మహిళల్లో జుట్టు నెరిసిపోవడానికి అయిదు ప్రధాన కారణాలు!
మహిళల్లో జుట్టు నెరిసిపోవడానికి అయిదు ప్రధాన కారణాలు!
ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో జుట్టు తొందరగా రంగుమారి తెల్లబడటం కూడా ఒకటి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య ఎదురవుతోంది. కొందరేమో ఇది పోషకాహార లోపం అంటారు. మరికొందరు వంశపార్యపరం అని అంటారు. ఇంకొందరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అలా అంటారు. ఇలా ఎవరికి తెలిసిన కారణాలు వారు చెప్పుకున్నా వారిలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉండటం వల్లనే అలా జరిగిందని డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవారు కొందరు అయితే, మార్కెట్ లో దొరికే నూనెలు, షాంపూలు పిచ్చిగా వాడేవారు కొందరు. మరికొందరు అయితే ఇక విసిగిపోయామంటూ జుట్టుకు రంగేసుకుని ఏ చింతా లేకుండా గడిపేస్తున్నారు.
అయితే ఆడవారిలో జుట్టు ఎందుకు తొందరగా నెరిసిపోతుంది??
సాధారణంగా అయితే మహిళల్లో జుట్టు పొడవు ఉంటుంది కాబట్టి జుట్టు నెరిసిపోతే తొందరగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. జుట్టు నెరిసిపోవడం అనేది ముసలితనానికి సూచన. వయసు పైబడే కొద్దీ జుట్టు తెల్లబడటం అనుభవంలోకి వచ్చే విషయమే. అయితే జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం ఎందుకు జరుగుతుంది?? ఈ ప్రశ్నకు పోషకాహార నిపుణులు కొందరు చెప్పిన అయిదు కారణాలు ఉన్నాయి.
జన్యుపరంగా…
కొన్నిసార్లు జుట్టు తెల్లబడటం అనేది జన్యు పరమైన కారణాల వల్ల సంభవిస్తుందని పోషకార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాతల నుండి తల్లిదండ్రులకు, వారి నుండి పిల్లలకు ఇలా ఓ దశ తరువాత జుట్టు తెల్లబడటం అనేది జరుగుతూ వస్తే అది జన్యుపరమైన కారణం అని అర్థం. దీనికి చాలా వరకు పరిష్కారాలు లేనట్టే చెబుతారు.
కెఫిన్ ఆధారిత పదార్థాలు!!
కాఫీ, టీ వంటివి రోజులో రొటీన్ చాలామందికి. ఆడవారు పని నుండి రిలీఫ్ కోసం ఇంట్లో ఎక్కువ కాఫీ తాగేస్తారు. ఇంకొంత మందికి ఇవి సమయానికి గొంతులో పడకపోతే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు. అయితే ఇందులో ఉండే కెఫిన్ జుట్టు రంగు మారడానికి కారణం అవుతుంది. అందుకే కాఫీలు, టీలు ఎక్కువ తీసుకునే వారిలో జుట్టు తొందరగా నెరిసిపోతుంది. ఇవే కాదు ధూమపానం, మద్యపానం చేసేవారికి కూడా ఇదే సమస్య ఉంటుంది. అలాగే నూనెలో వేయించిన పదార్థాలు కూడా పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరకుండా అడ్డుపడతాయి.
ప్రోటీన్ లోపం!!
పోషకాలు శరీర ఆరోగ్యానికే కాదు, జుట్టు చర్మం, వెంట్రుకలు మొదలైన వాటికి కూడా అవసరం అవుతాయి. మొదటే ఆడవారిలో పోషకాల లోపం ఉంటుంది. దానికి తగ్గట్టు జుట్టు కోసం అందాల్సిన పోషకాలు లభించకపోతే తొందరగా వెంట్రుకలు ప్రభావానికి లోనవుతాయి. సాధారణంగా మనం తినే ఆహారంలో మనకు లభించే పోషకాల కంటే జుట్టు, చర్మం, గోర్లు మొదలైనవాటికి వేరే పోషకాలు అవసరం అవుతాయి. శరీరంలో ఒకో భాగానికి ఒకో పోషకం అవసరమైనట్టు జుట్టుకు తగిన పోషకాలు అందించినప్పుడే దాని పెరుగుదల బాగుంటుంది. బయోటిన్ లోపం ఉంటే జుట్టు పెరగదు, అలాగే దాని సామర్థ్యము తగ్గుతుంది. చిన్నవయసులోనే తెల్లబడుతుంది.
డిప్రెషన్!!
నిజంగా నిజమే!! ఒత్తిడి జుట్టు రాలిపోయేలా చేస్తుందని చాలామంది అంటారు. ఎంతోమందిలో ఆ విషయం నిజమయ్యింది కూడా. అయితే ఎక్కువ కాలం కొనసాగే ఒత్తిడి కేవలం జుట్టు రాలిపోవడానికే కాదు జుట్టు నెరిసిపోవడానికి కూడా కారణం అవుతుంది. ఆడవారిలో ఈ సమస్య స్పష్టంగా కనబడుతుంది కూడా.
ఖనిజాల లేమి!!
కాపర్, సెలినియం, ఐరన్, కాల్షియం, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు శరీరానికి తగిన మోతాదులో లేకపోతే జుట్టు తొందరగా నెరిసిపోతుంది.
ఇలా ప్రతి వయసు వారిలో కూడా జుట్టు నెరిసిపోవడానికి కారణాలు ఉన్నా మహిళల్లో ఇలాంటివి చాలా తొందరగా ఏర్పడతాయి. ఇవన్నీ పరిష్కారం చెసుకుంటే జుట్టును తిరిగి నలుపు రంగులోకి మార్చుకోవచ్చు. అయితే ఓపిక సరైన డైట్ చాలా అవసరం.
◆నిశ్శబ్ద.