నవరాత్రుల ఎనిమిదవ రోజు.. సరస్వతీ దేవి కటాక్షం చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..

 

నవరాత్రుల ఎనిమిదవ రోజు.. సరస్వతీ దేవి కటాక్షం చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..


అమ్మవారు తన ఒక్కొక్క అవతారంలో భక్తులకు ఒక్కొక్క కటాక్షాన్ని ఇస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాలలో సరస్వతి అవతారం చాలా ప్రముఖమైనది. మనిషిని మనిషిగా నిలబెట్టేది,  మనిషిని నాగరికుడిగా మార్చేది జ్ఞానమే.. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేది ఆ సరస్వతి దేవి. తెల్లని చీరలో చేతిలో వీణ,  పుస్తకం,  జపమాల పట్టుకుని ఉన్న సరస్వతి అమ్మ ఈ సృష్టిలో ప్రతి జీవికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మరీ ముఖ్యంగా మనిషికి వెలకట్టలేని జ్ఞానాన్ని ఇచ్చేది ఆ సరస్వతీ మాతనే.. దేవీ నవరాత్రుల సందర్భంగా ఎనిమిదవ రోజున సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తారు.  ఈ సందర్భంగా సరస్వతి దేవి కటాక్షం ఉంటే ఎలా ఉంటుందో.. ఆ అమ్మ కటాక్షం లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. తెలుసుకుంటే..

సరస్వతి కటాక్షం లేకపోతే..

సరస్వతి దేవి కటాక్షం లేకపోతే ఎలా ఉంటుందో కుంభకర్ణుడి వృత్తాంతం తెలుపుతుంది.  రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ అన్నదమ్ములు. ఈ ముగ్గురు బ్రహ్మ అనుగ్రహం కోసం విపరీతమైన తపస్సు చేశారు.  రావణాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ దేవుడు రావణాసురుడు అడిగిన వరాలు అన్నీ ఇచ్చాడు.  ఆ తరువాత కుంభకర్ణుడి వంతు వచ్చింది.  కుంభకర్ణుడు అప్పటికే దేవతలను, మనుషుల్ని,  అప్సరసలను, మునులను.. ఇలా చాలా మందిని అప్పటికే తినేశాడు.  ఇక బ్రహ్మ నుండి వరం దొరికితే ఏం చేస్తాడో అని దేవతలందరూ భయపడ్డారు.  సరస్వతి దేవిని వేడుకుని కుంభకర్ణుడు బ్రహ్మను వరం అడిగే కొద్దిసేపు కుంభకర్ణడికి మరపు ఉండేలా చేయమని కోరారు.

దేవతలు అడిగిన ప్రకారం సరస్వతి దేవి కుంభకర్ణుడు బ్రహ్మను వరాలు అడిగే ముందు అతనికి వాక్కును మార్చేస్తుంది.  అతను ఏం అడుగుతున్నాడో అతనికే అర్థం కాకుండా చేస్తుంది. ఇలా చేశాక కుంభకర్ణుడు తనకు నిర్జీవత్వం కావాలి అని అడగడానికి బదులు నిద్రావత్వం కావాలి అని అడుగుతాడు. అంటే నిర్జీవంగా.. మరణం లేకుండా ఉండాలి అని కోరుకోవాల్సిన వాడు.. నిద్రావత్వం.. బాగా నిద్రపోతూ ఉండేలా వరం ఇమ్మని అడగటం జరుగుతుంది. కుంభకర్ణుడు అలా అడగగానే బ్రహ్మదేవుడు తథాస్తుఅంటాడు.  ఇంకేముంది కుంభకర్ణుడికి ఎప్పుడూ నిద్రే ఉండేది. ఇలా సరస్వతి  దేవి కటాక్షం అనేది లేకపోతే ఇలాంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సరస్వతి దేవి కటాక్షం దొరికితే..

యజ్ఞవల్క్య మహర్షి మూడు వేదాలను ముగ్గురు మహర్షుల దగ్గర నేర్చుకుంటాడు. ఆ తరువాత వైశంపాయన మహర్షి దగ్గర యజుర్వేద అధ్యయనం చేసాడు. దీంతో నాలుగు వేదాలు ఆయనకు చాలా బాగా వచ్చేశాయి.  నాలుగు వేదాలు తనకు బాగా వచ్చనే అహంకారం అతనిలో ఎక్కువైంది.  ఒకసారి వైశంపాయనుడు ఏదో ఒక పొరపాటు పని చేసేసరికి గురువు అని కూడా చూడకుండా వైశంపాయన మహర్షిని ధూషిస్తాడు యాజ్ఞవల్క్యుడు . దీంతో వైశంపాయనుడు ఆగ్రహించి.. నేను నీకు నేర్పించిన విద్యను కక్కేసి ఇక్కడి నుండి వెళ్లిపో అని అంటాడు.  యాజ్ఞవల్క్యుడు అలాగే చేయగా.. ఆ కక్కిన పదార్థాన్ని తిత్తిర పక్షులు తిన్నాయట.  ఆ తరువాత అవి అరవడం ద్వారా జ్ఞానాన్ని వ్యక్తం చేశాయట. అదే తైత్తరీయ ఉపనిషత్తు అని అంటారు.

ఇదంతా జరిగిన తరువాత యజ్ఞవల్క్య మహర్షి సూర్యుడిని ఆశ్రయించి యజుర్వేదం అభ్యసించాడట. ఆ తర్వాత సరస్వతీ దేవి తపస్సు చేయగా ఆ అమ్మ కరుణించి దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో యజ్ఞవల్క్య మహర్షి సరస్వతి దేవిని స్తుతిస్తూ 27 శ్లోకాలతో కూడిన స్తుతిని చేశాడు. ఆ స్తుతిని ఎలాంటి మూర్ఖుడు అయినా సరే.. ఒక సంవత్సరం పాటు భక్తిగా చేయగలిగితే ఎంతటి బుద్దిలేని వాడికి అయినా బుద్ధి వికసిస్తుందట. అమ్మవారి అనుహగ్రం ఉంటే ఇలాగే జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.                             

*రూపశ్రీ.