగతి, దిగువ తరగతి వారు ఉంటారు. ఇలాంటి మహిళలు మగవారు తినగా మిగిలిన ఆహారంతో సరిపెట్టుకోవడం, మొదట మగవారికి పెట్టడమే కర్తవ్యం అన్నట్టు ఉండటం వల్ల వారిలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.  

శారీరక లోపం ఉన్న మహిళలను భారంగా భావించడం వల్ల వారి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు, బాధ్యతలు ఎప్పుడూ అట్టడుగున ఉంటాయి. కొందరు ఇలాంటి వారి విషయంలో బాధ్యతగా ఉన్నా మరీ అతి ప్రేమ కారణంతో వారిని నిస్సహాయులుగా పెంచుతారు. ఇలా చేయడం వల్ల మహిళలు కనీసం తమకు తాము ఏదీ చేసుకోలేని వారుగా, బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయలేనితనంతో ఉండిపోతారు. ఇలా మహిళలు శారీరక లోపం కారణంగా పోషకాహార లోపానికి కూడా గురవుతూ ఉన్నారు.

శారీరక లోపం కలిగిన మహిళలు బలహీనతను జయించి మంచి ఆహారం తీసుకుంటూ దృఢంగా ఉంటే వారు సాధారణ మహిళలకంటే గొప్ప ప్రతిభతో ,మంచి జీవితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. లోపం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే చివరికి మహిళలు తమ ఉనికిని, తమ జీవితాన్ని తాము కోల్పోతారు. 

అందుకే శారీరక లోపం ఎప్పటికీ తినే ఆహారానికి అడ్డంకి కాకూడదు, అందరికీ సమాన పోషకాలు అవసరం, అది మనిషి తన శరీరానికి అందించాల్సిన కర్తవ్యం కూడా.

                                       ◆నిశ్శబ్ద.