లలితా త్రిపుర సుందరి ఆవిర్భావం తెలుసుకుంటే పాప ప్రక్షాళన చేస్తుంది..!

 

లలితా త్రిపుర సుందరి ఆవిర్భావం తెలుసుకుంటే పాప ప్రక్షాళన చేస్తుంది..!

 


అమ్మవారి స్వరూపాలు అనేకం. అయితే వాటిలో కొన్ని చాలా ప్రముఖంగా పరిగణించబడతాయి.  అష్టాదశ శక్తిపీఠాలను ఎలాగైతే చాలా ప్రాశస్తమైనవిగా పరిగణిస్తామె.. అట్లాగే అమ్మవారి నవదుర్గ అవతారాలు అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. దేవీ శరన్నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.  అమ్మవారి అన్ని స్వరూపాలలోకి లలితా త్రిపుర సుందరి స్వరూపం చాలా అందమైనది అని చెబుతారు.  ఈ సందర్భంగా అసలు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? దీని వెనుక ఉన్న పురాణ కథనం ఏమిటి? తెలుసుకుంటే..

సతీ వియోగం తర్వాత పరమేశ్వరుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్లిపోయాడు. కానీ ఆయన వివాహం చేసుకుని,  సంతానం పొందితే.. ఆ బిడ్డ ద్వారా  లోక కళ్యాణం జరగాల్సి ఉంది. అందుకోసం పరమేశ్వరుడిని మోహం వైపు లాగడానికి మన్మధుడు ప్రయత్నిస్తాడు. కానీ పరమేశ్వరుడి నేత్రాగ్ని మంటల్లో భస్మమైపోతాడు.  అయితే ఆ భస్మం నుండి ఒక అసుర శక్తి ఉద్భవించిందట. ఆ అసుర శక్తి అంటే రాక్షస శక్తే భండాసురుడు.  ఈ భండాసురుడు తపస్సు చేసి మాయా శక్తులను సంపాదించుకుని మయుడితో శూన్యకం అనే ఒక నగరాన్ని కట్టించుకున్నాడట. అలా తనూ ఒక నగరాన్ని నిర్మించుకున్న తర్వాత దానికి అధిపతి అతనే.. అటు మాయా శక్తులు సంపాదించుకుని, ఇటు ఒక నగరానికి అధిపతిగా ఉంటూ ఎక్కడ లేని గర్వం, అహంకారం వచ్చేసింది అతనికి.  ఆ బల గర్వంతో దేవతల మీద దాడి చేసి దేవతలను కూడా ఓడించేశాడు.

దేవతలందరినీ ఓడించేసినా అతనిలో రాక్షసత్వం తగ్గలేదు.  దేవతలను బాధించాలంటే దేవతలను మానసికంగా కూడా హింసించాలని అనుకుని దేవతలలో మగవాళ్లు అందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేసేశాడట. తరువాత స్త్రీలు అందరిలో రసక్షయం చేసి వాళ్లలో ఏ కోరిక కూడా లేకుండా  తయారు చేశాడట. ఇలా చేయడం వల్ల సృష్టి ఆగిపోయిందట. ఇలా మగవాళ్లలో నపుంసకత్వం, ఆడవాళ్లలో ఎలాంటి కోరికలు లేకుండా ఉండటం సృష్టి మొత్తంలో జరిగేసరికి  కామ ప్రళయం ఏర్పడిందట.  దీని వల్ల మూడు లోకాలు అల్లాడిపోయాయట.

దేవతలందరూ జరుగుతున్న అనర్థాలను ఆపాలని త్రిమూర్తులను ప్రార్థించారట. అలా ప్రార్థించగానే.. త్రిమూర్తులు ప్రత్యక్షమై.. మేము ఏమీ చేయలేము.. ఈ బ్రహ్మాండాలకు అవతల మణిద్వీపం ఉంది.. అక్కడ లలితా దేవి,  శంభుడు అధిదేవతలు.. వాళ్ల దగ్గరకు వెళదాం పదండి అని చెప్పి అందరూ కలిసి అక్కడికి వెళతారట.  అక్కడికి వెళ్ళిన తరువాత పరమేశ్వరుడి ఆజ్ఞతో  లలితాత్మకమైన ఒక యజ్ఞం చేశారట. ఆ యజ్ఞంలో పరమేశ్వరుడే చిదగ్నిని సృష్టించాడట.మిగిలిన దేవతలు అందరూ లలితా షోడశీ మంత్రాన్ని చేసి తమ తమ భక్తులను ఆ అగ్నిలో ఆహుతుల కింద వేశారట. అలా యజ్ఞం జరిగితే అప్పుడు ఆ అమ్మవారు ఆ చిదగ్ని కుండంలో నుండి ఆవిర్భవించారట. కోటి సూర్యుల కాంతితో.. కోటి చంద్రుల చల్లదనంతో ఆ అమ్మవారు చిదగ్ని కుండం నుండి  ఆవిర్భవించిందట.

అమ్మవారు నాలుగు చేతులతో.. నాలుగు చేతుల్లో చెరకువిల్లు, పుష్పబాణాలు,  పాశం, అంకుశం పట్టుకుని.. దానిమ్మ ఎరుపు రంగు వస్త్రాలలో వెలిగిపోతూ ఉందట.  అందుకే అమ్మవారిని లలితా సహస్ర నామాలలో చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని ఉంటుంది.  అంటే దేవతల కోసం వారి కార్యం కోసం ఆవిర్భవించినదే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారు తనలో నుండే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించిందట. ఆ సైన్యంతో ఆ భండాసురుడిని వధించి దేవతలకు ఆ రాక్షసుడి నుండి విముక్తి కలిగించిందట. అందుకే  లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తే.. లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటే.. అందరి దేవుళ్లను ఆరాధించినంత ఫలితం ఉంటుంది.

                                       *రూపశ్రీ.